Vemulawada Temple : వేములవాడలో నిఘా వైఫల్యం..! భక్తులను ఆందోళనకు గురి చేస్తున్న వరుస ఘటనలు-a series of worrying incidents in vemulawada due to failure of surveillance ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Vemulawada Temple : వేములవాడలో నిఘా వైఫల్యం..! భక్తులను ఆందోళనకు గురి చేస్తున్న వరుస ఘటనలు

Vemulawada Temple : వేములవాడలో నిఘా వైఫల్యం..! భక్తులను ఆందోళనకు గురి చేస్తున్న వరుస ఘటనలు

HT Telugu Desk HT Telugu
Dec 27, 2024 08:38 PM IST

వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం అధికారుల నిర్లక్ష్యానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తుంది. మొన్న రాజన్న కోడలు అక్రమంగా విక్రయానికి గురైన ఘటన మరిచిపోక ముందే ఆలయంలోని హుండీలో నగదు మాయం కలకలం సృష్టిస్తుంది. మరోవైపు మాంసాహారం ఆలయ ఆవరణలో పంపిణీ విమర్శలకు తావిస్తుంది.

వేములవాడ ఆలయం
వేములవాడ ఆలయం

దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ లో వరుస ఘటనలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. భక్తుల మనోభావాలను దెబ్బతీసే చర్యలు సాగుతుండడం సర్వత్రా విమర్శలకు తావిస్తుంది. నిత్యం వేలాది మంది భక్తులు సందర్శించే రాజన్న ఆలయంలో అధికారుల నిర్లక్ష్యం, నిఘా వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది.

yearly horoscope entry point

గర్భాలయంలోని హుండీల నుంచి నగదు చోరీ అధికారుల నిర్లక్ష్యానికి, నిఘా వైఫల్యానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తుంది. వారంలో మూడు సార్లు హుండీల నుంచి మైనర్లు డబ్బులు తీసుకుపోతుంటే నిఘా కెమెరాలు, భద్రతా సిబ్బంది, హడావిడి చేసే ఆలయ అధికారులు ఏం చేస్తున్నారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మొక్కుబడి చర్యలతో చేతులు దులుపుకుంటున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భక్తి భావంతో భక్తులు సమర్పించే కానుకలు చోరీకి గురికావడం, కోడెలు అక్రమంగా విక్రయించడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

ఇద్దరు మైనర్లను గుర్తించిన పోలీసులు..

ప్రస్తుతం హుండీలో నగదు ఎత్తుకెళ్లిన ఇద్దరు మైనర్లను పోలీసులు గుర్తించారు. అరెస్టు చేసి జువెనైల్ కు తరలించి చట్ట ప్రకారం చర్యలు చేపట్టారు. గతంలో పలువురు హుండీలలోని నగదు కాజేసి కటకటాలపాలైన ఘటనలు ఉన్నాయి. ఓవైపు కోడెల గోల నడుస్తుంటే, ప్రస్తుతం హుండీలోని నగదు మైనర్లు ఎత్తుకెళ్లడం అధికారుల నిర్లక్ష్యాన్ని తేటతెల్లం చేస్తుంది.

మరోవైపు ఆలయ ఆవరణలో మాంసాహారం పంపిణీ వివాదాస్పదంగా మారింది. క్రిస్మస్ రోజున ఆలయ ఆవరణలో చికెన్ రైస్ ఎగ్ రైస్ గుర్తుతెలియని వ్యక్తులు పంపిణీ చేశారు. అన్యమత ప్రచారం అంటూ సర్వత్రా ఆందోళన వ్యక్తం కావడంతో అప్రమత్తమైన పోలీసులు, ఆలయ అధికారులు విచారణ చేపట్టారు. చివరకు చికెన్ రైస్ ఎగ్ రైస్ ఆలయ ఆవరణలో పంపిణీ చేయలేదని బయట పంపిణీ చేసిన దాన్ని నిత్యం అక్కడ అడుక్కునే నిరుపేద భక్తులు ఆలయ ఆవరణలోకి తీసుకొచ్చినట్లు స్పష్టం చేశారు.‌ మరోసారి అలా జరగకుండా కౌన్సిలింగ్ ఇచ్చినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు.

విమర్శల వెల్లువ…!

ఆలయ అధికారులు, నిఘా వర్గాలు చేతులుకాలక ఆకులు పట్టుకున్నట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముందు జాగ్రత్త చర్యలు చేపట్టకుండా హుండీలో నగదు మాయంపై పోలీసులకు ఫిర్యాదు చేసి… ఆలయ ఆవరణలో మాంసాహారం పంపిణీతో శుద్ధిచేసి సంప్రోక్షణ నిర్వహించారు. ఇకనైనా అధికారులు మేల్కొని పకడ్బందీ చర్యలు చేపట్టాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.‌ లేనిచో ఆందోళన చేపట్టక తప్పదని విశ్వహిందూ పరిషత్, బిజెపి నాయకులు హెచ్చరించారు.

కోడెలపై సమగ్ర సర్వే...

మరోవైపు గత నెలలో రైతుల పేరిట రాజన్న కోడెలు పొంది అక్రమంగా విక్రయించిన విషయంపై అధికారులు విచారణ చేపట్టారు. ఇప్పటికే వరంగల్ జిల్లాకు చెందిన ముగ్గురిని అరెస్టు చేసి అక్రమంగా కోడెలు పొందిన వారి నుంచి 26 కోడెలు స్వాధీనం చేసుకుని రాజన్న గోషాలకు తరలించారు.

మరోవైపు ఏడాది కాలంగా రాజన్న కోడెలు 1975 పొందిన వారు రైతులా, రైతుల మసుగులో దళారులా అని తేల్చేందుకు సమగ్ర సర్వే చేపట్టారు. సర్వే కోసం 20 మందిని నియమించి తెలంగాణలోని ఉమ్మడి పది జిల్లాలకు, జిల్లాకు ఇద్దరు చొప్పున నియమించి సర్వే నిర్వహిస్తున్నారు. ఈ నెలాఖరులోగా సర్వే పూర్తి చేసి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా కు నివేదిక సమర్పించనున్నారు. కలెక్టర్ సైతం రాజన్న గోశాలను సందర్శించి పశువుల సంరక్షణకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆలయ అధికారులను, పశుసంవర్ధక శాఖ అధికారులను ఆదేశించారు.

రిపోర్టింగ్ : కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు.

Whats_app_banner

సంబంధిత కథనం