TS Eamcet Counselling: టాప్ ర్యాంకర్ల నిరాసక్తత.. వెరిఫికేషన్‌కు గైర్హాజరు
TS Eamcet Counselling: తెలంగాణ ఎంసెట్ తొలివిడత కౌన్సిలింగ్‌లో టాప్ ర్యాంకర్లు వెరిఫికేషన్‌కు దూరంగా ఉండిపోయారు. ఐఐటీలు, ఎన్‌ఐటిల్లో ప్రవేశాలు లక్ష్యంగా పెట్టుకోవడంతో స్థానిక కాలేజీల్లో ప్రవేశాలపై ఆసక్తి చూపడం లేదు. దీంతో టాప్ 200 ర్యాంకర్లు ఎవరు దరఖాస్తు చేసుకోలేదు.
TS Eamcet Counselling: తెలంగాణ ఎంసెట్ కౌన్సిలింగ్‌లో వెరిఫికేషన్‌కు తొలి 200 ర్యాంకర్ల గైర్హాజరయ్యారు. 200లోపు ర్యాంకర్లలో ఒక్కరు కూడా స్థానికంగా అడ్మిషన్లు పొందడానికి ఆసక్తి చూపలేదు. 500లోపు ర్యాంకర్లలో 14మంది సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేసుకున్నారు. తొలి వెయ్యిలోపు ర్యాంకులు సాధించిన వారిలో 104 మంది మాత్రమే వెరిఫికేషన్‌కు హాజరైనట్లు ధ్రువపత్రాల పరిశీలనలో వెల్లడైంది.
ఎంసెట్ ప్రవేశపరీక్షల్లో టాప్ ర్యాంకులు దక్కించుకున్న విద్యార్ధులు ఐఐటీలు, ఎన్‌ఐటీల్లో ప్రవేశాలు పొందాలని భావిస్తుండటంతో ఎంసెట్ కౌన్సిలింగ్‌కు దూరంగా ఉంటున్నారు. ఎంసెట్ తొలివిడత కౌన్సిలింగ్‌లో సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆదివారంతో ముగిసింది.
వెరిఫికేషన్ కోసం మొత్తం 81,856 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వీరంతా కన్వీనర్ కోటాలో ఇంజినీరింగ్ కళాశాలల్లో బీటెక్ సీట్లలో అడ్మిషన్ల కోసం సిద్ధమయ్యారు. వెరిఫికేషన్ పూర్తి చేసుకున్న వారిలో ఎందరు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకుంటారనేది ఈ నెల 12వ తేదీ నాటికి తేలుతుంది.
జులై 9వతేదీ నాటికి 66,215 మంది వెబ్ ఆప్షన్స్ ఇచ్చారు. ఎంసెట్ పరీక్షల్లో ఉత్తమ ర్యాంకులు సాధించిన వారు జాతీయస్థాయి విద్యాసంస్థల్లో చదివేందుకు ఆసక్తి చూపుతున్నారు. కన్వీనర్ కోటాలో బీటెక్ కంప్యూటర్ సైన్స్ సీటు రాదని అంచనాకు వచ్చిన వారు ముందే యాజమాన్య కోటాలో సీట్లు ఖరారు చేసుకుంటున్నారు. ప్రస్తుతం తెలంగాణలో కన్వీనర్ కోటాలో సీఎస్‌ఈ సీట్లు 21,503 ఉన్నాయి. ఈ సీట్లకు డిమాండ్ బాగా ఉండటంతో పోటీ కూడా తీవ్రంగానే ఉంది.
173 ఇంజినీరింగ్ కళాశాలల్లో 1,07,039 సీట్లు ఉండగా.. కన్వీనర్ కోటా కింద 76,359 ఉన్నాయి. వీటిలో 51,605 సీట్లు సీఎస్‌ఈ, ఐటీ, సంబంధిత బ్రాంచీల్లోనివే. వీటిలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ సీట్లు 21,503 ఉన్నాయి. ఈ విద్యాసంవత్సరం నుంచి కొత్తగా కంప్యూటర్ సైన్స్, సీఎస్‌ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సులు కూడా అందుబాటులోకి వచ్చాయి.