Adilabad Water Projects : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షాలు, నిండుకుండల్లా జలాశయాలు
Adilabad Water Projects : గత వారం రోజులుగా ఉమ్మడి ఆదిలాబాద్ వ్యాప్తంగా కురుస్తు్న్న వర్షాలకు ప్రాజెక్టులు జలకళ సంతరించుకున్నాయి. పలు చోట్ల వాగుల దాటికి వంతెనలు కొట్టుకుపోయాయి.
Adilabad Water Projects : గత వారం రోజుల క్రితం వాతావరణం ఒక్కసారిగా కూల్ గా మారిపోయింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని చోట్ల భారీ వర్షాలకు ఇండ్లు నెలకూలాయి. కొన్నిచోట్ల తాత్కాలిక వంతెన లు వరదలో కొట్టుకుపోయాయి. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలం అందెవెల్లి వద్ద పెద్దవాగులో నిర్మించిన తాత్కాలిక వంతెన కొట్టుకుపోయింది. కెరమెరి, జైనూర్, ఆసిఫాబాద్, వాంకిడ మండలాల్లో రాత్రి కురిసిన భారీ వర్షానికి పెద్దవాగులో నీటి ప్రవాహం పెరిగింది. ఆదివారం ఒక్కసారిగా వరద ఉధృతిపెరడంతో కాగజ్ నగర్ దహేగాం మధ్య నిర్మాణంలో ఉన్న అందె వెల్లి బ్రిడ్జి కింది భాగంలో తాత్కలిక వంతెన కొట్టుకుపోయింది. దీంతో కాగజ్ నగర్ నుండి దహేగాం, భీమిని మండలాలకు సుమారు 55 గ్రామాలకు రాక పోకలు స్తంభించిపోయాయి. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని రెంకోని వాగు పైన వంతెన లు పూర్తికాక పోవడంతో తాత్కాలిక రోడ్డు పూర్తిగా కొట్టుకుపోయింది, దీంతో ఆ ప్రాంత ప్రజలు 20km దూరం నుండి తిరిగి వెళ్లాల్సి వస్తుంది. జిల్లా వ్యాప్తంగా గత వారం రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శుక్రవారం ఉదయం నుంచి ఏకాదటిగా ఓ మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు కాలనీలో రహదారులు జలమయమయ్యాయి. అటు రూరల్ మండలంలోని పలు గ్రామాలలో సైతం వర్షం కురుస్తుంది. ఇప్పటికే వాతావరణ శాఖ జిల్లాలో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయంటూ ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
నిండుకుండలా సదర్శాట్...
ఖానాపూర్, కడెం మండలాల రైతులకు సాగునీరందించి అన్నపూర్ణగా నిలిచే సదర్మాట్ ఆనకట్ట నిండుకుండలా మారి తొణికిసలాడుతోంది. ఆనకట్టపై నుంచి గంగమ్మ పరవళ్లు తొక్కుతూ దిగువకు పరుగులు పెడుతోంది. పాలనురుగుల నీటి అందాలు చూపరు లను కట్టిపడేస్తున్నాయి. ఖానాపూర్ మండలం మేడంపల్లి గ్రామ పంచాయతీ శివారులో ఉన్న సదర్మాట్ ఆనకట్ట పూర్తి స్థాయిలో నిండటంతో నీటిపారుదల శాఖ అధికారులు బుధ వారం రెండు గేట్లను తెరిచి సదర్మాట్ కాలువ ద్వారా దిగువకు వదులుతున్నారు. కాలువ ద్వారా సాగునీరు పంట పొలాల్లోకి రావడంతో రైతులు వ్యవసాయ పనులలో నిమగ్న మయ్యారు. ఆనకట్ట వద్ద నీటిమట్టం బుధవారం 8 అడుగులకు చేరుకుంది. గతంలో జరిగిన అవాంఛనీయ సంఘటనలు పునరావృతం కాకుండా అధికారులు లోపలకు వెళ్లకుండా చర్యలు చేపట్టారు.
