New Ration Cards : కొత్త రేషన్ కార్డుల జారీ ఆలస్యం, ఆరు గ్యారంటీల అర్జీల తర్వాతే!
New Ration Cards : ఆరు గ్యారంటీలకు రేషన్ కార్డే అర్హత అని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ప్రజల్లో ఆందోళన మొదలైంది. గత ఏడేళ్లుగా కొత్త రేషన్ కార్డుల జారీ, మార్పుచేర్పులు జరగలేదు. దీంతో అర్హులైన వారికి రేషన్ కార్డులు అందని పరిస్థితి నెలకొంది.

New Ration Cards : గత వారం రోజులుగా కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తున్నారని వస్తున్న వార్తల్లో నిజం లేదని తెలిసిపోయింది. కేవలం ఊహగానాలతో సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వార్తలేనని తేలిపోయింది. ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్ల సమీక్షలో రేషన్ కార్డుల గురించి ప్రస్తావన వస్తుందని వేచి చూస్తున్న ప్రజలకు రేషన్ కార్డులపై ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో పరేషాన్ లో పడ్డారు. కేవలం 6 గ్యారంటీల అమలుపై ప్రజాపాలన కార్యక్రమం ఉంటుందని ఆయా గ్రామాల్లో జరిగే గ్రామసభలు ప్రజలు దరఖాస్తులు చేసుకోవాలని అధికారులకు సీఎం సార్ ఆదేశాలు ఇచ్చారు. వారం రోజులపాటు కొనసాగే ప్రజాపాలన కార్యక్రమంలో ఆరు గ్యారంటీలకు దరఖాస్తులు స్వీకరిస్తారు.
కొత్త రేషన్ కార్డులు జారీ ప్రక్రియ ఎప్పుడు?
ఇలా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తుందని ఎదురుచూసిన ప్రజల ఆశలు నిరాశలయ్యాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏడేళ్లుగా కొత్త రేషన్ కార్డులు, కొత్తగా జన్మించిన వారి పేర్ల నమోదు ప్రక్రియ మీ సేవలో చేసుకున్న దరఖాస్తుల వరకే పరిమితం అయ్యాయి. గత రాష్ట్ర ప్రభుత్వం ఒక్క దరఖాస్తు కూడా పరిశీలించలేకపోయింది. దీంతో వేల సంఖ్యలో దరఖాస్తులు పేరుకుపోయాయి. ప్రస్తుత ప్రభుత్వం రేషన్ కార్డుల జారీ మొదలెడుతుందని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవ్వడంతో ఇటు అధికారుల వద్దకు అటు మీ సేవ సెంటర్లకు వేల సంఖ్యలో ప్రజలు పోటెత్తారు. అడ్వాన్సుగా వాటికి కావాల్సిన జతపత్రాలు కులం, నివాసం, ఆదాయం ధ్రువపత్రాల కోసం మీ సేవకు క్యూ కట్టారు. చివరికి అధికారులు సైతం తమకు ఎలాంటి ఆదేశాలు ప్రభుత్వం నుంచి రాలేదని, ఆ వార్తలు కేవలం సోషల్ మీడియాలో వైరల్ మాత్రమేనని ప్రజలు సోషల్ మీడియా వార్తలు నమ్మి పరేషాన్ లో పడొద్దని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ అధికారులు తెలిపారు. ఈ మేరకు అధికారికంగా ప్రకటన చేశారు.
ప్రజాపాలనలో రేషన్ కార్డులపై దరఖాస్తులు
కొత్త ప్రభుత్వం కొలువు దీరిన తర్వాత ఈనెల 28 నుంచి చేపడుతున్న ప్రజాపాలన కార్యక్రమంలో ఎక్కువ శాతం రేషన్ కార్డుల గురించి ఆందోళన ఉంటుందని స్థానిక ప్రజలు చర్చించుకుంటున్నారు. ప్రజాపాలనకు వచ్చే అధికారులకు 6 గ్యారంటీల కంటే ఎక్కువ దరఖాస్తులు రేషన్ కార్డులపై వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఇదిలా ఉంటే ప్రజాపాలనలో దరఖాస్తుతో పాటు ఆధార్ కార్డు రేషన్ కార్డు తప్పనిసరి జతచేయాలని సూచించింది ప్రభుత్వం. రేషన్ కార్డు లేనప్పుడు ఏ విధంగా జత చేస్తామని ప్రజలు ఆందోళన పడుతున్నారు.
కొత్త రేషన్ కార్డుల జారీ ఎప్పుడంటే?
కొత్త తెల్లరేషన్ కార్డులకు దరఖాస్తుల స్వీకరణకు మరింత సమయం పట్టేలా ఉంది. ప్రభుత్వం 6 గ్యారంటీల దరఖాస్తులు స్వీకరిస్తామని, వాటికి తెల్లరేషన్ కార్డును అర్హతగా ప్రభుత్వం నిర్ణయించింది. రేషన్ కార్డులు జారీ చేసే వరకు వేచిచూస్తే ఆరు గ్యారంటీల అమలు ఆలస్యమవుతుంది. ఈ ఉద్దేశంతో 6 గ్యారంటీల అర్జీలు స్వీకరించిన తర్వాతే కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తుంది.
రిపోర్టింగ్ : వేణుగోపాల కామోజీ, ఉమ్మడి ఆదిలాబాద్.