Adulterated Milk : జగిత్యాల జిల్లాలో కల్తీ పాల బాగోతం - వెలుగులోకి అసలు విషయాలు-adulterated milk busted in jagtial district ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Adulterated Milk : జగిత్యాల జిల్లాలో కల్తీ పాల బాగోతం - వెలుగులోకి అసలు విషయాలు

Adulterated Milk : జగిత్యాల జిల్లాలో కల్తీ పాల బాగోతం - వెలుగులోకి అసలు విషయాలు

HT Telugu Desk HT Telugu
Dec 08, 2024 07:01 AM IST

జగిత్యాల జిల్లాలో కల్తీ పాలు కలకలం సృష్టిస్తున్నాయి.‌ అనారోగ్యానికి గురైన కుటుంబం పాలు పోసే వ్యక్తిని నిలదీయడంతో కల్తీ పాల బాగోతం బయటపడింది. పాలు పోస్తున్న మల్లయ్యపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకునే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.

కల్తీ పాల బాగోతం
కల్తీ పాల బాగోతం

జగిత్యాల జిల్లాలో కల్తీ ఆహార పదార్థాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇటీవల ఓ హోటల్ లో ఇడ్లీ లో జెర్రిరాగ తాజాగా కల్తీ పాలు వెలుగులోకి వచ్చింది. జగిత్యాల బృందావనం కాలనీలో కర్బూజ లావణ్య కుటుంబ సభ్యులు అనారోగ్యం పాలు కావడంతో ఏ డాక్టర్ వద్దకు వెళ్ళిన నయం కాలేదు. వాడే పాల వల్ల అలా అవుతుందని అనుమానించారు.

yearly horoscope entry point

అందుకు అనుగుణంగా పాలు డెటాల్ వాసన రావడంతోపాటు పాల అడుగుబాగంలో పిండిలా ఉండడంతో పాలు పోసే మేడిపల్లి మండలం వెంకట్రావుపేట్ కు చెందిన మైదం మల్లయ్య ను నిలదీశారు. పాలు పగిలిపోకుండా ఉండేందుకు బేగింగ్ సోడా కలిపానని స్పష్టం చేశాడు. వెంటనే స్థానికులు ఆయన పోసే పాలను టెస్ట్ చేయడంతో పది శాతం పాలు కూడా లేవని తేలింది. మల్లయ్యను పట్టుకుని పోలీసులకు అప్పగించగా పాలను మున్సిపల్ అధికారులు సీజ్ చేసి పుడ్ సేఫ్టీ అధికారులకు పిర్యాదు చేశారు.

తనిఖీలు చేసి కేసు నమోదు...

స్థానికుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఫుడ్ ఇన్స్పెక్టర్ అనూష తనిఖీలు చేపట్టారు. వెంకట్రావు మల్లయ్య స్వగ్రామం వెంకట్రావుపేటకు వెళ్లి ఆయన పాలు సేకరించే వారిని విచారించి పాలల్లో కలిపే పదార్థాలను పరిశీలించారు. ఇంటి వద్ద ఎలాంటి ఆనవాళ్లు లభించలేకపోయినప్పటికీ పాలు తీసుకొచ్చేటప్పుడు పాలు పగిలిపోకుండా ఉండేందుకు బేకింగ్ సోడా కలుపుతున్నట్టు విచారణలో తేలిందని అనూష తెలిపారు.

పాల శాంపిల్ సేకరించి ల్యాబ్ పంపించి మల్లయ్య పై కేసు నమోదు చేశామని స్పష్టం చేశారు. మల్లయ్య తో పాటు ఆ గ్రామం నుంచి పాలు సేకరించి పట్టణానికి తీసుకువచ్చే పలువురి పాలను కూడా పరీక్షించామని అందులో ఎలాంటి కల్తి అవశేషాలు లేవని స్పష్టం చేశారు.

రెండు బర్రెలు... 40 లీటర్ల పాలు

ప్రస్తుతం పాలల్లో బేకింగ్ సోడా కలిపినట్లు వెలుగులోకి వచ్చిన మల్లయ్య ఉదాంతాన్ని పరిశీలిస్తే పాల కంటే నీళ్లే అమ్ముతున్నట్లు వెలుగులోకి వచ్చింది. మల్లయ్యకు రెండు బర్రెలు ఉండగా అవి ఇచ్చే పాలతో పాటు గ్రామంలో పలువురి వద్ద పది లీటర్ల వరకు పాలు సేకరించి 40 లీటర్ల పాలు తయారుచేసి జగిత్యాల పట్టణంలో విక్రయిస్తాడు. ఆ పాలల్లో అసలు పాలకంటే నీళ్లు ఎక్కువ ఉన్నట్లు పరీక్షల్లో తేలింది. మల్లయ్య సైతం నిర్భయంగా తన తప్పును ఒప్పుకున్నాడు.

తనకున్న రెండు గేదలు ఇచ్చే పాలతో పాటు పది లీటర్ల వరకు ప్యాకెట్ పాలు ఇతరుల నుండి సేకరించిన పాలు కలిపి మొత్తం 40 లీటర్ల వరకు తయారు చేసి జగిత్యాలలో అమ్ముతున్నట్టు తెలిపారు. బేకింగ్ సోడా నీళ్లు తప్ప కల్తీ ఏమి లేదని మల్లయ్య అమాయకంగా తన పని తనాన్ని చెప్పుకొచ్చారు.

అధికారుల నిర్లక్ష్యమే కల్తీ కారణం...

అధికారుల నిర్లక్ష్యం వల్లే కలిపి దందా సాగుతుందని సర్వత్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఏదైనా సంఘటన జరిగినప్పుడే హడావిడి చేసే అధికారులు ఆ తర్వాత పట్టించుకోకపోవడం వల్లే కల్తీ రాయుళ్ళు రెచ్చిపోతున్నారని జనం ఆరోపిస్తున్నారు. చేతులు కాలాక ఆకులు పట్టుకునేలా వ్యవహరించే అధికారులు అనునిత్యం తనిఖీలు నిర్వహిస్తే కల్తీ జరగదని అభిప్రాయపడుతున్నారు.‌ ఇప్పటికైనా అధికారులు మేల్కొని కల్తీలపై తనిఖీలతో కొరఢా ఝుళిపించాలని జనం కోరుతున్నారు.

రిపోర్టింగ్ : కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు.

Whats_app_banner

సంబంధిత కథనం