రాష్ట్రంలో రుతుపవనాలు విస్తరిస్తున్నాయి. ఇప్పటికే పలుచోట్ల సాగు పనులు షురూ అవుతున్నాయి. ఈసారి ముందుగానే రుతుపవనాలు ఎంట్రీ ఇవ్వటంతో… రైతులు సాగుబాటు పనులకు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలోనే… రైతు భరోసా నిధులపై కూడా ఆశలు పెంచుకుంటున్నారు. ఈ ఖరీఫ్ సీజన్ కు ముందుగానే డబ్బులు ఇస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు.
అయితే రైతు భరోసా స్కీమ్ నిధులపై రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేశారు. రైతాంగానికి కావాల్సిన ఎన్నో కార్యక్రమాలు ప్రభుత్వం చేపడుతుందన్నారు. తెలంగాణ రైతులను కాపాడుకుంటూ రూ. 35 వేల కోట్లను జమ చేశామని చెప్పారు. అయితే ఈ సంవత్సరం రైతు భరోసా డబ్బులను... పంటలు వేయకముందే రైతుల ఖాతాలో జమ చేస్తామని చెప్పుకొచ్చారు.
ఇవాళ హుస్నాబాద్ మార్కెట్ కమిటీలో మంత్రి తుమ్మల 'తెలంగాణ రైతు మహోత్సవం'ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రైతులు ఆదాయాన్ని పెంచుకోవాలంటే మానవాళికి కావలిసిన అన్ని పంటలు పండించాలని చెప్పారు. ప్రకృతిసిద్ధంగా, సేంద్రీయ ఎరువులతో, పంటలు పండించాలని సూచించారు. అప్పుడే మన ధాన్యానికి ఎక్కువ డిమాండ్ ఉంటుందన్నారు.
“వ్యవసాయ యూనివర్సిటీ వీసీ, ఫ్రొఫెసర్లు, శాస్త్రవేత్తలు, అనుభవం ఉన్న రైతుల ద్వారా నేర్చుకోండి. మన భూమికి ఏ పంట అవసరం, ఏ పంట వేస్తే ఆదాయం అధికంగా వస్తుంది అని చూసిన తర్వాతే పంటలు వేయాలి. మనం ఇతర రాష్ట్రాల నుండి కూరగాయలు తెచ్చుకునే పరిస్థితి వచ్చింది; మనం ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలకు కూరగాయలు పంపించే స్థాయికి రావాలి” అని మంత్రి తుమ్మల చెప్పారు.
హుస్నాబాద్ రాబోయే రోజుల్లో పచ్చని పాడి పంటలతో సస్యశ్యామలంగా ఉండాలని తుమ్మల ఆకాంక్షించారు. హుస్నాబాద్ లో గోదాములు ఏర్పాటు చేస్తామని చెప్పారు. హుస్నాబాద్ కి దగ్గరలోనే ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ వచ్చే నెలలో ప్రారంభిస్తామని ప్రకటించారు.