ACB Rides : వరంగల్‌ డీటీసీ పుప్పాల శ్రీనివాస్ ఇంట్లో ఏసీబీ సోదాలు - భారీగా అక్రమాస్తుల గుర్తింపు!-acb searches at the residence of hanumakonda district deputy transport commissioner puppala srinivas ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Acb Rides : వరంగల్‌ డీటీసీ పుప్పాల శ్రీనివాస్ ఇంట్లో ఏసీబీ సోదాలు - భారీగా అక్రమాస్తుల గుర్తింపు!

ACB Rides : వరంగల్‌ డీటీసీ పుప్పాల శ్రీనివాస్ ఇంట్లో ఏసీబీ సోదాలు - భారీగా అక్రమాస్తుల గుర్తింపు!

HT Telugu Desk HT Telugu
Published Feb 08, 2025 06:43 AM IST

ఉమ్మడి వరంగల్‌ జిల్లా డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్‌ పుప్పాల శ్రీనివాస్ ఇంట్లో ఏసీబీ సోదాలు చేపట్టింది. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. భారీగా అక్రమాస్తులు కూడబెట్టినట్టు అధికారులు గుర్తించారు. ఇవాళ కూడా సోదాలు కొనసాగే అవకాశం ఉంది.

హన్మకొండ డీటీసీ శ్రీనివాస్ ఇంట్లో ఏసీబీ సోదాలు
హన్మకొండ డీటీసీ శ్రీనివాస్ ఇంట్లో ఏసీబీ సోదాలు

హనుమకొండలోని రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ ఇంట్లో ఏసీబీ సోదాలు కలకలం రేపాయి. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు డిప్యూటీ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ (డీటీసీ) డా.పుప్పాల శ్రీనివాస్ కు చెందిన ఇళ్లతో పాటు ఆయన బంధువుల ఇళ్లలో శుక్రవారం ఉదయం ఏకకాలంలో తనిఖీలు నిర్వహించారు.

హనుమకొండ జిల్లా హసన్ పర్తి మండల పరిధిలోని పలివేల్పుల మార్గంలోని దుర్గా కాలనీలో ఉంటున్న శ్రీనివాస్ ఇంటికి ఉదయం 6 గంటలకు చేరుకున్న అవినీతి నిరోధక శాఖ అధికారులు డీటీసీ శ్రీనివాస్ కు సంబంధించిన ఆదాయ పత్రాలు, దస్తావేజులు, స్థిర, చరాస్తులకు సంబంధించి విలువైన డాక్యుమెంట్లు పరిశీలించి, వాటిని స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు డీటీసీ పుప్పాల శ్రీనివాస్ స్వస్థలమైన జగిత్యాలలో కూడా సోదాలు నిర్వహించారు. హైదరాబాద్ లో ఆయనకు ఉన్న విల్లాలో కూడా తనిఖీలు చేపట్టారు.

రాత్రి వరకు కొనసాగిన సోదాలు

శుక్రవారం ఉదయం 6 గంటల సుమారులో వరంగల్ ఏసీబీ డీఎస్పీ సాంబయ్య ఆధ్వర్యంలోని ప్రత్యేక బృందం పలివేల్పులలోని డీటీసీ పుప్పాల శ్రీనివాస్ ఇంటికి చేరుకుంది. అక్కడ లోతుగా విచారణ చేపట్టిన అధికారులు వివిధ అంశాలపై ఆరా తీశారు.

పలివేల్పులలోని ఆయన ఇంట్లో వివిధ దస్తావేజులను స్వాధీనం చేసుకున్న అవినీతి నిరోధక శాఖ అధికారులు హసన్ పర్తి మండలం చింతగట్టు క్యాంపులో ఉన్న జిల్లా రవాణా శాఖ కార్యాలయానికి తీసుకువచ్చి విచారణ జరిపారు. తమకు అనుమానం ఉన్న వివిధ అంశాలపై సమాచారాన్ని సేకరించారు. అనంతరం ఆయనను ఇంటికి తీసుకుని వెళ్లి విచారణ కొనసాగించారు. దాదాపు 12 గంటలకుపైగా ఆయనను విచారణ జరిపినట్లు తెలుసింది. శుక్రవారం అర్ధరాత్రి వరకు వరకు సోదాలు కొనసాగగా.. పెద్ద మొత్తంలో అక్రమాస్తులు గుర్తించినట్లు తెలిసింది.

భారీగా అక్రమాస్తుల గుర్తింపు

గతేడాది ఫిబ్రవరిలో వరంగల్ డీటీసీగా బాధ్యతలు స్వీకరిం చిన డా.పుప్పాల శ్రీనివాస్ అంతకుముందు ఆదిలాబాద్, హైదరాబాద్ లో పని చేశారు. ఈ క్రమంలోనే భారీగా అక్రమాస్తులు కూడబెట్టినట్లు ఫిర్యాదులు అందగా.. ఈ మేరకు అధికారులు సోదాలు నిర్వహించారు. ఏసీబీ సోదాల్లో డీటీసీ పుప్పాల శ్రీనివాస్ భారీగా అక్రమాస్తులు కూడబెట్టినట్టు అవినీతి నిరోధక శాఖ అధికారులు గుర్తించారు.

హైదరాబాద్ తో పాటు కరీంనగర్, వరంగల్, జగిత్యాల జిల్లాల్లో ఆస్తులు కూడబెట్టినట్లు నిర్ధారించారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం డీటీసీ అక్రమాస్తుల విలువ ప్రభుత్వ లెక్కల ప్రకారం రూ.4.5 కోట్ల వరకు ఉండగా.. బయట మార్కెట్ వ్యాల్యూ ప్రకారం వాటి విలువ రూ.15 కోట్లకుపైగానే ఉంటుందని అంచనా. ఇందులో ఐదు వేర్వేరు ప్రాంతాల్లో 15 ఎకరాలకుపైగా వ్యవసాయ భూమితో పాటు 16 ఓపెన్ ప్లాట్లు ఉన్నాయి. వాటితో పాటు 23 విదేశీ మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు.

అనంతరం ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి పుప్పాల శ్రీనివా స్ ను అదుపులోకి తీసుకున్నారు. కాగా శుక్రవారం రాత్రి వరకు శ్రీనివాస్, ఆయన బంధువుల ఇళ్లలో తనిఖీలు చేపట్టిన అవినీతి నిరోధక శాఖ అధికారులు శ్రీనివాస్, ఆయన కుటుంబ సభ్యుల పేరున ఉన్న బ్యాంక్ లాకర్లు ఓపెన్ చేయాల్సి ఉంది. దీంతో శనివారం కూడా డీటీసీ పుప్పాల శ్రీనివాస్పై విచారణ జరిగే అవకాశం ఉంది. డీటీసీ శ్రీనివాస్ పై ఏసీబీ దాడుల నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఇంకొందరు రవాణాశాఖ అధికారుల్లో కూడా కంగారు మొదలైంది.

(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి).

Whats_app_banner

సంబంధిత కథనం