BRS MLA Padi Kaushik Reddy : 'రేవంత్ రెడ్డే ఆదర్శం' - దాడి ఘటనపై వీడియో క్లిప్ విడుదల చేసిన పాడి కౌశిక్ రెడ్డి-a video clip of the attack was released by brs mla padi kaushik reddy ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Brs Mla Padi Kaushik Reddy : 'రేవంత్ రెడ్డే ఆదర్శం' - దాడి ఘటనపై వీడియో క్లిప్ విడుదల చేసిన పాడి కౌశిక్ రెడ్డి

BRS MLA Padi Kaushik Reddy : 'రేవంత్ రెడ్డే ఆదర్శం' - దాడి ఘటనపై వీడియో క్లిప్ విడుదల చేసిన పాడి కౌశిక్ రెడ్డి

Maheshwaram Mahendra Chary HT Telugu
Jan 15, 2025 05:18 PM IST

BRS Padi Kaushik Reddy Attack Case : కరీంనగర్ జిల్లా సమావేశంలో తనపైనే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దాడి చేశారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు. ముందుగా సంజయ్ తనను నెట్టాడని.. ఆపై మానకొండూరు ఎమ్మెల్యే కాలర్ పట్టుకుని లాగారని చెప్పారు. ఈ మేరకు వీడియో క్లిప్ విడుదల చేశారు.

వీడియో క్లిప్ విడుదల చేసిన పాడి కౌశిక్ రెడ్డి
వీడియో క్లిప్ విడుదల చేసిన పాడి కౌశిక్ రెడ్డి

జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పై తాను దాడి చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్పష్టం చేశారు. తనపైనే సంజయ్ దాడి చేశారని చెప్పుకొచ్చారు. ఇవాళ తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడిన పాడి కౌశిక్ రెడ్డి… పలు వివరాలను వెల్లడించారు. అంతేకాకుండా… కొన్ని ఫొటోలతో పాటు వీడియో క్లిప్ ను విడుదల చేశారు.

నాపైనే దాడి చేశారు - కౌశిక్ రెడ్డి

“మీ బట్టలు చింపుతా అని మమ్మల్ని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ అన్నాడు. నేను లేచి నువ్వు ఏ పార్టీ మీద గెలిచావు అంటే కాంగ్రెస్ పార్టీ అని చెప్పాడు. ఈ క్రమంలోనే సంజయ్ ది ఏ పార్టీ అని అడిగాను. సంజయ్ పై నేను దాడి చేయలేదు. ముందుగా నా ఛాతిపై చేయి పెట్టి సంజయ్ నెట్టాడు. ఆపై మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ కాలర్ పట్టుకొని లాగారు. మరో ఎమ్మెల్యే మక్కన్ సింగ్ ఠాకూర్ నా ప్యాంట్ జేబులో చేతి పెట్టి గుంజాడు. మంత్రి శ్రీధర్ బాబు వేలు చూపుతూ బెదిరించాడు. పోలీసులు నెట్టివేయటంతో కింద పడ్డాను. మంత్రుల ఆదేశాలతో నన్ను గుంజుకెళ్లారు” అని కౌశిక్ రెడ్డి చెప్పారు.

రేవంత్ రెడ్డే ఆదర్శం….

"జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ లాగా నేను పైసలకి అమ్ముడు పోలేదు. పైసలకు అమ్ముడు పోయింది సంజయ్. కేసీఆర్ గారు టికెట్ ఇచ్చారు. నేను హుజురాబాద్ ప్రజలు ఓట్లు వేస్తే ఎమ్మెల్యేగా గెలిచా. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌ని ఎట్టి పరిస్థితిలో డిస్‌క్వాలిఫై చేయాలి. పార్టీ మారిన ఎమ్మెల్యేలను రేవంత్ రెడ్డి ప్రశ్నించమంటేనే నేను ప్రశ్నించా. ఈ విషయంలో రేవంత్ రెడ్డినే ఆదర్శం. రేవంత్ రెడ్డి పార్టీ మారిన ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టమన్నాడు… కానీ నేను రాళ్లతో కొట్టకుండా జస్ట్ ప్రశ్నించాను. రేపు ఊరిలోకి వస్తే బరాబర్ మా కార్యకర్తలు రాళ్లతోని కొడతారు" అంటూ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హెచ్చరించారు.

కౌశిక్ రెడ్డిపై కేసులు నమోదు:

హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డిని సోమవారం పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆదివారం కరీంనగర్‌ జిల్లా సమీక్షలో జరిగిన ఘటన నేపథ్యంలో హైదరాబాద్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కరీంనగర్‌ కలెక్టరేట్ లో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పై దాడికి యత్నించారంటూ కరీంనగర్లో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేపై 4 కేసులు నమోదయ్యాయి.

సోమవారం రాత్రి హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. కరీంనగర్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కౌశిక్‌ రెడ్డిపై ఆది, సోమవారాల్లో నాలుగు కేసులు నమోదయ్యాయి. కాగా మంగళవారం ఉదయం కోర్టు కౌశిక్ రెడ్డికి బెయిల్ మంజూరు చేసింది. అదే రోజు కరీంనగర్ లో మీడియాతో మాట్లాడిన కౌశిక్ రెడ్డి… బుధవారం హైదరాబాద్ లో వివరాలను వెల్లడిస్తానని చెప్పారు. అందులో భాగంగానే… ఇవాళ మీడియాతో మాట్లాడారు. ఫొటోలతో పాటు వీడియోలను విడుదల చేశారు.

Whats_app_banner

సంబంధిత కథనం