Ration Card eKYC : రేషన్ కార్డు ఈకేవైసీకి క్యూకట్టిన జనం-చివరి తేదీపై కీలక ప్రకటన
Ration Card eKYC : బోగస్ రేషన్ కార్డుల తొలగింపునకు రాష్ట్ర ప్రభుత్వం రేషన్ ఈ కేవైసీ చేపట్టింది. దీంతో ప్రజలు రేషన్ దుకాణాల వద్ద పోటెత్తారు. బయోమెట్రిక్ పడని వాళ్లు అప్డేట్ కోసం ఆధార్ కేంద్రాలను ఆశ్రయిస్తున్నారు.
Ration Card eKYC : బోగస్ రేషన్ కార్డులు తొలగించాలనే ఉద్దేశంతో చేపట్టిన రేషన్ ఈకేవైసీ కార్యక్రమంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తెల్లరేషన్ కార్డులో పేర్లు ఉన్న లబ్ధిదారులు అందరూ ఈ కేవైసీ చేయించుకోవాలని రేషన్ దుకాణాలకు పరిగెత్తుతున్నారు. ఈ నెల చివరి వరకే గడువు ఉందని ప్రచారం జరగడంతో రేషన్ దుకాణాల వద్ద ప్రజలు క్యూకట్టారు. ప్రభుత్వ అధికారులు ఈ కేవైసీపై స్పష్టమైన సమాచారం ఇవ్వకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో రేషన్ దుకాణాలలో వేలిముద్రలు రావట్లేదని బయోమెట్రిక్ అప్డేట్ కోసం కొందరు ఆధార్ కేంద్రాలకు క్యూకడుతున్నారు. ఐదు సంవత్సరాలు నిండిన వారికి తప్పనిసరి వేలిముద్రలు అప్డేట్ చేసుకోవాల్సి ఉన్నందున వారికి రేషన్ దుకాణాలలో వేలిముద్రలు రావడం లేదు.
ట్రెండింగ్ వార్తలు
ఆధార్ కేంద్రాల వద్దకు పరుగులు
ఈకేవైసీ చేసుకోవాలంటే వేలిముద్రలు తప్పనిసరి అని పేర్కొనడంతో సమీపంలోని ఆధార్ కేంద్రాల వద్దకు ప్రజలు పరుగులు పెడుతున్నారు. ఆధార్ కేంద్రాల్లో నమోదు చేసుకున్న రోజు నుంచి 90 రోజులలోపు అప్డేట్ అవుతుంది. ఈ కేవైసీ చేసుకోవడానికి ఎక్కువ సమయం లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రేషన్ దుకాణాలలో బియ్యం తీసుకునే పేద కుటుంబాలు ఆధార్ కేంద్రాలు రేషన్ దుకాణాలు చుట్టూ తిరగలేక సతమతమవుతున్నారు. రేషన్ ఈ కేవైసీపై సర్వత్వ విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. వేలిముద్రలు పడని వారి పరిస్థితిపై ప్రభుత్వ అధికారులు స్పష్టమైన సంకేతాలు ఇవ్వకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు రేషన్ ఈకేవైసీకి గడువు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. నిర్మల్ జిల్లాలో తెల్ల రేషన్ కార్డులు 2,08,000 ఉండగా.. 6,43,000 మంది లబ్దిదారులు ఉన్నారు.
కేవైసీకి చివరి తేదీ ప్రకటించలేదు- సివిల్ సప్లై అధికారి
అయితే ఈ విషయమై నిర్మల్ జిల్లా సివిల్ సప్లై అధికారి మాట్లాడుతూ... కేవైసీ చేసుకోవడానికి చివరి తేదీ అంటూ లేదన్నారు. ఇప్పటికైతే ప్రభుత్వ నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదన్నారు. ఇప్పటికే మండలాల్లోని తహసీల్దార్లు రేషన్ డీలర్లకు సూచనలు అందించినట్లు పేర్కొన్నారు. వేలిముద్రలు రానివారు ఆధార్ కేంద్రాలకు వెళ్లి సరిచేసుకున్నాకనే కేవైసీ చేసుకోవచ్చని ఆందోళన పడాల్సిన అవసరం లేదన్నారు.