Jangaon Tragedy : ప్రాణం తీసిన మట్టి దందా.. ట్రాక్టర్ బోల్తా పడి యువకుడు దుర్మరణం-a young man died after a tractor overturned in jangaon ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Jangaon Tragedy : ప్రాణం తీసిన మట్టి దందా.. ట్రాక్టర్ బోల్తా పడి యువకుడు దుర్మరణం

Jangaon Tragedy : ప్రాణం తీసిన మట్టి దందా.. ట్రాక్టర్ బోల్తా పడి యువకుడు దుర్మరణం

HT Telugu Desk HT Telugu

Jangaon Tragedy : జనగామ జిల్లాలో అక్రమ మట్టి దందా ఓ యువకుడి ప్రాణం తీసింది. ఇటుక బట్టీ పనుల కోసం రేగడి మట్టి లోడ్‌తో వచ్చిన ట్రాక్టర్.. అక్కడున్న యువకుడి తలపై బోల్తా పడింది. దీంతో ఆయన అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. ఈ ఘటన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఘటనా స్థలంలో రోధిస్తున్న మృతుడి బంధువులు

జనగామ జిల్లా కొడకండ్ల మండలంలోని మొండ్రాయి గ్రామ శివారులోని గిర్ని తండా సమీపంలో ఇటుక బట్టీ పనులు నడుస్తున్నాయి. ఇటుకల తయారీ కోసం బోడోనికుంట నుంచి గిర్నితండాకు ట్రాక్టర్‌తో రేగడి మట్టి చేరవేస్తున్నారు. మొండ్రాయి గ్రామానికి చెందిన విఘ్నేష్(18) అనే యువకుడు లోడింగ్ లిస్ట్ రాస్తున్నాడు. ఒక్కో ట్రాక్టర్, ఎన్ని ట్రిప్పులు వస్తోందో లెక్కలు వేస్తున్నాడు.

మట్టిని అన్‌లోడ్ చేస్తుండగా..

ఈ క్రమంలో శనివారం ఉదయం ఓ ట్రాక్టర్ మట్టిని అన్ లోడ్ చేసేందుకు ఇటుక బట్టీ ప్రదేశానికి వచ్చింది. విఘ్నేష్ దాని వద్దకు వెళ్లాడు. వివరాలు రాసుకుంటున్న క్రమంలో.. ట్రాక్టర్ డ్రైవర్ మట్టిని లోడ్ చేసేందుకు డబ్బా జాకీ లేపాడు. డబ్బా పైకి లేచిన అనంతరం ఒకవైపు ఒరిగి అక్కడే ఉన్న విఘ్నేష్ తలపై పడింది. దీంతో విఘ్నేష్ అక్కడే కుప్పకూలిపోయాడు. అతని తలపై ట్రాక్టర్ డబ్బా పడటంతో తల మొత్తం నుజ్జునుజ్జయ్యింది. ఘటనా స్థలంలోనే విఘ్నేష్ ప్రాణం కోల్పోయాడు. ఈ విషయం తెలుసుకున్న మొండ్రాయి గ్రామస్థులు అక్కడికి చేరుకున్నారు. పోలీసులకు సమాచారం అందించడంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించే పనిలో పడ్డారు.

అక్రమంగా దందా..

గిర్నితండాలో ఏర్పాటు చేస్తున్న ఇటుక బట్టీకి స్థానిక బోడోని కుంట నుంచి మట్టిని అక్రమంగా తరలిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఎలాంటి పర్మిషన్ లేకుండా నిర్వాహకులు మట్టి దందా సాగిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. గతంలో కూడా ఇక్కడ మట్టి దందా జరుగుతోందని తెలిసినా.. అధికారులు పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అక్రమంగా సాగుతున్న ఈ దందాపై విచారణ జరిపించి, తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

నెల కిందట ధర్మసాగర్‌లో..

దాదాపు నెల రోజుల కిందట ధర్మసాగర్ మండలంలో కూడా అక్రమ మట్టి దందా స్తానిక యువకుడిని బలిగొంది. ధర్మసాగర్ మండల పరిధిలోని ఎల్కుర్తి సమీపంలో ఓ ప్రైవేటు వెంచర్ ఏర్పాటు అవుతుండగా.. దానికి ధర్మసాగర్ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి మట్టిని తరలిస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఇష్టారీతిన తవ్వడం, రాత్రికి రాత్రి టిప్పర్ లారీలతో వెంచర్ కు తరలించే పనులు చేస్తున్నారు. ఈ క్రమంలో మార్చి 8వ తేదీ రాత్రి అక్రమంగా మట్టి తరలించే పనులు నడిపించడం మొదలు పెట్టారు.

అధికారులు ఇకనైనా స్పందిస్తారా..

మడికొండ గ్రామానికి చెందిన అనిల్(32) అనే డ్రైవర్ టిప్పర్ నడుపుతూ మట్టి చేర వేస్తున్నాడు. ఈ క్రమంలో తెల్లవారుజాము లోడ్ మట్టిని వెంచర్ వద్ద అన్ లోడ్ చేసి, తిరిగి వెళ్తున్న క్రమంలో వెంచర్ వద్ద ఏర్పాటు చేసిన ఆర్చీ ఒక్కసారిగా టిప్పర్‌పై కూలింది. క్యాబిన్ పైనే ఆర్చీ కూలి పడటంతో అనిల్ అందులోనే ఇరుక్కుపోయి తీవ్రంగా గాయపడ్డారు. తీవ్ర రక్త స్రావం జరిగి టిప్పర్ క్యాబిన్ లోనే ప్రాణాలు కోల్పోయాడు. ఇక్కడ మట్టి దందాకు కూడా స్థానిక అధికారులు వంత పాడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అక్రమ మట్టి దందా ప్రాణాలు తీస్తుండగా.. ఇకనైనా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.

(రిపోర్టింగ్: హిందుస్తాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి)

HT Telugu Desk

సంబంధిత కథనం