Vemulawada : రాజన్న భక్తులకు అలర్ట్.. 13 నుంచి వేములవాడలో అభిషేక పూజలు నిలిపివేత.. కారణం ఇదే-abhishekam puja at vemulawada temple to be suspended from november 13 ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Vemulawada : రాజన్న భక్తులకు అలర్ట్.. 13 నుంచి వేములవాడలో అభిషేక పూజలు నిలిపివేత.. కారణం ఇదే

Vemulawada : రాజన్న భక్తులకు అలర్ట్.. 13 నుంచి వేములవాడలో అభిషేక పూజలు నిలిపివేత.. కారణం ఇదే

Basani Shiva Kumar HT Telugu
Nov 12, 2024 09:46 AM IST

Vemulawada : కార్తీకమాసం సందర్భంగా వేములవాడ ఆలయానికి భక్తులు పోటెత్తున్నారు. ఈ నేపథ్యంలో.. అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈనెల 13 నుంచి భక్తులతో నిర్వహించే అభిషేక పూజలను నిలిపివేశారు. సోమవారం రోజున స్వామివారిని 80 వేల మంది దర్శించుకున్నారు.

వేములవాడ
వేములవాడ

తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈనెల 13 నుంచి 15 వరకు భక్తులతో నిర్వహించే అభిషేక పూజలు నిలిపివేస్తున్నట్టు ఆలయ ఈవో వినోద్ రెడ్డి ప్రకటించారు. స్వామివారి దర్శనానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తున్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు.

13, 14, 15 తేదీల్లో ఆలయంలో ప్రత్యేక పూజాలు ఉన్నాయని ఈవో వివరించారు. అందుకే గర్భాలయంలో భక్తులతో నిర్వహించే అభిషేక పూజలను నిలిపివేస్తున్నట్టు స్పష్టం చేశారు. మిగతా పూజలు ఎప్పటిలాగే కొనసాగుతాయని చెప్పారు. సోమవారం వేములవాడ రాజన్ను 80 వేల మంది భక్తులు దర్శించుకున్నారని వివరించారు.

అక్రమంగా కోడె టికెట్లు..

కార్తీక సోమవారం వేములవాడలో భక్తుల రద్దీ నెలకొంది. ఇదే అదునుగా కోడె టికెట్లను ఇద్దరు వ్యక్తులు ఎక్కువ రేటుకు విక్రయించారు. ఆ ఇద్దరిని ఎస్పీఎఫ్ సిబ్బంది రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కామారెడ్డి జిల్లా అన్నవరం గ్రామానికి చెందిన రమేష్ కుమార్, సిరిసిల్ల మండలం తిమ్మాపూర్‌కు చెందిన శ్రీనివాస్‌ను పట్టుకొని పోలీసులకు అప్పగించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కార్తీకమాసంలో వేములవాడ ఆలయానికి భక్తులు పోటెత్తున్నారు. స్వామివారి దర్శనానికి ఐదు నుంచి ఆరు గంటల సమయం పడుతుంది. శివ కేశవుల నిలయమైన వేములవాడకు వస్తున్న భక్తులు.. వేకువజామునుంచే బారులు తీరి స్వామివారిని దర్శించుకుని దీపాలు వెలిగిస్తున్నారు. అటు వీఐపీల తాకిడి కూడా పెరిగింది. రాజకీయ ప్రముఖులు రాజరాజేశ్వర స్వామిని దర్శించుకోవడానికి క్యూ కడుతున్నారు.

ఎలాంటి ఇబ్బందులు రాకుండా..

కార్తీకమాసం మొత్తం భక్తుల రద్దీ ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా సోమవారాల్లో భక్తులు ఆలయానికి పోటెత్తుతున్నారు. దీంతో రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆలయ అధికారులు వివరించారు. ఇటు ధరల విషయంలో ఫిర్యాదులు రావడంతో.. స్థానిక వ్యాపారులపైనా నిఘా పెంచారు. రద్దీ ఉందని ఎక్కువ డబ్బులు వసూలు చేస్తే.. చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.

Whats_app_banner