Formula E Race Case : 'విచారణకు రండి' - మాజీ మంత్రి కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు
Telangana ACB Summons to KTR : ఫార్ములా -ఈ రేసింగ్ కేసులో తెలంగాణ ఏసీబీ దూకుడు పెంచుతోంది. ఇందులో భాగంగా… మాజీ మంత్రి కేటీఆర్ కు నోటీసులు జారీ చేసింది. జనవరి 6వ తేదీన ఉదయం 10గంటలకు విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది.
ఫార్ములా ఈ-కారు రేసు కేసులో దర్యాప్తు సంస్థలు స్పీడ్ పెంచాయి. ఇటీవలనే కేటీఆర్ కు ఈడీ నోటీసులు ఇవ్వగా.. తాజాగా ఏసీబీ కూడా నోటీసులు ఇచ్చింది. ఫార్ములా -ఈ రేసింగ్ కేసులో జనవరి 6న ఉదయం 10గంటలకు విచారణకు రావాలని పేర్కొంది. మరోవైపు ఈ కేసులో కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈడీ, ఏసీబీ నోటీసుల నేపథ్యంలో… ఈ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది.
ఇక ఈ కేసుకు సంబంధించి ప్రాథమికంగా ఏసీబీ కొన్ని కీలక అంశాలపై దృష్టిపెట్టింది. రేస్ నిర్వహణకు ప్రతిపాదనలు ఎలా సిద్ధం చేశారు? నిధుల చెల్లింపు ఎలా చేశారనే దానిపై వివరాలను సేకరిస్తోంది. ఆదేశాలు ఎక్కడ్నుంచి వచ్చాయి? ఉద్యోగుల పాత్ర ఏంటి అనే అంశాలపై లోతుగా పరిశీలిస్తోంది. అవసరమైతే ఉద్యోగుల వాంగ్ములాలను కూడా రికార్డ్ చేసే అవకాశం ఉంది. ఈ కేసులో మరికొందరికి కూడా నోటీసులు జారీ చేసి విచారించేందుకు రంగం కూడా సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
ఫార్ములా ఈ -కారు రేసు కేసులో ఫిర్యాదుదారుడైన ఐఏఎస్ అధికారి దాన కిషోర్‌ను ఇటీవలే ఏసీబీ అధికారులు విచారించారు. సుమారు 7 గంటల పాటు ప్రశ్నించి ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేశారు. దానకిశోర్ నుంచి కొన్ని కీలకమైన డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఆయన చెప్పిన వివరాల ఆధారంగా ఏసీబీ అధికారులు కేసు విచారణ చేపట్టనున్నారు.
ఫార్ములా ఈ-రేసు వ్యవహారంలో వరసుగా కీలక పరిణామాలు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఏసీబీ కేసు ఆధారంగా… విదేశీ సంస్థకు నిధులు బదిలీ చేయడంలో అధికార దుర్వినియోగం జరిగిందనే కోణంలో ఈడీ కూడా రంగంలోకి దిగింది. ఏసీబీ ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించింది. మాజీమంత్రి కేటీఆర్‌ను ప్రధాన నిందితుడిగా పేర్కొంది. ఇందులో భాగంగానే.. విచారణ కోసం ఈడీ కూడా నోటీసులను జారీ చేసింది.
7న ఈడీ విచారణ…!
ఫార్ములా ఈరేస్ కేసులో నిధుల మళ్లింపుపై విచారణ జరుపుతున్న ఈడీ… జనవరి 7వ తేదీన విచారణకు హాజరుకావాలని కేటీఆర్ కు నోటీసులు ఇచ్చింది. అంతేకాకుండా ఈ కేసులో ఏ2గా ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్‌ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్‌ఎన్ రెడ్డి(ఏ3)లకు కూడా నోటీసులు జారీ అయ్యాయి. బీఎల్ఎన్ రెడ్డి… జనవరి 2వ తేదీన హాజరుకావాల్సి ఉన్నప్పటికీ.. గైర్హాజరయ్యారు.
ఇక ఈ కేసులో ఉన్న ఐఎఎస్ అధికారి అర్వింద్‌కుమార్ కూడా తనకు మరింత గడువు కావాలని కోరారు. దాంతో వారిద్దరి విచారణను తాత్కాలికంగా వాయిదా వేసి కొత్త తేదీలతో ఈడీ అధికారులు మళ్లీ నోటీసులు జారీ చేశారు. ఈనెల 8, 9 తేదీల్లో వీరిని విచారించనుంది.
కేటీఆర్ హాజరువుతారా..?
ఫార్ములా ఈరేస్ వ్యవహారంపై ఏసీబీ కేసును సవాల్ చేస్తూ కేటీఆర్ ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో కేటీఆర్ ను అరెస్ట్ చేయవద్దని ఉన్నత న్యాయస్థానం కూడా ఆదేశాలు ఇచ్చింది. మరోవైపు ఏసీబీ కూడా కౌంటర్ పిటిషన్ దాఖలు చేసింది. ఇందులో పలు కీలక అంశాలను ప్రస్తావించింది. అనుమతులు లేకుండా ఏకపక్ష చెల్లింపులు చేశారని పేర్కొంది. ఫార్ములా-ఈ రేసు కేసు కొట్టివేయాలనే కేటీఆర్ పిటిషన్‌ను తిరస్కరించాలని హైకోర్టును ఏసీబీ కోరింది. ఇరుపక్షాల వాదనలను విన్న న్యాయమూర్తి తీర్పును వాయిదా వేశారు.
ఇప్పటికే ఏసీబీ కేసుపై న్యాయపోరాటం చేస్తున్న కేటీఆర్… ఈడీ విషయంలో ఏం చేయబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. ఈడీ జారీ చేసిన నోటీసులకు స్పందించి.. విచారణకు హాజరవుతారా..? లేక న్యాయస్థానాలను ఆశ్రయిస్తారా..? అనేది ఉత్కంఠను రేపుతోంది. అంతేకాకుండా… ఏసీబీ నోటీసులపై కూడా కేటీఆర్ ఎలా స్పందిస్తారనేది చర్చనీయాంశంగా మారింది.
సంబంధిత కథనం