నవంబర్ 11న ఉపఎన్నిక జరగనున్న జూబ్లీహిల్స్ స్థానాన్ని దక్కించుకునేందుకు కాంగ్రెస్ పార్టీ విశ్వప్రయత్నాలు చేస్తోంది. అభ్యర్థి ఎంపికపై చాలా రోజులు సస్పెన్స్ నెలకొన్నది. తాజాగా అభ్యర్థిని ఏఐసీసీ ప్రకటించింది. సుదీర్ఘ చర్చలు, సర్వేల ఆధారంగా ముగ్గురు పేర్లు నవీన్ యాదవ్, బొంతు రామ్మోహన్, సీఎన్ రెడ్డి పేర్లను ఏఐసీసీకి పంపింది. అయితే తాజాగా కాంగ్రెస్ అధిష్ఠానం నవీన్ యాదవ్‌ను జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థిగా ప్రకటిచింది.
నవీన్ యాదవ్‌ను ఖరారు చేయడంలో ఈ నియోజకవర్గంలో ఆయనకు ఉన్న పట్టు, సామాజిక సమీకరణాలు కీలక పాత్ర పోషించాయి. ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించింది. మాగంటి గోపినాథ్ సతీమణి సునీతను బరిలోకి దింపింది. సెంటిమెంట్‌ను అనుకూలంగా మార్చుకోవాలని బీఆర్ఎస్ అనుకుంటుండగా.. ఎలాగైనా ఈ సీటను దక్కించుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది.
నవీన్ యాదవ్ గతంలో జూబ్లీ హిల్స్ నుండి రెండుసార్లు పోటీ చేశారు. 2014లో ఏఐఎంఐఎం టికెట్‌పై రెండో స్థానంలో నిలిచారు. 2018లో స్వతంత్ర అభ్యర్థిగా మూడో స్థానంలో నిలిచారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆయన నవంబర్ 2023లో కాంగ్రెస్‌లో చేరారు. ఇప్పుడు మరోసారి అధిష్టానం ఆయనను అభ్యర్థిగా ప్రకటించింది.
నవంబర్ 11న జరగనున్న జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి 25,000 కంటే ఎక్కువ ఓట్ల మెజారిటీ సాధించడమే సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ పెట్టుకున్నారు. గత ఎన్నికల డేటాపైనా రేవంత్ రెడ్డి పరిశీలించినట్టుగా తెలుస్తోంది. గతంలో బీఆర్ఎస్ నాయకుడు మాగంటి గోపీనాథ్ 2014లో 9,242 ఓట్ల ఆధిక్యంతో, 2018లో 16,004 ఓట్ల ఆధిక్యంతో, 2023లో 16,337 ఓట్ల ఆధిక్యంతో ఈ స్థానాన్ని గెలుచుకున్నారు. ఉప ఎన్నికలో బీఆర్ఎస్ ఓటు అధికార పార్టీ వైపు మళ్లే అవకాశం ఉందని కాంగ్రెస్ ఆ గణాంకాలను దాటాలని, రేవంత్ రెడ్డి 25 వేల మెజారిటీని స్పెషల్ టార్గెట్‌గా పెట్టుకున్నట్టుగా సమాచారం.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నవంబర్ 11న జరుగుతుంది. ఓట్ల లెక్కింపు నవంబర్ 14న ఉంటుందని భారత ఎన్నికల సంఘం ప్రకటించింది. నోటిఫికేషన్ అక్టోబర్ 13 విడుదల చేస్తారు. నామినేషన్లకు తుది గడువు అక్టోబర్ 21 వరకు ఉంటుంది. నామినేషన్ల పరిశీలన అక్టోబర్ 22 చేస్తారు. నామినేషన్ల ఉపసంహరణ చివరి గడువు అక్టోబర్ 24.
ఈ ఏడాది జూన్ 8న భారత రాష్ట్ర సమితి సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ నియోజకవర్గం పరిధిలో 3,92,669 ఓటర్లు ఉన్నారు.