Kondagattu Accident: జగిత్యాల జిల్లా కొండగట్టు ఘాట్ రోడ్డులో జరిగిన ప్రమాదం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాజన్నపేటలో విషాదం నింపింది. కొండగట్టు ఆంజనేయస్వామి దర్శనానికి వెళ్ళిన రాజన్నపేట కృష్ణనాయక్ తండాకు చెందిన ఒకరు మృతి చెందారు. మరొకరు ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
తండాకు చెందిన శివరాత్రి లింగం-విజయ కుమారుడు శివరాత్రి సాయికృష్ణ (17) తల్లి విజయతో కలిసి కొండగట్టు అంజన్నను దైవ దర్శనం చేసుకున్నారు. దర్శనం అనంతరం బంధుమిత్రులతో కలిసి కొండగట్టు దిగువన వంటలు చేసుకునేందుకు ఘాట్ రోడ్డులో గట్టు కిందకు దిగుతుండగా ప్రమాదానికి గురయ్యారు.
టాటా ఏస్ వాహనంలో ఎక్కువ మంది ఉండడంతో సాయికృష్ణతో పాటు మరొకరు టాప్ పై కూర్చున్నారు. కొండ గట్టు ఘాట్ రోడ్డు లో స్పీడ్ బ్రేకర్ వద్ద డ్రైవర్ సడెన్ గా బ్రేక్ వేయడంతో టాప్ పై నుండి ఇద్దరు క్రింద పడ్డారు. రోడ్డుపై పడ్డ సాయికృష్ణ పై నుండి అదే టాటా ఏస్ వాహనం వెళ్లడంతో తీవ్రగాయాలపాలై ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయారు. మరొకరికి తీవ్ర గాయాలు కావడంతో హుటాహుటిన జగిత్యాల ఆసుపత్రికి తరలించారు.
అమ్మా నాన్న తో కలిసి కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకున్న సాయికృష్ణ కన్నవారి కల్లెదుటే ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోవడంతో తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. దైవ దర్శనానికి వచ్చి ప్రమాదం బారినపడి ప్రాణాలు కోల్పోవడంతో పుత్రశోకంతో కన్నవారు కన్నీరుమున్నీరుగా విలపించారు. కొడుకును కాపాడాలని రోడ్డుపై గుండెలు బాదుకుంటూ బోరున విలపించారు. కోరిన కోర్కెలు తీర్చే కొండగట్టు అంజన్న తమ కొడుకు ప్రాణాలు కాపాడుమని వేడుకున్నారు.
కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకునే భక్తులు ఎక్కువ శాతం అంజన్న దర్శనం అనంతరం భేతాళుడికి జంతు బలిచ్చి గుట్ట కింద విందు భోజనాలు ఆరగించడం సాంప్రదాయం. అదే విధంగా రాజన్న సిరిసిల్ల జిల్లా రాజన్నపేట కృష్ణనాయక్ తండాకు చెందిన వారు ఆంజనేయ స్వామిని దర్శించుకుని గుట్ట కింద మేకను బలిచ్చి విందు భోజనాలు ఆరగించేందుకు ఘాట్ రోడ్ లో కిందికు బయలుదేరారు.
డ్రైవర్ నిర్లక్ష్యంగా ఘాట్ రోడ్డు లో స్పీడ్ బ్రేకర్ వద్ద సడెన్ గా బ్రేక్ వేయడంతో టాటా ఏస్ వాహనం టిప్ పై ఉన్న ఇద్దరు కింద పడ్డారు. సాయికృష్ణ తలపై నుంచి వాహనం వెళ్లడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సాయికృష్ణ మృతి మరొకరికి తీవ్ర గాయాలు కావడంతో విందు కాస్త విషాదంగా మారింది. కన్న వారికి పుట్టెడు దుఃఖాన్ని మిగిల్చింది.
రిపోర్టింగ్: కె.వి.రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు
సంబంధిత కథనం