TG Agriculture : డ్రోన్‌తో వరి నాట్లు.. ఖర్చు తక్కువ.. అన్నదాతలకు ఎన్నో లాభాలు!
TG Agriculture : ప్రస్తుతం వ్యవసాయం భారంగా మారింది. పెట్టుబడి ఖర్చులు బాగా పెరిగాయి. చిన్న, సన్నకారు రైతులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో సాగు ఖర్చులను తగ్గించే పరిశోధనలు జరుగుతున్నాయి. తాజాగా.. డ్రోన్లతో వరి విత్తే ప్రయోగం చేశారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
వరి నాట్లు రైతులకు భారంగా మారాయి. నాట్లు వేయడానికి కూలీలు దొరకని పరిస్థితి నెలకొంది. దీంతో ఇతర రాష్ట్రాల నుంచి కూలీలను రప్పించి.. ఎక్కువ డబ్బులు చెల్లిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. డ్రోన్‌తో వరి విత్తే విధానానికి ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శ్రీకారం చుట్టింది. ఈ పద్ధతిపై కొంతకాలంగా పరిశోధనలు చేసిన విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు.. తాజాగా క్షేత్రస్థాయిలో ప్రయోగం చేశారు.
డ్రోన్ల ద్వారా..
జనగామ జిల్లా రఘునాథపల్లిలోని రైతుల పొలాల్లో డ్రోన్‌లతో నేరుగా వరి విత్తారు. వర్సిటీ డ్రోన్ విభాగం నోడల్ అధికారి ప్రొఫెసర్ రాంగోపాల్ వర్మ, వరంగల్ ప్రాంతీయ పరిశోధన కేంద్రం సహ సంచాలకులు ప్రొఫెసర్ ఉమ్మారెడ్డి ఆధ్వర్యంలో ఈ ప్రయోగాన్ని చేపట్టారు. సంప్రదాయ వరిసాగులో ప్రస్తుతం కూలీల కొరత వేధిస్తోందని.. కూలీలు లేకుండా డ్రోన్‌లతో వరి నేరుగా విత్తితే.. ఎకరాకు రూ.6 వేల నుంచి రూ.8 వేల వరకు పెట్టుబడి ఖర్చు తగ్గుతుందని పరిశోధకులు చెబుతున్నారు.
కేవలం పావుగంటలో..
ప్రస్తుతం వరినారు వేసే పద్ధతిలో ఎకరాకు 25 కిలోల విత్తనాలు వాడుతున్నారు. అదే డ్రోన్ పద్ధతిలో ఐదు వరుసల్లో 30 సెంటీమీటర్ల ఫేసింగ్‌తో ఎకరాకు దొడ్డురకం 8 కిలోలు, సన్నరకాలు 6 కిలోల వరకు చాలు అని చెబుతున్నారు. కేవలం 10 నుంచి 12 నిమిషాల్లోనే ఒక ఎకరంలో నాటు అయిపోతుందని అంటున్నారు. ఒక చదరపు మీటర్‌కు గరిష్ఠంగా 59 మొక్కల వరకు వస్తాయని శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు. ప్రస్తుతం తక్కువ విస్తీర్ణంలో ఈ పద్ధతిలో వరి సాగు చేసి.. మంచి ఫలితాలు వస్తే రాష్ట్రమంతటా విస్తరిస్తామని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు.
సక్సెస్ అయితే..
ఈ విధానం సక్సెస్ అయితే.. రైతులకు ఎంతో లాభం జరగనుంది. ముఖ్యంగా కూలీల కొరత నుంచి విముక్తి పొందవచ్చు. కేవలం పావుగంటలో ఎకరంలో పని పూర్తవుతుంది. దీంతో సమయం ఆదా అవుతుంది. అటు విత్తనాలు కూడా తక్కువ మోతాదులో అవసరం అవుతాయి. ఫలితంగా ఆ డబ్బులు కూడా రైతులకు మిగిలే అవకాశం ఉంది. అయితే.. ఈ విధానం ఎంతవరకు సఫలం అవుతుందనే అనుమానాలు రైతుల్లో ఉన్నాయి. కానీ.. పరిశోధకులు మాత్రం గట్టి నమ్మకంతో ఉన్నారు.
పెరిగిన వినియోగం..
ఇప్పటికే వ్యవసాయంలో డ్రోన్ల వినియోగం పెరిగింది. ఇన్నాళ్లు పంపుల ద్వారా పురుగు మందులు పిచికారి చేసేవారు. ఇప్పుడు డ్రోన్ల ద్వారా పిచికారి చేస్తున్నారు. దీంతో పని తొందరగా అవుతోంది. ఖర్చు కూడా తక్కువగా ఉంటోందని రైతులు చెబుతున్నారు. తెలంగాణలోని చాలా గ్రామాల్లో డ్రోన్ల ద్వారానే మందుల పిచికారి జరుగుతోంది. విత్తే విధానం కూడా సక్సెస్ అయితే.. రైతులకు మరింత భారం తగ్గి.. ఖర్చులు కూడా తగ్గే అవకాశం ఉంది.