TG Welfare Schemes : ఇందిరమ్మ ఇండ్లు.. రేషన్ కార్డులు.. అప్పుడే మొదలైన లంచాల పర్వం!-acb caught ward officer while taking bribe in sathupalli of khammam district ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tg Welfare Schemes : ఇందిరమ్మ ఇండ్లు.. రేషన్ కార్డులు.. అప్పుడే మొదలైన లంచాల పర్వం!

TG Welfare Schemes : ఇందిరమ్మ ఇండ్లు.. రేషన్ కార్డులు.. అప్పుడే మొదలైన లంచాల పర్వం!

Basani Shiva Kumar HT Telugu
Jan 27, 2025 05:43 PM IST

TG Welfare Schemes : సంక్షేమ పథకాల కోసం పేదలు పరుగులు పెడుతున్నారు. ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డుల కోసం అధికారులు, ప్రజా ప్రతినిధుల చుట్టూ తిరుగుతున్నారు. వారి అవసరాన్ని ఆసరాగా చేసుకున్న అధికారులు లంచాలకు తెగబడుతున్నారు. తాజాగా సత్తుపల్లిలో ఓ వార్డు ఆఫీసర్ ఏసీబీకి చిక్కారు.

ఏసీబీకి చిక్కిన అవినీతి అధికారి
ఏసీబీకి చిక్కిన అవినీతి అధికారి (@TelanganaACB)

ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఓ అవినీతి అధికారి లంచం తీసుకుంటుండగా ఏసీబీ పట్టుకుంది. ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వారిని సత్తుపల్లి 32వ వార్డు ఆఫీసర్ నల్లంటి వినోద్ లంచం అడిగారు. లంచం ఇస్తే.. రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇల్లు దరఖాస్తును ప్రాసెస్ చేస్తానని చెప్పారు. దీంతో దరఖాస్తుదారులు ఏసీబీని ఆశ్రయించారు. సోమవారం మధ్యాహ్నం రూ.2500 లంచం ఇస్తుండగా.. ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

yearly horoscope entry point

జనవరి 26న ప్రారంభం..

తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను జనవరి 26న ప్రారంభించింది. మొత్తం 561 గ్రామాల్లో నాలుగు సంక్షేమ పథకాల అమలు ప్రారంభమైంది. ఈ పథకాలకు సంబంధించిన లబ్ధిదారులకు ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు మంజూరు పత్రాలు అందజేశారు.

561 గ్రామాల్లో..

561 గ్రామాల్లో లబ్ధిదారుల సంఖ్య ఇలా ఉంది. రైతు భరోసా - 3, 07,318, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా - 20,336, కొత్త రేషన్ కార్డులు - 42, 267, ఇందిరమ్మ ఇళ్లు పథకానికి సంబంధించి 72, 406 మందికి మంజూరు పత్రాలు అందజేశారు. మార్చి 31 లోపు అన్ని గ్రామాల్లో అర్హులందరికీ నాలుగు పథకాలు అమలయ్యేలా అధికారులు ప్రణాళికలు రూపొందించారు.

ఏక కాలంలో 4 పథకాలు..

ప్రతి గ్రామంలో ఏకకాలంలో నాలుగు పథకాలు అమలయ్యేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నాలుగు పథకాల లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ అందజేశారు. వెను వెంటనే లబ్ధిదారుల ఖాతాల్లోకి రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా డబ్బులు వెళ్లేలా చర్యలు చేపట్టారు. అయితే.. మండలానికి ఒక గ్రామంలోనే పథకాలను అమలు చేయడంపై విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. ప్రభుత్వంపై సెటైర్లు వేశారు.

కేటీఆర్ సెటైర్లు..

'అపరిచితుడు సినిమాలో రాము, రెమో లాగా రేవంత్ రెడ్డి ఉన్నారు. అప్పుడే రేపు తెల్లవారు నుంచి రైతు భరోసా అన్నారు. వెంటనే మార్చి 31 అని మాట మార్చారు. రేవంత్ రెడ్డి తెలివిగా మార్చి 31 అన్నారు కానీ.. ఏ సంవత్సరమో చెప్పలేదు. అహ నా పెళ్లంట సినిమాలో కోట శ్రీనివాసరావు లాగా రేవంత్ రెడ్డి పాలన ఉంది' అని కేటీఆర్ సెటైర్లు వేశారు.

Whats_app_banner