Rangareddy District Court : జిల్లా కోర్టులో షాకింగ్ ఘటన - జడ్జిపై చెప్పు విసిరిన నిందితుడు
రంగారెడ్డి జిల్లా కోర్టులో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ కేసులోని కరణ్ సింగ్ అనే నిందితుడు… జడ్జిపై చెప్పు విసిరాడు. అత్యాచారం కేసులో పోక్సో కోర్టు… కరణ్ సింగ్ కి జీవితకాలం జైలు శిక్ష విధించింది. ఈ తీర్పుతో కోపోద్రిక్తుడైన నిందితుడు చెప్పు విసిరినట్లు తెలిసింది. ఈ ఘటనపై న్యాయవాదులు ఆందోళన చేపట్టారు.

రంగారెడ్డి జిల్లా కోర్టులో గురువారం కలకలం రేగింది. కోర్టు హాల్ లోనే న్యాయమూర్తిపై నిందితుడు చెప్పు విసిరాడు. పోలీసులు, న్యాయవాదులు ఉండగానే ఈ ఘటన చోటు చేసుకుంది. వెంటనే పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
ఏం జరిగిందంటే…
అత్తపూర్ సిక్ విలేజ్ కు చెందిన కరణ్ సింగ్ అనే వ్యక్తి ఓ కేసులో ముద్దాయిగా ఉన్నాడు. ప్రస్తుతం జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. అయితే అతనిపై మరికొన్ని కేసులు కూడా ఉన్నాయి. ఇందులో విచారణ నిమిత్తం… ఇవాళ రంగారెడ్డి కోర్టులోని పోక్సో కోర్టులో హాజరుపరిచారు. ఈ క్రమంలోనే… నిందితుడు న్యాయమూర్తిపై దాడి చేశాడు.
ప్రాథమిక వివరాల ప్రకారం…. గురువారం నిందితుడిని పోక్సో కోర్టులో హాజరుపరిచారు. హత్యాచారం కేసులో జీవిత ఖైదు విధిస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. ఈ క్రమంలోనే ముద్దాయి తన వాదనను వినిపించేందుకు న్యాయమూర్తి వద్దకు వెళ్లారు. ఇంతలోనే తన కాలి చెప్పును జడ్జిపైకి విసిరారు. న్యాయమూర్తి పట్ల దురుసుగా ప్రవర్తించాడు. అంతేకాకుండా న్యాయవాదులపై పరుష పదజాలంతో దూషించినట్లు తెలిసింది.
వెంటనే కోర్టు హాల్ లో ఉన్న న్యాయవాదులు నిందితుడిని పట్టుకుని బయటికి తీసుకువచ్చారు. న్యాయమూర్తిపై దాడిని ఖండిస్తూ న్యాయవాదులు ఆందోళనకు దిగారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. న్యాయమూర్తులతో పాటు న్యాయవాదులపై దాడులను ఆరికట్టేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ చర్యలు తీసుకోవాలని కోరారు. వెంటనే అడ్వొకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ను అమల్లోకి తీసుకురావాలన్నారు.
న్యాయమూర్తిపై దాడిని ఖండిస్తూ రంగారెడ్డి జిల్లా కోర్టు బార్ అసోసియేషన్ శుక్రవారం బంద్ కు పిలుపునిచ్చింది. నిందితుడితో పాటు ఎస్కార్ట్ లో విధులు నిర్వహిస్తున్న వారిపై కూడా విచారణ జరిపించాలని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొండల్ రెడ్డి డిమాండ్ చేశారు.
కఠిన చర్యలు తీసుకోవాలి - మీనాక్షి, జిల్లా కోర్టు న్యాయవాది
జడ్జిపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు జిల్లా కోర్టు బార్ అసోసియేషన్ మహిళా ప్రతినిది, సీనియర్ న్యాయవాది మీనాక్షి తెలిపారు. ఇలాంటి వాటిని అడ్డుకునేలా ప్రభుత్వాలు కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కేవలం ఇది న్యాయమూర్తిపైన మాత్రమే జరిగిన దాడి కాదని… న్యాయవ్యవస్థపై జరిగిన దాడి అని అభిప్రాయపడ్డారు. ఈ దాడిని నిరసిస్తూ… శుక్రవారం విధులను బహిష్కరిస్తున్నామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న న్యాయవాదులందరూ ఈ ఘటనపై నిరసన వ్యక్తం చేయాలని పిలుపునిచ్చారు.
సంబంధిత కథనం