దేశ చరిత్రలోనే రికార్డు.. విద్యుత్ కార్మికులకు కోటి రూపాయల ప్రమాద బీమా-accident insurance of rs 1 crore for electrical workers in telangana ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  దేశ చరిత్రలోనే రికార్డు.. విద్యుత్ కార్మికులకు కోటి రూపాయల ప్రమాద బీమా

దేశ చరిత్రలోనే రికార్డు.. విద్యుత్ కార్మికులకు కోటి రూపాయల ప్రమాద బీమా

విద్యుత్ కార్మికులు నిత్యం మృత్యువుతో పోరాటం చేస్తూ విధులు నిర్వర్తిస్తుంటారు. చాలా సందర్భాల్లో ప్రాణాలు పోగొట్టుకున్నారు. వారి కుటుంబాలు రోడ్డునపడ్డాయి. ఇలాంటి పరిస్థితికి చెక్ పెట్టింది తెలంగాణ ప్రభుత్వం. దేశ చరిత్రలోనే తొలిసారి.. విద్యుత్ కార్మికులకు కోటి రూపాయల ప్రమాద బీమా సౌకర్యం కల్పించింది.

కారుణ్య నియామక పత్రం అందజేస్తున్న భట్టి

విద్యుత్ కార్మికులకు కోటి రూపాయలకు పైబడి ప్రమాద బీమా అందిస్తున్నామని.. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వివరించారు. దేశ చరిత్రలోనే ఇది ఒక రికార్డు అభివర్ణించారు. ఎన్పీడీసీఎల్ పరిధిలో విధులు నిర్వహిస్తూ.. జోగు నరేష్ ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయారు. ఆయన కుటుంబ సభ్యులకు సోమవారం ఉదయం ప్రజాభవన్‌లో కోటి రూపాయల ప్రమాద బీమా చెక్కును అందించారు. విద్యుత్ శాఖలో నరేష్ భార్యకు కారుణ్య నియామక ఉత్తర్వులు అందజేశారు.

ఇందిరమ్మ ప్రభుత్వంలోనే సాధ్యం..

'విద్యుత్ కార్మికునికి కోటి రూపాయల ప్రమాద బీమా చెక్కును అందించడం.. కేవలం సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ఇందిరమ్మ ప్రభుత్వంలోనే సాధ్యం అయ్యింది. గతంలో కార్మికుల కోసం ఏ ప్రభుత్వం ఇంత గొప్పగా ఆలోచన, ప్రయత్నం చేయలేదు. తమ ప్రభుత్వం వచ్చాకే ఇది సాధ్యం అయింది. ప్రమాద బీమా, కారుణ్య నియామక పత్రం అందించడం ప్రభుత్వ ఆలోచనకు, కార్యాచరణకు, మానవీయ కోణానికి అద్దం పడుతుంది' అని భట్టి వ్యాఖ్యానించారు.

తొలుత సింగరేణిలో..

'కార్మికులకు ప్రమాద బీమా పథకాన్ని.. మొదట సింగరేణిలో ప్రవేశపెట్టాం. అనంతరం విద్యుత్ సంస్థల్లోనూ ఆచరణలోకి తీసుకువచ్చాం. కోటి రూపాయల పైబడి ప్రమాద బీమా విద్యుత్ సంస్థలో పనిచేసే కార్మికుల అందరిలో ఓ కొత్త భరోసా నింపుతుంది. విద్యుత్ ఉద్యోగులు అంకితభావంతో రాష్ట్ర ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి. ప్రభుత్వ ఆలోచనను సమర్థవంతంగా అమలు చేయాలి' అని విక్రమార్క కోరారు.

దేశంలో తొలిసారిగా..

ఈ పథకం కింద.. విధుల్లో ఉండగా విద్యుత్ ప్రమాదవశాత్తు మరణించిన ఉద్యోగి కుటుంబానికి రూ. 1 కోటి ఆర్థిక సహాయం అందుతుంది. దేశంలోనే మొట్టమొదటిసారిగా విద్యుత్ ఉద్యోగుల కోసం ఇంత పెద్ద మొత్తంలో ప్రమాద బీమాను తెలంగాణ ప్రభుత్వం అందిస్తోంది. ఈ పథకం ద్వారా విద్యుత్ ఉద్యోగులకు ఆర్థిక భద్రత లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. ఇది విద్యుత్ కార్మికులకు ఒక పెద్ద ఊరటనిచ్చే విషయం.

ఇటీవల ప్రమాదాలు..

ఈ ఏడాది ఏప్రిల్ 13న ఖైరతాబాద్‌లో ఒక విద్యుత్ ఉద్యోగి చెట్టుపై నుండి పడి మరణించారు. గతేడాది అక్టోబర్‌లో తెలంగాణలో విద్యుదాఘాతంతో ఇద్దరు కార్మికులు మరణించగా, ముగ్గురు గాయపడ్డారు. ఇలా అనేక ఘటనలు జరిగాయి. దీంతో బాధితుల కుటుంబాలకు అండగా నిలవాలని ప్రభుత్వం సంకల్పించింది.

సంబంధిత కథనం