TG Plastic Rice: తెలంగాణ ప్రభుత్వం రేషన్ షాపుల్లో పంపిణీ చేసే సన్న బియ్యంలో ప్లాస్టిక్ బియ్యం ఉన్నాయంటూ సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని, ఫేక్ ప్రచారాలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తప్పవని సివిల్ సప్లైస్ అధికారులు ప్రకటించారు.
తెలంగాణ ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీ చేస్తున్న నేపథ్యంలో ప్రజలను ఆందోళనకు గురి చేసి సమాజంలో అశాంతి సృష్టించాలనే దురుద్దేశంతో కొంతమంది సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని పౌరసరఫరాల అధికారులు చెబుతున్నారు.
గోదావరిఖని పెద్దపల్లి జిల్లా లోని తిలక్ నగర్ లో పంపిణీ చేసే సన్నబియ్యం లో ప్లాస్టిక్ బియ్యం కలిశాయని ఫేస్ బుక్, ఎక్స్ వంటి సామాజిక మాధ్యమాలలో కొన్ని వీడియోలు ప్రచారం చేశారని, దీనిపై స్పందించిన జిల్లా పౌర సరఫరాల శాఖ స్పందించి తిలక్ నగర్ ప్రాంతంలో ని ఎక్కడ ఎటువంటి ప్లాస్టిక్ బియ్యం సరఫరా లేదని తప్పుడు ప్రచారం చేసిన వారిపై కేసు నమోదు చేసినట్లు తెలిసింది.
ప్రజల్ని భయాందోళనలకు గురి చేస్తూ సమాజంలో అశాంతిని సృష్టించాలని దురుద్దేశంతో తప్పుడు వీడియోలను సామాజిక మాద్యమాలలో ప్రచారం చేసే వారిని గుర్తించడంతో పాటు సోషల్ మీడియా ఖాతాల్లో వాటిని ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.
రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా అమలవుతున్న సన్న బియ్యం పథకం పై కొంతమంది మీడియా,సోషల్ మీడియాలో, తప్పుడు వదంతులు వ్యాప్తి చేస్తున్నారని అలాంటి వాటిపై ఉపేక్షించేది లేదన్నారు.
సన్న బియ్యం పంపిణీపై కావాలని తప్పుడు వార్తలు ప్రచారం చేస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని పౌర సరఫరాల శాఖ అధికారులు హెచ్చరించారు. సన్న బియ్యం పంపిణీ లో ఏదైనా సమస్య ఉంటే అధికారులు పరిష్కరిస్తారని, సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేసిన పలువురిపై తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు సివిల్ సప్లై కమిషనర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
సంబంధిత కథనం