ఇగిగేషన్ ఇంజినీర్ పై ఏసీబీ సోదాలు - వందల కోట్ల విలువైన ఆస్తులు గుర్తింపు..!-acb raids on irrigation engineer sridhar unearths disproportionate assets ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  ఇగిగేషన్ ఇంజినీర్ పై ఏసీబీ సోదాలు - వందల కోట్ల విలువైన ఆస్తులు గుర్తింపు..!

ఇగిగేషన్ ఇంజినీర్ పై ఏసీబీ సోదాలు - వందల కోట్ల విలువైన ఆస్తులు గుర్తింపు..!

తెలంగాణ ఇరిగేషన్ శాఖ ఈఈ నూనె శ్రీధర్‌ కు సంబంధించి పలు చోట్ల ఏసీబీ సోదాలు జరిపింది. ఇందులో భారీగా ఆస్తులను గుర్తించారు.మొత్తం 13 ప్రాంతాల్లో సోదాలు చేసినట్లు ఏసీబీ వెల్లడించింది.

ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నూనె శ్రీధర్ పై ఏసీబీ సోదాలు - భారీగా ఆస్తులు గుర్తింపు

తెలంగాణ ఇరిగేషన్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ నూనె శ్రీధర్ అక్రమాస్తుల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఏసీబీ అధికారులు చేపట్టిన సోదాల్లో… భారీగా ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. ఇందుకు సంబంధించిన ప్రాథమిక వివరాలను ఏసీబీ ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది.

13 ప్రాంతాల్లో సోదాలు…

ఏసీబీ విడుదల చేసిన ప్రకటన వివరాల ప్రకారం…. నూనె శ్రీధర్ కు చెందిన మొత్తం 13 ప్రాంతాల్లో సోదాలు జరిగాయి. ఆయన నివాసమే కాకుండా బంధువుల ఇళ్లల్లోనూ తనిఖీలు చేశారు. తెల్లాపూర్ లో విల్లా, షేక్ పేట లో ప్లాట్, కరీంనగర్ లో మూడు ఓపెన్ ప్లాట్లు, అమీర్ పేటలో వాణిజ్య భవనం, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ లలో మూడు ఇండిపెండెంట్ హౌస్ లు ఉన్నట్లు గుర్తించారు. అంతేకాకుండా అతనికి సంబంధించి 16 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్లు తేలింది.

భారీగా నగదు…

రెండు కార్లు, బంగారు ఆభరణాలు, బ్యాంకులో భారీగా నగదు నిల్వ ఉన్నట్లు ఏసీబీ సోదాల్లో తేలిపింది. బహిరంగ మార్కెట్ లో రూ. వందల కోట్ల విలువైన ఆస్తులు ఉంటాయని అంచనా. శ్రీధర్ తన పదవిని అడ్డం పెట్టుకొని భారీగా అక్రమాస్తులు కూడ పెట్టినట్టు అధికారులు గుర్తించారు. అతడిని అరెస్ట్ చేసి హైదారాబాద్ నాంపల్లి కోర్టులో హాజరుపరిచి.. రిమాండ్ కు తరలించారు. ఈ కేసులో పూర్తిస్థాయిలో విచారణ జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.