Farmer Ends Life At Bank : ఆదిలాబాద్ లో తీవ్ర విషాదం, బ్యాంకులోనే పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య
Farmer Ends Life At Bank : ఆదిలాబాద్ లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. బ్యాంకులోనే ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. బ్యాంకు అధికారుల వేధింపులతోనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తు్న్నారు.
Farmer Ends Life At Bank : ఆదిలాబాద్ జిల్లాలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. బ్యాంకు అధికారుల వేధిస్తున్నారంటూ ఓ రైతన్న బ్యాంకులోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన బ్యాంకు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. ఈ వీడియో వైరల్ అవుతోంది. ఆదిలాబాద్ పట్టణంలోని ఐసీఐసీఐ బ్యాంకులో బేల మండలం రేణి గూడకు చెందిన రైతు జాదవ్ దేవరావు ఐదెకరాల వ్యవసాయ భూమిపై 3.50 లక్షల రూపాయల రుణం తీసుకున్నారు. దీనికి ఆరు నెలలకు ఒకసారి రూ.25 వేల వడ్డీ చెల్లించాల్సి ఉంది. అయితే గత రెండు దఫాలుగా జాదవ్ కిస్తీ చెల్లించలేకపోయారు. సమయానికి వడ్డీ కట్టకపోవడం బ్యాంకు అధికారులు జాదవ్ దేవరావుపై ఒత్తిడి తీసుకొచ్చారు. ఫోన్లు చేసి వేధింపులకు దిగారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దీంతో శనివారం ఉదయం పురుగుల మందు డబ్బాతో బ్యాంకుకు వచ్చిన రైతు జాదవ్ దేవరావు అధికారుల ముందే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. అతడిని రిమ్స్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
జాదవ్ దేవరావు మృతితో అతని కుటుంబ సభ్యులు, బంధువులు బ్యాంక్ ముందు ఆందోళనకు దిగారు. లోన్ చెల్లించడం లేదని దేవ్ రావును బ్యాంక్ అధికారులే పిలిచారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అధికారులు వేధింపులు తట్టుకోలేక రైతు అఘాయిత్యానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు నిరసనకు దిగారు. బ్యాంకు అధికారులపై చర్యలు తీసుకుని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే - హరీశ్ రావు
"రైతులందరికీ రుణమాఫీ చేసేశామని సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారు. పూర్తి రుణమాఫీ చేసినట్లయితే.. ఈరోజు ఆదిలాబాద్ జిల్లాలో ఓ రైతు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు? ఇది ముమ్మాటికీ రేవంత్ ప్రభుత్వం చేసిన హత్యే" అని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. రైతు ఆత్మహత్య మీడియాతో మాట్లాడిన ఆయన... అప్పు కట్టాలని వేధింపులు గురిచేస్తే రైతు బ్యాంకులోనే పురుగుల మందు తాగి చనిపోయిండని హరీశ్‌రావు అన్నారు. రుణమాఫీ అయిపోతే ఈ రైతు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడని ప్రశ్నించారు. రైతు ఆత్మహత్యకు ముమ్మాటికీ కాంగ్రెస్ పార్టీనే కారణమని ఆరోపించారు.
రుణమాఫీ అయిపోయిందని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారని, రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ సర్కార్ మోసం వల్లే రైతు చనిపోయాడని విమర్శించారు. రుణమాఫీ, రైతు భరోసా, పంట బోనస్ ఇలా అన్ని విషయాల్లో రేవంత్ సర్కార్ రైతులను మోసం చేసిందని విమర్శించారు. ఇప్పుడు రేషన్ కార్డులు ఇవ్వకుండా పేదల ఉసురుతీస్తున్నారని ధ్వజమెత్తారు. ఆత్మహత్య చేసుకున్న రైతన్నకు రూ.10 లక్షలు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్ పార్టీ తరఫున రైతు జాదవ్ దేవరావు కుటుంబాన్ని పరామర్శించి ఆర్థికంగా ఆదుకుంటామని హరీశ్ రావు స్పష్టం చేశారు.
సంబంధిత కథనం