Ex MP Ramesh Rathod : మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ కన్నుమూత, సీఎం రేవంత్ రెడ్డి సంతాపం
Ex MP Ramesh Rathod : ఆదిలాబాద్ మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ శుక్రవారం అర్ధరాత్రి కన్నుమూశారు. రమేష్ రాథోడ్ మృతి పట్ల పలువురు నేతలు సంతాపం తెలిపారు.
Ex MP Ramesh Rathod : మాజీ ఎంపీ రమేష్ రాథోడ్(59) కన్నుమూశారు. శుక్రవారం అర్ధరాత్రి రమేష్ రాథోడ్ తీవ్ర అస్వస్థతకు గురికావడంతో... ఆయనను కుటుంబసభ్యులు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఆయన పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌కు తరలిస్తుండగా.. మార్గమధ్యలో కన్నుమూశారు. రమేష్ రాథోడ్ భౌతికకాయాన్ని ఉట్నూర్‌లోని ఆయన నివాసానికి తరలించారు. రమేష్ రాథోడ్ మృతి పట్ల పలువురు రాజకీయ నేతలు సంతాపం ప్రకటించారు. రమేష్ రాథోడ్ 1999లో టీడీపీ తరఫున ఖానాపూర్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009లో టీడీపీ నుంచి ఆదిలాబాద్ ఎంపీగా గెలిచారు. తెలంగాణ ఉద్యమ సమయంలో టీడీపీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ లో చేరారు. అనంతర రాజకీయ పరిణామాలతో కాంగ్రెస్‌లో చేరిన రమేష్ రాథోడ్ 2019లో ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత బీజేపీలో చేరి ఎంపీ టికెట్ కోసం ప్రయత్నించారు. కానీ ఆయనకు ఎంపీ టికెట్ దక్కలేదు.
రమేష్ రాథోడ్ ఖానాపూర్ ఎమ్మెల్యేగా, జిల్లా పరిషత్ ఛైర్మన్‌గా, లోక్‌సభ ఎంపీగా పనిచేశారు. తెలుగుదేశం, బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల్లో రమేశ్ రాథోడ్ కీలక బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన స్వస్థలం ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం తాడిహాత్నూర్.
రాజకీయ జీవితం
రమేష్ రాథోడ్ ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలంలోని తాడిహత్నూర్ కు చెందిన లంబాడీ గిరిజన దంపతులైన మోహన్ రాథోడ్, కమలబాయ్ లకు 1966 లో జన్మించారు. రమేశ్ రాథోడ్ టీడీపీ నుంచి తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. టీడీపీ నార్నూర్ జడ్పీటీసీగా ఎన్నికయ్యారు. టీడీపీ తరఫున ఖానాపూర్ ఎమ్మెల్యేగా రెండుసార్లు విజయం సాధించారు. 1999- 2004 మధ్య కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఖానాపూర్ ఎమ్మెల్యేగా ఉన్నారు. 2006 నుంచి 2009 వరకు ఆదిలాబాద్ జిల్లా పరిషత్ ఛైర్మన్ గా పనిచేశారు. 2009లో 15వ లోక్ సభకు పోటీచేసిన ఆయన ఎంపీగా విజయం సాధించారు. అనంతరం బీఆర్ఎస్ లో చేరారు. కొంత కాలానికే ఆ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఖానాపూర్ అసెంబ్లీ, ఆదిలాబాద్ లోక్ సభ స్థానానికి పోటీ చేసి ఓడిపోయారు. 2021లో కాంగ్రెస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరారు. 2023లో ఖానాపూర్ అసెంబ్లీ స్థానానికి బీజేపీ తరఫున పోటీ చేసి ఓటమి పాలైయ్యారు.
సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి
ఆదిలాబాద్ మాజీ ఎంపీ, ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే రమేష్ రాథోడ్ ఆకస్మిక మరణం పట్ల సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ జిల్లా రాజకీయాల్లో రమేష్ రాథోడ్ తన ప్రత్యేక ముద్ర వేశారని, తనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. ఆయన కుటుంబ సభ్యులకు సీఎం రేవంత్ రెడ్డి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ మరణంపై తెలంగాణ బీజేపీ విచారం వ్యక్తం చేసింది. ప్రజా నాయకులు, బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యుడు, ఆదిలాబాద్ మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ ఆకస్మిక మరణం ఎంతో బాధాకరమని ఎక్స్ వేదిక పోస్టు పెట్టింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు భగవంతుడు మనో ధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ ప్రగాఢ సానుభూతి తెలియజేసింది.
సంబంధిత కథనం