Warangal : పదేళ్లుగా అవినీతిపై ఒంటరి పోరు.. వరంగల్ యువకుడి వినూత్న కార్యక్రమాలు
Warangal : ప్రభుత్వ కార్యాలయాల్లో ఏ పని కావాలన్నా లంచాలు ఇవ్వాల్సిందే. ఆఫీసర్లు సంతకం పెట్టాలన్నా.. ఫైల్ ముందుకు కదలాలన్నా చేతులు తడపక తప్పదు. ఇటీవల ఏసీబీ దాడుల్లో పట్టుబడుతున్న అధికారుల ఉదంతాలే ఇందుకు సాక్ష్యం. ఇలాంటి అవినీతిని రూపుమాపేందుకు వరంగల్ యువకుడు ఒంటరి పోరు చేస్తున్నారు.
వరంగల్ జిల్లా ఆరెపల్లి గ్రామానికి చెందిన సుంకరి ప్రశాంత్.. పీజీ వరకు చదివాడు. వ్యక్తిగతంగా సమాజ సేవ పట్ల ఆసక్తి కలిగిన ఆయన.. ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి, లంచగొండితనాన్ని కొన్ని సందర్భాల్లో స్వయంగా ఎదుర్కొన్నాడు. ఆ తరువాత అవినీతిపై పోరు నడిపించడానికి నిర్ణయించుకుని, ‘జ్వాలా’ పేరున అవినీతి వ్యతిరేక స్వచ్ఛంద సంస్థను స్థాపించాడు.
తన స్నేహితులు, సన్నిహితులతో కలిసి ప్రతి సంవత్సరం డిసెంబర్ 9న జరుపుకునే అవినీతి వ్యతిరేక దినోత్సవాన్ని.. వినూత్న రీతిలో నిర్వహిస్తున్నాడు. ముందుగా హనుమకొండ వేయి స్తంభాల గుడి నుంచి అంబేడ్కర్ సెంటర్ వరకు ఎన్సీసీ క్యాడెట్ల సహాయంతో ర్యాలీ నిర్వహించి.. అవినీతికి వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శిస్తుంటాడు.
ఒక్కో ఏడాది.. ఒక్కోలా..
అవినీతిపై యుద్ధం చేస్తున్న సుంకరి ప్రశాంత్.. ఇదివరకు అవినీతికి పాల్పడిన అధికారులను పట్టించిన సందర్భాలు ఉన్నాయి. అవినీతికి పాల్పడుతున్న అధికారుల్లో పరివర్తన రావడంతో పాటు లంచగొండి తనాన్ని నిర్మూలించేందుకు.. జనాల్లో అవగాహన తీసుకొచ్చేందుకు ప్రశాంత్ ఏటా వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు.
మూడేళ్ల కిందట అవినీతికి పాల్పడిన అధికారుల వేషం వేయించి గాడిదలతో ఊరేగింపు నిర్వహించాడు. ఆ తరువాత లంచం తీసుకోకుండా, ప్రజలకు నిస్వార్థంగా సేవలందిస్తున్న అధికారులను వరంగల్‌కు రప్పించి, వారిని గుర్రాలపై ఊరేగించి సన్మానించాడు. ఎన్పీడీసీఎల్ లో ఏడీఈగా పని చేస్తున్న పొడేటి అశోక్.. తాను లంచం తీసుకోకుండా.. తన ఆఫీసులో లంచం ఇవ్వొద్దు అంటూ బోర్డులు ఏర్పాటు చేశాడు. ఆయనను పిలిపించి సన్మాన కార్యక్రమాలు నిర్వహించాడు. గతంలో సూర్యాపేట జిల్లా పాలకీడు మండలంలో ఏఆర్ఐగా పని చేసిన సీహెచ్.నరసయ్య పైసా లంచం తీసుకోకుండా పనులు చేశాడు. ఈ విషయం తెలుసుకున్న ప్రశాంత్.. ఆయనను సన్మానించాడు.
రోగిలా నీతి..
ఏటా మాదిరిగానే ఈసారి కూడా అవినీతి వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ప్రశాంత్ వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించాడు. నీతి నిజాయితీ ఆసుపత్రిలో వెంటిలేటర్ పై ఉంటే.. అవినీతి, అక్రమాలు బాడీ బిల్డర్‌గా రోజురోజుకు ముదిరిపోతున్నాయనే డిఫరెంట్ కాన్సెప్ట్‌తో.. వేయిస్తంభాల గుడి నుంచి అంబేడ్కర్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించాడు. ఇందుకు ఒక వ్యక్తికి నీతి, నిజాయితీ అనే పేరు పెట్టి అంబులెన్స్‌లో వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తూ.. అవినీతి, అక్రమాలను సూచించే బాడీ బిల్డర్లతో నగరంలో ర్యాలీ నిర్వహించాడు. వినూత్నంగా ర్యాలీ నిర్వహించడంతో వాహనదారులు, రాకపోకలు సాగించే ప్రజలు ఆసక్తిగా తిలకించారు.
ఈ సందర్భంగా సుంకరి ప్రశాంత్ మాట్లాడుతూ.. దేశంలో అవినీతి రాజ్యం ఏలుతోందన్నారు. నీతి, నిజాయితీ వెంటిలేటర్‌పై కొట్టుమిట్టాడుతుంటే.. అవినీతి బాడీ బిల్డర్‌గా స్ట్రాంగ్ అవుతోందన్నారు. అవినీతి అధికారుల భరతం పట్టేందుకు ప్రభుత్వం ఫాస్ట్ కోర్టులు ఏర్పాటు చేయాలని, లంచగొండులపై కఠిన చర్యలు తీసుకుంటేనే అవినీతి నిర్మూలన సాధ్యం అవుతుందని అభిప్రాయపడ్డారు.
ప్రజాప్రతినిధులు అవినీతికి పాల్పడబోమంటూ అసెంబ్లీ సాక్షిగా ప్రమాణం చేయాలని ప్రశాంత్ డిమాండ్ చేశారు. ఏసీబీ ట్రాప్ అయిన అధికారులను సర్వీస్ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. డయల్ 100 మాదిరిగానే డయల్ 1064 ద్వారా కూడా క్విక్ యాక్షన్ ఉండేలా ప్రభుత్వాలు చొరవ చూపాలని కోరారు. మారుతున్న టెక్నాలజీ ఆధారంగా అవినీతి అధికారులపై నిఘా పెట్టి.. దోషులను శిక్షించాలని కోరారు.
(రిపోర్టింగ్- ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)