Betala swamy Jatara : నాలుగు వందల సంవత్సరాల క్రితం నిర్మించిన అరుదైన బేతాళ స్వామి ఆలయ జాతరకు సర్వం సిద్ధం అయ్యింది. మెదక్ జిల్లాలోని అల్లాదుర్గం మండల కేంద్రంలో నిర్మించిన బేతాళ స్వామి దేవాలయం ఉత్సవాలు, మెదక్ జిల్లాలోని ఏడుపాయల ఉత్సవాల తర్వాత అతి పెద్ద జాతరగా భావిస్తారు. గ్రామస్తుల కథనం ప్రకారం, 400 సంవత్సరాల క్రితం గ్రామంలోని ప్రజలు తీవ్ర రోగాల బారిన పడడంతో, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అక్కడి పాలకుడు, భూత, ప్రేత, పిశాచలకు అధిపతిగా భావించే బేతాళ స్వామికి గుడి కట్టించారు. గుడి కట్టిన తర్వాత, ప్రజలందరికీ రోగాలు తగ్గిపోవడంతో, బేతాళ స్వామికి పెద్ద ఎత్తున ఉత్సవాలు నిర్వహించడం మొదలుపెట్టారు.
ఇలా ప్రతి సంవత్సరం ఇదే సమయంలో ఏడు రోజులు గ్రామంలో ఉత్సవాలు నిర్వహిస్తారు. సోమవారం రోజు, గ్రామా దేవత పోలేరమ్మకు బోనాలు అర్పించడంతో ఘనంగా ఉత్సవాలు మొదలవుతాయి. ఈ విధంగా, వరుసగా మంగళవారం 15వ తేదీన పోచమ్మ దేవతకు బోనాలు, 16వ తేదీన దుర్గమ్మ దేవతకు బోనాలు, 17వ తేదీ బేతాళ స్వామికి బోనాలు, 18న బేతాళ స్వామికి ఎడ్ల బండ్ల ఊరేగింపు, 19న భాగవతం, 20న భజన, 21న సాంస్కృతిక కార్యక్రమాలు, 22న పాచి బండ్ల ఊరేగింపు నిర్వహిస్తామని ఆలయ నిర్వాహకులు ప్రకటించారు.
జాతర వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు నిర్వాహకులు అవసరమైన ఏర్పాట్లు చేశారు. అరుదైన బేతాళ స్వామి ఉత్సవాలకు, తెలంగాణ నుంచే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్ర ప్రదేశ్ నుండి పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చి బేతాళ స్వామి కి తాము కోరిన కోరికలు తీర్చినందుకు మొక్కులు తీర్చుకుంటారు. గ్రామస్తులు, తమ బంధువులను, స్నేహితులను పిలిచి పెద్ద ఎత్తున సంబురాలు చేసుకుంటారు.
ఈ గ్రామంలో, చుట్టుపక్కల గ్రామాలలో చాలా మంది పేర్లు బేతాళ స్వామి పేరు పెట్టుకోవడం ఆనవాయితీ. ప్రతి ఇంట్లో కూడా, బేతయ్య, బేతమ్మ అనే పేర్లు ఉన్న వ్యక్తులు ఉండటం అనేది అక్కడ సర్వ సాధారణం. జాతర కు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా, జిల్లా ఎస్పీ తగిన సిబ్బంది ని నియమించారు. భక్తులు మంచి నీరు, పార్కింగ్, హెల్త్ క్యాంపు తదితర సౌకర్యాలు కూడా ఏర్పాటు చేశారు. జాతరలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని, ఉత్సవాలు విజయవంతం చేయాలనీ ఆలయ నిర్వాహకులు పిలుపునిచ్చారు. ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా, ఆర్టీసీ అధికారులు సంగారెడ్డి, జోగిపేట, మెదక్, ఇతర ప్రాంతాల నుండి స్పెషల్ బస్సులు నడపనున్నారు.
సంబంధిత కథనం