Adilabad Congress : ఆదిలాబాద్ కాంగ్రెస్ లో టికెట్ వార్, కొత్త వర్సెస్ పాత నేతలు ఢీ!
Adilabad Congress : ఆదిలాబాద్ కాంగ్రెస్ నేతల్లో ఆందోళన మొదలైంది. కొత్త పార్టీలోకి వచ్చిన వారికి టికెట్ హామీలు దక్కాయని తెలియడంతో ఇన్నాళ్లు పార్టీని నమ్ముకున్న వారంతా అసంతృప్తితో రగులుతున్నారు.
Adilabad Congress : అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాకముందే రాష్ట్రంలో రాజకీయ వేడి రగులుతోంది. ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్.. అసమ్మతి వర్గాలను మెనేజ్ చేసేందుకు ప్రయత్నిస్తుంటే... కాంగ్రెస్ అధిష్టానం టికెట్లను ఎవరెవరికి కట్టబెట్టాలని ముమ్మరంగా కసరత్తు చేస్తుంది. బీఆర్ఎస్ లో టికెట్లు రాని నేతలు కాంగ్రెస్ కు క్యూకట్టారు. పార్టీలో చేరేముందు వాళ్లకు టికెట్ హామీ దక్కిందని ప్రచారం చేసుకుని కాంగ్రెస్ లో చేరుతున్నారు. ఇన్నాళ్లు పార్టీని అంటిపెట్టుకున్న నేతలు ఆందోళన చెందుతున్నారు. ఆపద సమయంలో పార్టీని వీడకుండా, ఎన్నో అవంతరాలు అవమానాలు ఎదుర్కొని, పార్టీలోనే కొనసాగుతూ వచ్చామని పేర్కొంటున్నారు. ప్రభుత్వం లేకపోయినప్పటికీ స్థానికంగా కార్యకర్తలకు అండగా నిలిచామంటున్నారు. ప్రస్తుతం కొత్తగా వచ్చిన వారికి ప్రాధాన్యత నివ్వడంతో పార్టీని అంటిపెట్టుకున్న నేతలు అసంతృప్తి చెందుతున్నారు. గత పదిహేళ్లుగా అధిష్టానం ఇచ్చిన పిలుపును కాదనకుండా మండల కేంద్రాల్లో ధర్నాలు, ప్రభుత్వ వైఖరిపై నిరసనలు చేశామని కాంగ్రెస్ నేతలు అంటున్నారు.
94 దరఖాస్తులు
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి 10 నియోజకవర్గాల్లో సుమారు 94 మంది అభ్యర్థులు టికెట్ కు దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుతం వివిధ పార్టీలలో భంగపడ్డవారు సైతం కాంగ్రెస్ పార్టీ టికెట్ కు దరఖాస్తు చేసుకున్నారు. ఈ వారంలో కాంగ్రెస్ అధిష్టానం టికెట్లను ప్రకటిస్తున్నందున జాబితాలో తమ పేరు ఎక్కడ గల్లంతవుతుందోనని పాత నేతలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రెండు పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. ఒకటి ఆదిలాబాద్ మరొకటి పెద్దపల్లి, ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజవర్గంలో ఖానాపూర్, ఆసిఫాబాద్, ఆదిలాబాద్ , బోథ్, నిర్మల్ , ముధోల్ లు ఉండగా పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో చెన్నూర్, మంచిర్యాల, బెల్లంపల్లిలు ఉన్నాయి. ఇందులో 3 ఎస్టీ నియోజవర్గాలు, రెండు ఎస్సీ నియోజకవర్గాలు ఉన్నాయి.
ఒక్క సీటైనా దక్కుతుందా?
ఇదిలా ఉంటే ఖానాపూర్ లో ఎమ్మెల్యే రేఖా నాయక్ భర్త శ్యాం నాయక్, చెన్నూర్ లో నల్లాల ఓదెలు ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరి చేరిక ఇప్పటికే కాంగ్రెస్ టికెట్ పై ఆశలు పెట్టుకున్న వారికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ లో రిజర్వ్ చేసిన ఐదు నియోజవర్గాలు తప్ప మిగతా ఐదు నియోజకవర్గాలలో బీసీ నేతలకు కనీసం ఒక సీటు అయినా దక్కుతుందా? లేదా? అని నేతలు చర్చించుకుంటున్నారు.
రిపోర్టర్ : కామోజీ వేణుగోపాల్, ఆదిలాబాద్