Madhapur Drugs Case : డ్రగ్స్ కేసులో విచారణకు హాజరైన హీరో నవదీప్‌-actor navdeep appears before police in madhapur drugs case ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Madhapur Drugs Case : డ్రగ్స్ కేసులో విచారణకు హాజరైన హీరో నవదీప్‌

Madhapur Drugs Case : డ్రగ్స్ కేసులో విచారణకు హాజరైన హీరో నవదీప్‌

HT Telugu Desk HT Telugu

Madhapur Drugs Case:మాదాపూర్ డ్రగ్స్ కేసులో హీరో నవదీప్‌ నార్కోటిక్స్‌ పోలీసుల విచారణకు హాజరయ్యాడు. ఈ మేరకు ఆయన సైఫాబాద్ లోని నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ కార్యాలయానికి వచ్చారు.

పోలీసుల విచారణకు నవదీప్

Madhapur Drugs Case Updates: మాదాపూర్ డ్రగ్స్ కేసులో హీరో నవదీప్‌ పేరు తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. హైకోర్టు ఆదేశాలతో ఆయన… శనివారం నార్కోటిక్స్‌ పోలీసుల విచారణకు హాజరయ్యాడు. రెండు రోజుల క్రితం పోలీసులు 41A నోటీసులు ఇచ్చారు. ఇందులో భాగంగా… ఇవాళ సైఫాబాద్ లోని నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ కార్యాలయానికి నవదీప్ వచ్చారు.

ఇటీవలే మాదాపూర్ లో డ్రగ్స్ కేసు నమోదైంది. ఇందులో నవదీప్‌ పాత్ర ఉందని పోలీసులు భావిస్తున్నారు. అతడిని డ్రగ్స్ వినియోగదారుడిగా పేర్కొన్నారు.నిందుతుల్లో ఒకరైన రాంచందర్ స్టేట్మెంట్ ఆధారంగా నవదీప్ ను విచారిస్తున్నారు. నవదీప్ నుంచి కీలక సమాచారం రాబట్టే అవకాశం ఉంది.

ఇటీవలే సోదాలు….

మాదాపూర్‌ డ్రగ్స్‌ కేసులో హీరో నవదీప్‌ ఇంట్లో తెలంగాణ నార్కోటిక్స్ బ్యూరో అధికారులు ఇటీవల సోదాలు నిర్వహించారు. ఈ కేసులో నవదీప్‌ను 37వ నిందితుడిగా ప్రకటించారు. డ్రగ్స్‌ కేసులో అరెస్టైన నిందితుడు రాంచంద్‌ నుంచి హీరో నవదీప్‌ డ్రగ్స్‌ తీసుకున్నట్లు నార్కోటిక్స్‌ బ్యూరో చెబుతోంది. నవదీప్‌ ఇంట్లో సోదాలు జరిగిన సమయంలో ఆయన ఇంట్లో లేనట్టు తెలిసింది.

మాదాపూర్ డ్రగ్స్ కేసులో నవదీప్ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు ఇటీవల కొట్టివేసింది. నవదీప్ బెయిల్ రద్దు చేయాలని పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ పై కోర్టు విచారించింది. అయితే నవదీప్ బెయిల్ రద్దు చేయాలని పోలీసులు తమ పిటిషన్ లో కోరారు. ఈ కేసులోని నిందితులతో నవదీప్ కు సంబంధాలు ఉన్నాయని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. ఇరువైపు వాదనలు విన్న కోర్టు… 41 ఏ కింద నోటీసులు ఇచ్చి నవదీప్ ను విచారించాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో నవదీప్ అరెస్ట్ తప్పదా? అనే చర్చ తెరపైకి వచ్చింది. ఈ కేసులో నార్కోటిక్‌ బ్యూరో దూకుడు పెంచే పనిలో ఉంది. హైకోర్టు ఆదేశాలతో నవదీప్ కు 41ఏ నోటీసులు ఇచ్చారు పోలీసులు. నవదీప్‌తో పాటు మరికొందరికి నోటీసులు ఇవ్వనున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే… ఇవాళ విచారణకు హాజరయ్యారు నవదీప్.

రిపోర్టింగ్: కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్