Rajanna Siricilla Aghori: రాజన్న సిరిసిల్లలో అఘోరీ హల్‌చల్, అడ్డుకున్న పోలీసులు, బలవంతంగా హైదరాబాద్ తరలింపు
Rajanna Siricilla Aghori: రాజన్న సిరిసిల్ల జిల్లాలో అఘోరీ హల్ చల్ చేసింది. వేములవాడకు వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. వేముల వాడ వెళ్తానని పట్టుబట్టడంతో టోయింగ్ వాహనంతో అఘోరీని హైదరాబాద్ తరలించారు. వివాదాస్పద వ్యాఖ్యలతో హడావుడి చేసేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు.
Rajanna Siricilla Aghori: రాజన్న సిరిసిల్ల జిల్లాలో అఘోరీ చేసిన హంగామా పోలీసుల్ని పరుగులు పెట్టించింది. వేములవాడలో దర్గా కూలుస్తానంటూ వెళ్తుండగా పోలీసులు అడ్డుకుని టోయింగ్ వ్యాన్ తో హైదరాబాద్ తరలించారు.

సిరిసిల్లలో అఘోరి మరోసారి హల్చల్ చేసింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పోలీసులను హైరానాకు గురి చేసింది. వేములవాడకు బయలు దేరిన అఘోరిని తంగళ్ళపల్లి మండలం జిల్లెల్ల వద్ద పోలీసులు అడ్డుకోవడంతో నిరసనకు దిగారు. రోడ్డుపై కారు నుంచి బయటకు రాకుండా డోర్ తీయకుండా అద్దాలు దించకుండా కారులోనే అఘోరి ఉండడంతో పోలీసులు టోయింగ్ వ్యాన్ తో హైదరాబాద్ కు తరలించారు.
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ ఆవరణలోని దర్గాను ఫిబ్రవరి 3న కూల్చివేస్తానని ఇటీవల నాగసాధు అఘోరి ప్రకటించింది. ఉమ్మడి కరీంనగర్ లో గత నాలుగైదు రోజులుగా తిరిగిన అఘోరీ హైదరాబాద్ రూట్ లో సిద్దిపేట సిరిసిల్ల మీదుగా వేములవాడకు బయలు దేరింది. వేములవాడ కు అఘోరీ చేరకుండా అన్ని దారుల్లో నిఘా పెట్టగా సిరిసిల్ల సమీపంలోని జిల్లెల్ల శివారులో అఘోరీ కారును పోలీసులు గుర్తించి అడ్డుకున్నారు.
పోలీసులతో అఘోరి వాగ్వివాదానికి దిగారు. కారులో నుంచి దిగకుండా, అద్దాలు దింపకుండా అఘోరి కారులోనే ఉండిపోవడంతో పోలీసులు చివరకు అదుపులోకి తీసుకున్నారు. అఘోరి కారును టోయింగ్ వ్యాన్ తో బంధించి హైదరాబాదు రూట్లో తరలించారు.
అగ్రహంతో వీడియో చిత్రీకరణ...
పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన అఘోరి విచిత్రంగా ప్రవర్తించింది. పోలీసులు ఎంత సమ్ముదాయించిన కారు నుంచి దిగకుండా అద్దాలు దించకుండా కారులోనే భీష్మించింది అఘోరీ. చివరకు పోలీసులు అఘోరీ కారును టోయింగ్ వ్యాన్ తో తరలించడంతో ఆగ్రహంతో ఊగిపోతూ కదలే కారు సైడ్ డోర్ ద్వారా బయటికి చూస్తూ సెల్ పోన్ లో చిత్రీకరించారు. పోలీస్ ఎస్కార్ట్ తో అఘోరి వాహనాన్ని హైదరాబాద్ శివారుకు తీసుకెళ్లి వదిలేశారు. మళ్లీ ఏదో రకంగా వేములవాడకు వచ్చే అవకాశం ఉండడంతో పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.
(రిపోర్టింగ్ కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)