Congress: ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి అద్దంకి క్షమాపణలు
చండూరు సభలో అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గానూ.. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి అద్దంకి దయాకర్ క్షమాపణలు చెప్పారు.
addanki dayakar apologies to mp komatireddy:కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆ పార్టీ నేత అద్దంకి దయాకర్ క్షమాపణలు చెప్పారు. ఇవాళ మీడియాతో మాట్లాడిన అద్దంకి... చండూరు సభలో చేసిన అనుచిత వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. ఏదో ఆవేశంలో నోరుజారానని.. ఎంపీకి వ్యక్తిగతంగా క్షమాపణ చెబుతున్నట్లు ప్రకటించారు. కోమటిరెడ్డి అభిమానులు క్షమించాలన్నారు. వివరణ ఇచ్చేలోపే నాకు షోకాజ్ నోటీసులు ఇచ్చారని తెలిపారు. మరోసారి తప్పు జరగకుండా చూసుకుంటానని పేర్కొన్నారు.
ఏఐసీసీతో పాటు రాష్ట్ర నాయకత్వం నుంచి కూడా తన ఫోన్లు వచ్చాయని అద్దంకి తెలిపారు. మరోసారి ఈ తరహా తప్పు జరగుకుండా చూసుకుంటానని స్పష్టం చేశారు. సభలో ప్రజల నుంచి స్పందన రావడంతోనే తప్పు దొర్లిందని అన్నారు. అయితే అంతకుముందే పీసీసీ క్రమశిక్షణ కమిటీ అద్దంకి దయాకర్‌కు షోకాజ్ నోటీస్ జారీ చేసింది. క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ చిన్నారెడ్డి స్వయంగా సమావేశంలో ఉండడంతో అయనే సాక్షిగా నోటీసులు జారీ చేశారు.
అద్దంకి దయాకర్ వ్యాఖ్యలపై సొంత పార్టీ నేతలు కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇక కోమటిరెడ్డి అభిమానులు సస్పెండ్ చేయాలంటూ ఆందోళనకు కూడా దిగారు. ఇదే అంశంపై మల్లు రవి కూడా స్పందించారు. అద్దంకి వ్యాఖ్యలు సరికావని చెప్పారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పార్టీ కోసం చాలా సంవత్సరాలుగా పని చేస్తున్నారని.. అలాంటి వ్యక్తిపై ఇలా మాట్లాడటం సరికాదని చెప్పారు. ఇక ఢిల్లీలో మాట్లాడిన రేవంత్ రెడ్డి కూడా అద్దంకి దయాకర్ కామెంట్స్ పై స్పందించారు. ఈ తరహా వ్యాఖ్యలు ఎవరిపై చేసినా కూడా సరికావని... కాంగ్రెస్ పార్టీలో ఇలాంటి వాటికి చోటు ఉండదని చెప్పారు.
శుక్రవారం చండూరులో జరిగిన సభలో అద్దంకి దయాకర్ చాలా ఘాటుగా మాట్లాడారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఎటువైపు ఉంటారో నిర్ణయించుకోవాలని సవాల్ విసిరారు. అమిత్ షాతో భేటీ ఎందుకు అవుతాడని నిలదీశారు. మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలను చిత్తుచిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. అయితే ఈ క్రమంలో ఆయన ఒక అనుచిత పదాన్ని వాడటం పెద్ద దుమారనే రేపింది. ఫలితంగా ఆయన క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది.