White Tiger Death: అభిమన్యు కన్నుమూత.. హైదరాబాద్‌ నెహ్రూ జూ పార్కులో మృతి చెందిన తెల్లపులి-abhimanyu passed away a white tiger died in nehru zoo park hyderabad ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  White Tiger Death: అభిమన్యు కన్నుమూత.. హైదరాబాద్‌ నెహ్రూ జూ పార్కులో మృతి చెందిన తెల్లపులి

White Tiger Death: అభిమన్యు కన్నుమూత.. హైదరాబాద్‌ నెహ్రూ జూ పార్కులో మృతి చెందిన తెల్లపులి

Sarath chandra.B HT Telugu
May 15, 2024 08:56 AM IST

White Tiger Death: హైదరాబాద్‌ నెహ్రూ జువాలజిక్‌ పార్క్‌లో సుదీర్ఘకాలంగా సందర్శకుల్ని అలరించిన బెంగాల్‌ వైట్ టైగర్ అభిమన్యు అనారోగ్యంతో కన్నుమూసింది.

హైదరాబాద్‌ జూ పార్కులో కన్నుమూసిన  తెల్లపులి
హైదరాబాద్‌ జూ పార్కులో కన్నుమూసిన తెల్లపులి

White Tiger Death: హైదరాబాద్‌లోని నెహ్రూ జూలాజికల్ పార్క్‌లో 9ఏళ్లుగా సందర్శకుల్ని అలరించిన బెంగాల్ టైగర్‌ "అభిమన్యు" కన్నుమూసింది. జూ పార్కులో సుదీర్ఘ కాలంగా ఉంటున్న మగ తెల్ల పులి మృతి పట్ల జూ సిబ్బంది విచారం వ్యక్తం చేశారు.

yearly horoscope entry point

2015 జనవరి 2న హైదరాబాద్‌ జూ పార్కులో బద్రీ-సమీరా అనే జంటకు అభిమన్యు జన్మించినట్లు జూ వర్గాలు తెలిపాయి. గత ఏడాది కాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. 2023 ఏప్రిల్ 21 నుంచి మూత్రపిండాల సమస్యతో అభిమన్యు సతమతమైనట్టు జూ వర్గాలు పేర్కొన్నాయి. వన్య మృగాలకు వచ్చే నెఫ్రైటిస్‌ సంబంధిత సమస్యలకు చికిత్స అందిస్తున్నట్టు పేర్కొన్నారు.

అభిమన్యు ఆరోగ్య పరిస్థితిని మెరుగుపరిచేందుకు వెటర్నరీ మెడిసిన్, పులుల సంరక్షణ నిపుణులతో పాటు ఇతర జంతు ప్రదర్శనశాలల్లోని నిపుణులను కూడా సంప్రదించారు. దానికి తలెత్తిన ఆరోగ్య సమస్యలను అధిగమించడానికి అనేక మందులతో పాటు పలు రకాల చికిత్సలను నిపుణులు సూచించారు.

కొద్దిరోజులుగా అభిమన్యు ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తోంది. మే 5నుంచి లేవలేకపోవడం, నడవలేకపోవడం వంటి సమస్యలు తలెత్తాయి. దీంతో పలుమార్లు రక్త పరీక్షలు నిర్వహించి, చికిత్స కొనసాగించారు.

మే12 నుంచి అభిమన్యు రుమాటిజంతో పాటె ఆహారం తీసుకోవడం మానేసింది. అభిమన్యును కాపాడేందుకు వైద్యులు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించలేదని జువాలజికల్ పార్క్ అధికారులు తెలిపారు. మే 14 మధ్యాహ్నం 2గంటలకు చికిత్స అందుతుండగానే ప్రాణాలు విడిచినట్టు పేర్కొన్నారు.

అభిమన్యుకు హైదరాబాద్‌లోని VBRI నిపుణులు, వెటర్నరీ నిపుణుల సమక్షంలో పోస్ట్‌మార్టం నిర్వహించారు. "దీర్ఘకాలిక మూత్రపిండాల వైఫల్యం" కారణంగా మృతి చెందినట్టు నిర్ధారించారు. నమూనాలను సేకరించి వివరణాత్మక ప్రయోగశాల నిర్ధారణ కోసం హైదరాబాద్‌లోని VBRI కి పంపారు.

వైల్డ్‌లైఫ్ హాస్పిటల్ & రెస్క్యూ సెంటర్ అంకితమైన వెటర్నరీ వైద్యులు, నిపుణులు, జంతు సంరక్షకులు నిరంతరం కృషి చేసినా అభిమన్యు జీవితాన్ని పొడిగించలేకపోయినట్టు నెహ్రూ జూ పార్క్‌ క్యూరేటర్ విచారం వ్యక్తం చేశారు. సందర్శకులను సుదీర్ఘకాలంగా అలరించిన అభిమన్యు మృతి తమను విషాదంలో నింపిందని పేర్కొన్నారు. హైదరాబాద్‌ నెహ్రూ జూ పార్కులో ప్రస్తుతం 18 పులులు ఉన్నాయి. వాటిలో 8 తెల్ల పులులు ఉన్నాయి. వేసవి నేపథ్యంలో పులుల సంరక్షణ కోసం జూ పార్క్‌లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

Whats_app_banner