Rythu Runa Mafi : రుణమాఫీపై ప్రభుత్వం మరో కీలక నిర్ణయం, తప్పుల సవరణలకు మార్గదర్శకాలు జారీ
Rythu Runa Mafi : రైతు రుణమాఫీ సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. రుణమాఫీ కాని రైతులు మండల వ్యవసాయాధికారిని కలిసి ఫిర్యాదు చేయొచ్చని తెలిపింది. తప్పుల సవరణలకు మార్గదర్శకాలు జారీ చేసింది. రుణమాఫీకి సంబంధించి ఎలాంటి ఫిర్యాదైనా వ్యవసాయాధికారి స్వీకరిస్తారు.
Rythu Runa Mafi : రుణమాఫీ కాని రైతుల సమస్యలను పరిష్కరించేందుకు మండల కేంద్రంలో వ్యవసాయాధికారిని కలిసి ఫిర్యాదు చేసే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. ఈ మేరకు తప్పుల సవరణకు సంబంధించిన మార్గదర్శకాలను జారీ చేసిందని ఆదిలాబాద్ జిల్లా వ్యవసాయాధికారి పుల్లయ్య తెలిపారు. ప్రభుత్వ నిబంధనల మేరకు రుణమాఫీ సొమ్ము జమ కాని రైతులు మండల వ్యవసాయాధికారిని కలిసి ఫిర్యాదు చేయాలని ఆయన సూచించారు. రుణమాఫీకి సంబంధించి ఎలాంటి ఫిర్యాదైనా.. రైతు సమాచార పత్రంతో వివరాలను యాక్సెస్ చేస్తారు.
* ఆధార్ కార్డు తప్పుగా ఉంటే రైతు నుంచి ఆధార్ కార్డు కాపీని తీసుకొని అప్ లోడ్ చేయాలి. ఓటరు కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, రేషన్ కార్డు వంటి ప్రత్యామ్నాయ గుర్తింపు పత్రాన్ని తీసుకొని నమోదు చేయాలి.
* కుటుంబాలు ఇంకా ఖరారు చేయని సందర్భాల్లో మండల వ్యవసాయాధికారి తప్పనిసరిగా రైతు ఇంటిని సందర్శించి రైతు వెల్లడించిన ఆధార్ కాపీలు, కుటుంబ సభ్యుల సంఖ్యను తీసుకొని పోర్టల్ లో అప్డేట్ చేయాలి.
* రైతుకు పాస్ బుక్ లేకుంటే అతడి నుంచి వివరాలు తెలుసుకుని పోర్టల్ లో నమోదు చేయాలి.
* ఆధార్ లో పేరు, లోన్ ఖాతాలో పేరు మధ్య లోపాలు ఉంటే రుణం తీసుకున్న వ్యక్తి గుర్తింపును పరిశీలించి రైతు సరైన వివరాలను నమోదు చేయాలి.
* అసలు, వడ్డీ మొత్తంలో సరిపోలని పక్షంలో రైతు నుంచి దరఖాస్తు తీసుకొని వివరాలను పోర్టల్ లో అప్ లోడ్ చేయవచ్చు. నిర్దారణ కోసం సంబంధిత బ్యాంకుకు
పంపిస్తారు. ఇవే కాకుండా రుణమాఫీకి సంబంధించి ఇతర సమస్యలుంటే వ్యవసాయాధికారులను కలిసి నివృత్తి చేసుకోవచ్చు.
రూ. 2 లక్షల వరకు రుణమాఫీ చేసినా తమకు వర్తించలేదని రైతులు వ్యవసాయశాఖ అధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు. వారి ఖాతాలను తనిఖీ చేసినప్పుడు రేషన్ కార్డు లేదని, చాలా మందికి కుటుంబ నిర్ధారణ కావాల్సి ఉందనే కారణాలుగా తేలాయి. రుణమాఫీ వర్తించని వారి ఫిర్యా దుల పరిష్కారానికి ప్రత్యేక యాప్ ను రూపొందిస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. దీనికి అనుగుణంగా యాప్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు. రుణమాఫీ కాలేదని ఫిర్యాదు చేసిన వారి ఇళ్లకు వ్యవసాయాధికారులు వెళతారు. ముందుగా వారి రుణఖాతాలు, ఆధార్ కార్డులను తనిఖీ చేస్తారు. అనంతరం కుటుంబ సభ్యుల వివరాలు తీసుకొని యాప్ లో అప్లోడ్ చేస్తారు. రుణాలున్న భార్యాభర్తలే గాక 18 ఏళ్లు దాటిన వారి కుటుంబ సభ్యుల ఫొటోలు తీసుకుంటారు. ఈ సర్వేలో కార్యదర్శి, అధికారులు నిజనిజాలను ధ్రువీకరించి రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. రూ.2 లక్షల కంటే ఎక్కువ గల రుణాలను పైన సొమ్ము కడతామని రైతు చెబితే వారి వివరాలు సైతం నమోదు చేసుకుని బ్యాంకులకు సమాచారం అందేలా యాప్ ను రూపొందించారు.
రిపోర్టింగ్ : వేణుగోపాల్ కామోజీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రతినిధి
సంబంధిత కథనం