Sangareddy : గీతం యూనివర్సిటీలో విషాదం... ఫ్యాన్ కు ఉరి వేసుకొని విద్యార్థిని సూసైడ్-a student of sangareddy gitam university committed suicide by hanging himself from a fan in the hostel room ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Sangareddy : గీతం యూనివర్సిటీలో విషాదం... ఫ్యాన్ కు ఉరి వేసుకొని విద్యార్థిని సూసైడ్

Sangareddy : గీతం యూనివర్సిటీలో విషాదం... ఫ్యాన్ కు ఉరి వేసుకొని విద్యార్థిని సూసైడ్

HT Telugu Desk HT Telugu
Sep 28, 2024 05:51 PM IST

సంగారెడ్డిలోని గీతం యూనివర్శిటీలో విషాదం చోటు చేసుకుంది. హాస్టల్ గదిలోని ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఓ విద్యార్థిని సూసైడ్ చేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు… అన్ని కోణాల్లో విచారిస్తున్నారు. చనిపోయిన విద్యార్థిని ఏపీలోని అనంతపురం జిల్లాకు చెందిన నాగల్లి వర్షగా గుర్తించారు.

 నాగల్లి వర్ష (19)
నాగల్లి వర్ష (19)

సంగారెడ్డి జిల్లా రుద్రారంలోని గీతం యూనివర్సిటీ లో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థి హాస్టల్ గదిలో ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఏపీలోని అనంతపురం జిల్లాకు చెందిన నాగల్లి వర్ష (19) గీతం యూనివర్సిటీలో బీటెక్ సిఎస్ఈ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. అక్కడే బాలికల హాస్టల్ లో ఉంటుంది. 

చదువులో ఎప్పుడు ముందుడే వర్ష శుక్రవారం ఉదయం కాలేజీకి వచ్చి మధ్యాహ్నం తిరిగి హాస్టల్ గదికి వెళ్ళింది. అనంతరం రూమ్ మేట్స్ భోజనానికి వెళ్లిన తర్వాత వర్ష హాస్టల్ గదిలో ఫ్యాన్ కు బెడ్ షీట్ తో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.

మరల మధ్యాహ్నం అందరూ విద్యార్థులు క్లాసులకు హాజరు కాగా… వర్ష రాకపోవడంతో తోటి విద్యార్థులు హాస్టల్ రూమ్ కి వెళ్లి తలుపు కొట్టారు. ఆమె తలుపు తీయకపోవడంతో వాచ్ మెన్ వచ్చి తలుపు పగలగొట్టి లోపలికి వెళ్లి చూడగా వర్ష ఉరి వేసుకొని ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించింది. వెంటనే కిందకు దింపి ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పటాన్చెరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఈ విషయాన్ని గీతం యూనివర్సిటీ యాజమాన్యం.. పటాన్చెరు పోలీసులకు, వర్ష తల్లితండ్రులకు సమాచారం అందించారు. సమాచారం అందిన వెంటనే పటాన్ చెరు పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. అయితే వర్ష ఎవరితో ఎక్కువ మాట్లాడకుండా, ఎక్కువ సమయం లైబ్రరీ లో ఉండేదని స్నేహితులు తెలిపారు. లేదంటే హాస్టల్ రూమ్ కి వచ్చి చదువుకునేదని తెలిపారు. కావున ఆత్మహత్య చేసుకున్న వర్ష చదువు ఒత్తిడితో చనిపోయి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

మెదక్ మరో ఘటన :

పెళ్లైన ఆరు నెలలకే జీవితంపై విరక్తి చెంది వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన మెదక్ జిల్లా కల్హేర్ మండలం ఖానాపూర్ గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. 

వివరాల్లోకి వెళ్తే కల్హేర్ మండలం ఖానాపూర్ గ్రామానికి చెందిన నమిల్లా హనుమండ్లుతో కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం మాదాపూర్ గ్రామానికి చెందిన వైష్ణవి (21) కి ఆరు నెలల క్రితం వివాహం జరిగింది. అప్పటి నుండి భార్యాభర్తల మధ్య తరచు గొడవలు జరుగుతూ ఉండేవి. దీంతో ఇటీవల ఇరు గ్రామా పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ నిర్వహించి ఇద్దరికి నచ్చజెప్పి కలిసిమెలిసి ఉండాలని సూచించారు. 

ఈ క్రమంలో ఇంట్లో ఎవరు లేని సమయంలో వైష్ణవి దూలానికి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నారాయణఖేడ్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతురాలి తండ్రి చిట్టివాడ బాలాజీ పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

రిపోర్టింగ్ - ఉమ్మడి మెదక్ జిల్లా ప్రతినిధి, HT తెలుగు.