స్వర్ణ ప్రాజెక్టులో పెరుగుతున్న స్వర్ణ నీటిమట్టం
అయిదు రోజులుగా వరుసగా కురుస్తున్న వర్షంతో స్వర్ణ జలాశయంలో నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. నిత్యం అడుగు చొప్పున నీరు చేరుతూ ఆయకట్టు రైతుల్లో ఆనందాన్ని నింపు తోంది. పూర్తిస్థాయి నీటి మట్టం 1183 అడుగులు కాగా ప్రస్తుతం 1179 అడు గులకు చేరుకుంది. పూర్తి నీటినిల్వ సామర్థ్యం 1.48 టీఎంసీలు కాగా జలాశయంలో ఇపుడు 1.080 టీఎం సీల నీరు వచ్చి చేరింది. ప్రాజెక్టులోకి 830 క్యూసెక్కుల ఇన్ ఫ్లో కొనసాగుతోందని నీటిపారుదలశాఖ అధికారులు తెలిపారు.
కడెంకు కొనసాగుతున్న వరద
కడెం జలాశయానికి వరదనీటి రాకడ కొనసాగు తోంది. ఎగువప్రాంతాల్లో వర్షం కురుస్తున్న కారణంగా వరద ప్రవాహం నిరంతరంగా వస్తోంది. ప్రాజెక్టులోకి 17,557 క్యూసెక్కుల వరకు రావడంతో అధికారులు రెండు వరదగేట్లను ఎత్తి 14,391 క్యూసెక్కులు దిగువకు వదిలారు. శనివారం రాత్రి 8 గంటల సమయానికి ఇన్ ఫ్లో 10,849 క్యూసెక్కులు వస్తుండగా రెండు వరదగేట్ల ద్వారా 13,989 క్యూసెక్కులు వదులుతున్నారు. నీటిమట్టం 692.5 అడుగుల వద్ద ఉంది. ప్రధాన కాలువకు 604 క్యూసెక్కులు, కుడి కాలువకు 80 క్యూసెక్కుల నీటిని పంటల కోసం వదులుతున్నారు.
పెన్ గంగా ఉద్ధృతం
వరుస వర్షాలతో కుమురం భీం జిల్లాలోని పలు పల్లెలకు నాలుగు వైపులా ప్రాణహిత, పెన్ గంగా, పెద్దవాగు జలాలు చేరడంతో ఊరు విడిచి బయటకు రాలేని పరిస్థితి. పంట పొలాలు సైతం వారం రోజుల నుంచి నీటిలోనే ఉండడంతో... పత్తి మొక్కలు బతికే అవకాశం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తు న్నారు. ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలు, ఎత్తిన ప్రాజెక్టుల గేట్ల వరద కారణంగా పెన్ గంగ, ప్రాణహితలు ఉద్ధృతంగా ప్రవహిస్తూ కౌటాల మండలంలోని తుమ్మిడిహెట్టి వద్ద కలవడంతో ప్రవాహం మరింత ఉగ్రరూపం దాల్చుతోంది. ఫలితంగా బెజ్జూర్ మండలంలోని తలాయి, తిక్కపల్లి, భీమారం గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఇళ్ల సమీపంలోకి నీళ్లు రావడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పెద్దవాగు వరద కారణంగా సున్మీర్, సోమిని, మొగవెల్లి, పాత సోమిని, బండలగూడ, ఇప్పల గూడ, చింతలపల్లి, గెర్రెగూడ, తదితర గ్రామాల ప్రజలు ఇంటి నుంచి బయటకు రాలేకపోతున్నారు. చింతలమానేపల్లి మండలంలోని దిండా గ్రామానికి వెళ్లే మార్గంలో నాలుగు రోజుల నుంచి వాగు ఉద్ధృతి కారణంగా రాకపోకలు నిలిచిపో యాయి. ఈ గ్రామాల్లో 7,500 వరకు జనాభా ఉండగా తీర్యాన్ మండలంలో గుండాల లతో పాటు 15 గ్రామాలకు రాకపోకలు నిలిచి పోయాయి.
రిపోర్టింగ్: వేణుగోపాల కామోజీ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా
సంబంధిత కథనం