TS Sheep Distribution Scam : గొర్రెల పంపిణీ స్కామ్ - నలుగురు అధికారులు అరెస్ట్
Telangana Sheep Distribution Scam Updates : గొర్రెల పంపిణీ స్కామ్ లో ఏసీబీ స్పీడ్ పెంచింది. నలుగురు అధికారులను అరెస్ట్ చేసింది.
Telangana sheep distribution Scam : గొర్రెల పంపిణీ అవకతవకల్లో(Telangana Sheep Distribution Scam) నలుగురు అధికారులను అరెస్ట్ చేసింది ఏసీబీ. అవకతవకలు పాల్పడి రూ.2.10 కోట్లు కొట్టేసినట్లు గుర్తించారు. గొర్రెల కొనుగోలుదారులకు డబ్బులు చెల్లించకుండా బ్రోకర్ల అకౌంట్‌లో డబ్బులు డిపాజిట్ చేసినట్లు తేల్చారు. వ ఇందులో కీలకంగా వ్యవహరించిన నలుగురిని ఇవాళ మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో అదుపులోకి తీసుకున్నారు.
ఏసీబీ అరెస్ట్ చేసిన వారిలో మేడ్చల్ పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ఆదిత్య,కామారెడ్డి వెటర్నరీ ఆసుపత్రి అసిస్టెంట్ డైరెక్టర్ రవి, రంగారెడ్డి జిల్లా భూగర్భ జల అధికారి రఘుపతి, వయోజన విద్య డిప్యూటీ డైరెక్టర్ గణేష్ ఉన్నారు. నలుగురు నిందితులను నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరుపరచగా.. మార్చి 7 వరకు రిమాండ్ విధించింది. వీరిని చంచల్‌గూడా జైలుకు తరలించారు.
గొర్రెల పంపిణీలో భారీగా అవకతవకలు జరిగాయనే ఆరోపణల నేపథ్యంలో దీనిపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఈ కేసును ఏసీబీ దర్యాప్తు చేస్తుండగా.. కొద్దిరోజులుగా విచారణను ముమ్మరం చేసింది.
గొర్రెల పంపిణీ పథకాన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. రాష్ట్రంలోని యాదవ, కురుమ వర్గాలకు చెందిన వారికి ప్రభుత్వం నుండి సబ్సిడీతో గొర్రెలను పంపిణీ చేసేందుకు తీసుకొచ్చారు. విడతల వారీగా లబ్ధిదారులకు సబ్సిడీ కింద గొర్రెలను పంపిణీ చేసింది. అయితే ఈ పథకంలో భారీగా అవినీతి జరిగిందనే ఆరోపణలపై గచ్చిబౌలిలో కేసు నమోదైంది. ఈ కేసును గచ్చిబౌలి పోలీసులు ఏసీబీకి బదిలీ చేశారు.
ఏసీబీ ఎంట్రీతో ఈ స్కామ్ కు సంబంధించిన డొంక కదులుతుంది. స్కీమ్ లో కీలకంగా వ్యవహరించిన అధికారులు, కాంట్రాక్టర్లను విచారిస్తోంది.రికార్డులను పరిశీలించడంతో పాటు బాధితుల నుంచి వివరాలు సేకరిస్తోంది. కాగ్ నివేదికలో కూడా ఈ స్కీమ్ లోని పలు అంశాలను ప్రస్తావించింది. ఈ వివరాలను కూడా ఏసీబీ అధికారులు… పరిశీలిస్తున్నారు. తాజాగా నలుగురిని అరెస్ట్ చేయటంతో వీరిని… కస్టడీకి తీసుకునే యోచనలో కూడా ఉంది ఏసీబీ. ఫలితంగా మరింత సమాచారాన్ని రాబట్టవచ్చని చూస్తోంది. రాబోయే రోజుల్లో మరికొంత మందిని కూడా అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తోంది.