ACB Raid : నిజామాబాద్ మున్సిపల్ అధికారి ఇంట్లో ఏసీబీ సోదాలు - కోట్లల్లో ఆస్తులు..! భారీగా బయటపడ్డ నోట్ల కట్టలు
ACB Raids in Nizamabad : నిజామాబాద్ మున్సిపల్ సూపరింటెండెంట్ ఇంటిపై ఏసీబీ సోదాలు చేపట్టింది. ఇందులో రూ.2.93 కోట్ల నగదు పట్టుబడింది. బంగారం ఆభరణాలను సీజ్ చేశారు. అవినీతి నిరోధక చట్టంలోని పలు సెక్షన్ కింద కేసులు నమోదు చేశారు.
కొద్దిరోజులుగా తెలంగాణ ఏసీబీ విస్తృతంగా సోదాలు చేస్తోంది. ఏదో ఒక చోట అవినీతి అధికారులు అడ్డంగా దొరికిపోతూనే ఉన్నారు. తాజాగా మరో అవినీతి అధికారి బాగోతం వెలుగులోకి వచ్చింది.
నిజామాబాద్ మున్సిపల్ సూపరింటెండెంట్ దాసరి నరేందర్ పై పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు రావడంతో ఇవాళ ఏసీబీ అధికారులు ఆయన నివాసం సోదాలు చేపట్టారు. ఈ దాడుల్లో భారీగా నోట్ల కట్టలు బయటపడ్డాయి.
నాగేందర్ ఇంట్లో రూ.2.93 కోట్ల నగదు పట్టుబడింది. అలాగే రూ.1.10 కోట్ల బ్యాంకు బ్యాలెన్స్ నరేందర్ తో పాటు కుటుంబ సభ్యుల ఖాతాల్లో ఉన్నట్లు గుర్తించారు. ఈ సోదాల్లో 50 తులాలకు పైగా బంగారాన్ని సీజ్ చేశారు. ఇప్పటివరకు స్వాధీనం చేసుకున్న మొత్తం ఆస్తుల విలువ దాదాపు రూ. 6.07 కోట్లు ఉంటుందని ఏసీబీ అధికారులు అంచనా వేశారు.
- నరేందర్ నివాసంతో పాటు ఇతర చోట్ల జరిపిన సోదాల్లో రూ. 6,07,00,000 కోట్ల విలువైన అక్రమ ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు.
- దొరికిన నగదు రూ. 2,93,00 000
- బ్యాంక్ బ్యాలెన్స్ రూ. 1,10,00,000
- 51 తులాల బంగారం
- స్థిరాస్తుల విలువ - రూ. 1,98,00,000
అవినీతి నిరోధక చట్టం 1988 ప్రకారం పలు సెక్షన్ల కింద నాగేందర్ పై కేసులు నమోదయ్యాయి. నరేందర్ ను అరెస్ట్ చేసి… హైదరాబాద్ లోని ఏసీబీ ప్రత్యేక కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. ఏసీబీ దర్యాప్తు కొనసాగుతుండగా… మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.