మరోసారి హైదరాబాద్ ఫార్ములా ఈ రేస్ కేసు తెరపైకి వచ్చింది. ఈ కేసులో కొద్దిరోజులుగా విచారణ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో మరోసారి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఏసీబీ నుంచి నోటీసులు జారీ అయ్యాయి. జూన్ 16వ తేదీన విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
ఈ కేసులో ఇప్పటికే ఒకసారు కేటీఆర్ విచారణకు హాజరయ్యారు. సుదీర్ఘంగా విచారణ కొనసాగింది. ఏసీబీ అడిగిన పలు ప్రశ్నలకు కేటీఆర్ సమాధానాలు ఇచ్చారు. అయితే మే నెల 28వ తేదీన కేటీఆర్ కు ఏసీబీ మరోసారి నోటీసులు ఇచ్చింది. విచారణకు రావాలని సూచించింది. అయితే అప్పటికే కేటీఆర్… అమెరికా పర్యటన ఖరారు చేసుకున్నారు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ.. అధికారులకు లేఖ ద్వారా సమాచారం ఇచ్చారు. దీంతో ఇవాళ మరోసారి నోటీసులు ఇచ్చారు. జూన్ 16వ తేదీన ఉదయం 10 గంటలకు విచారించనుంది.
ఫార్ములా ఈ కారు రేసు కేసులో.. గతేడాది డిసెంబర్ 29వ తేదీన ఏసీబీ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. ఈ కేసు వ్యవహారంలో ఏ1గా మాజీ మంత్రి కేటీఆర్ పేరు ఉంది. ఏ2గా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, ఏ3గా హెచ్‌ఎండీఏ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డి ఉన్నారు. అవినిరోధక చట్టంలోని సెక్షన్ 13(1)(A), 13(2)తో పాటు ఐపీసీ 409,120(B) సెక్షన్ల కింద నమోదు చేశారు. దీంతో ఈ కేసులో ఉన్న ప్రతి ఒక్కర్నీ ఇప్పటికే ఏసీబీ విచారించింది.
ఎలాంటి అనుమతులు లేకుండా HMDA నిధుల నుంచి రూ.55 కోట్లను విదేశీ సంస్థకు బదిలీ చేశారనే ఆరోపణలను అనుసరించి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ ఒప్పందంతో పాటు నిర్వహణకు సంబంధించి ఏసీబీ లోతుగా విచారిస్తోంది.
2023లో తొలిసారిగా ట్యాంక్ బండ్ పై భారీ ఏర్పాట్లు చేసి ఫార్ములా ఈరేస్ ఈవెంట్ నిర్వహించారు. 2023 ఫిబ్రవరి 11న నిర్వహించిన మొదటి ఫార్ములా-ఈ కార్ల పోటీకి మంచి స్పందన కూాడా వచ్చింది. ఇది సక్సెస్ కావటంతో 2024 ఫిబ్రవరి 10న మరోసారి(సెషన్-10) నిర్వహించేందుకు ఫార్ములా-ఈ ఆపరేషన్(ఎఫ్‌ఈవో)తో పురపాలక పట్టణాభివృద్ధి సంస్థ (ఎంఏయూడీ) 2023 అక్టోబరులో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకు హెచ్‌ఎండీఏ రూ.55 కోట్లు ఎఫ్‌ఈవోకు చెల్లించింది.
రెండోసారి ఈవెంట్ జరగాల్సి ఉండగా.. అప్పటికే రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగింది. కాంగ్రెస్ అధికారంలోకి రావటంతో ఈ ఒప్పందాన్ని రద్దు చేసింది. ఎఫ్‌ఈవోకు చెల్లించిన రూ. 55 కోట్లపై విచారణకు ఆదేశించింది. ఆర్థిక శాఖ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండానే ఈ డబ్బులను చెల్లించారని సర్కార్ గుర్తించింది. విదేశీ సంస్థకు నిధుల బదిలీ ప్రక్రియలో కూడా ఆర్బీఐ నిబంధనలు పాటించకుండా వ్యవహారించినట్లు ప్రాథమికంగా గుర్తించటంతో ఈ మొత్తం వ్యవహారపై దర్యాప్తునకు ఆదేశించింది. దీంతో ఈ కేసు విచారణ బాధ్యతలను ఏసీబీ చూస్తోంది.
టాపిక్