Warangal: మంత్రి పుట్టిన రోజు వేడుకలు.. కేక్ కట్ చేసిన ఏసీపీ
Warangal: వరంగల్ నగరంలో సోమవారం మంత్రి కొండా సురేఖ పుట్టినరోజు వేడుకలు జరిగాయి. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు ఈ వేడుకలను నిర్వహించారు. అయితే.. ఈ వేడుకల్లో పోలీసులు పాల్గొనడం చర్చనీయాంశంగా మారింది.
వరంగల్ నగరంలో పలుచోట్ల మంత్రి కొండా సురేఖ పుట్టిన రోజు వేడుకలు జరిగాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు, కొండా అభిమానులు పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. ఇక్కడిదాకా బాగానే ఉన్నా.. ఈ వేడుకల్లో పోలీసులు పాల్గొనడం చర్చనీయాంశంగా మారింది. యూనిఫామ్‌లో పాల్గొన్న కొందరు పోలీసులు.. ఏకంగా కేక్ కట్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
కేక్ కట్ చేసిన ఏసీపీ..
మంత్రి కొండా సురేఖ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న ఏసీపీ నందిరామ్ నాయక్.. కాంగ్రెస్ లీడర్లతో కలిసి కేక్ కట్ చేశారు. ఆయనతో పాటు సీఐ, సిబ్బంది కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. దీనిపై విమర్శలు వస్తున్నాయి. పోలీసులు ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం ఏంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. పోలీసులు ఇలాంటి వేడుకల్లో పాల్గొనవచ్చా అని సోషల్ మీడియా వేదికగా డీజీపీని ప్రశ్నిస్తున్నారు.
కాంగ్రెస్ శ్రేణుల అత్యుత్సాహం..
మంత్రి కొండా సురేఖ పుట్టినరోజు సందర్భంగా.. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అత్యుత్సాహం ప్రదర్శించారు. జనాల మధ్యే రోడ్డుపై పటాకులు పేల్చారు. ఈ క్రమంలో ముగ్గురికి గాయాలయ్యాయి. హరిణి అనే యువతి కాలికి తీవ్ర గాయాలయ్యాయి. దీనిపై స్థానికులు అసహనం వ్యక్తం చేశారు. పబ్లిక్ ప్లేసులో ఇలాంటి పనులేంటని స్థానికులు అసహనం వ్యక్తం చేశారు. గాయపడ్డ వారికి ఏం సమాధానం చెబుతారని ప్రశ్నిస్తున్నారు.