Warangal Crime : వరంగల్‌లో దొంగల బీభత్సం.. తాళాలు వేసి ఉన్న ఇళ్లే టార్గెట్‌గా దొంగతనాలు!-a series of thefts in warangal district has become a sensation ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Warangal Crime : వరంగల్‌లో దొంగల బీభత్సం.. తాళాలు వేసి ఉన్న ఇళ్లే టార్గెట్‌గా దొంగతనాలు!

Warangal Crime : వరంగల్‌లో దొంగల బీభత్సం.. తాళాలు వేసి ఉన్న ఇళ్లే టార్గెట్‌గా దొంగతనాలు!

Basani Shiva Kumar HT Telugu
Jan 15, 2025 09:31 AM IST

Warangal Crime : పండగ పూట వరంగల్ జిల్లాలో వరుస దొంగతనాలు సంచలనంగా మారాయి. దీంతో జిల్లా ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంక్రాంతికి ఊర్లకు వెళ్లిన వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వరుస చోరీల నేపథ్యంలో.. పోలీసులు అలర్ట్ అయ్యారు. ప్రజలకు కీలక సూచనలు చేస్తున్నారు.

వరంగల్‌లో దొంగల బీభత్సం
వరంగల్‌లో దొంగల బీభత్సం (istockphoto)

వరంగల్‌ జిల్లాలో దొంగలు బీభత్సం సృష్టించారు. ఎనుమాముల, గీసుకొండ, దామెరబొడ్డు, చింతలపల్లి గ్రామాల్లో వరుస చోరీలకు పాల్పడ్డారు. తాళాలు వేసి ఉన్న ఇళ్లే టార్గెట్‌గా దొంగతనాలకు పాల్పడ్డారు. భారీగా బంగారం, నగదు దోచుకెళ్లారు. వరుస చోరీలతో ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు.

yearly horoscope entry point

పండగకు ముందే..

పండగకు ముందే పోలీసులు ప్రజలకు సూచనలు చేశారు. జాగ్రత్తలు పాటించాలని స్పష్టం చేశారు. రాత్రిపూట గస్తీ పెంచారు. కానీ.. దొంగలు రూటు మార్చి అర్బన్ ఏరియాలో కాకుండా రూరల్ ప్రాంతాల్లోనూ చోరీలకు పాల్పడ్డారు. ఎనుమాముల మార్కెట్ ఏరియా నగరంలో ఉన్నా.. గీసుకొండ, దామెరబొడ్డు, చింతలపల్లి గ్రామీణ ప్రాంతాలు. ఇక్కడ దొంగతనాలు జరగడంతో ప్రజల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది.

పెద్ద ప్రాసెస్..

చోరీ జరిగాక.. పోలీసులకు ఫిర్యాదు చేయడం, వారు దర్యాప్తు చేయడం, దొంగల కోసం గాలించడం చాలా పెద్ద ప్రాసెస్. చోరీకి గురైన సొమ్ము దోరుకుతుందో లేదో చెప్పలేని పరిస్థితి. అందుకే తెలంగాణ పోలీసులు ప్రజలకు, ముఖ్యంగా ఊరెళ్లే వారికి కీలక సూచనలు చేశారు. 7 జాగ్రత్తలు పాటించాలని విజ్ఞప్తి చేశారు.

ఇవీ జాగ్రత్తలు..

1.ఇంటికి, ఇంటిగేటుకు తాళం వేసి దూర ప్రాంతాలకు వెళ్లవద్దు. ఒకవేళ అత్యవసర పరిస్థితిలో వెళ్లినా సమీప బంధువులను, తెలిసిన మిత్రులను ఇంటి దగ్గర పడుకొనే విధంగా చూసుకోవాలి.

2.ఒకవేళ తాళం వేయాల్సిన పరిస్థితి ఏర్పడితే.. ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకి కనపడే విధంగా గేట్‌కి, మెయిన్ డోర్‌కి వేయకూడదు. గేట్ బయట నుండి కాకుండా లోపల నుండి, మెయిన్ డోర్ కాకుండా పక్క డోర్లకు తాళం వేసుకోవాలి. తాళం కనపడకుండా డోర్ కర్టెన్‌తో కవర్ చేసే విధంగా చూసుకోవాలి.

3.ఎట్టి పరిస్థితుల్లోనూ విలువైన వస్తువులను.. బంగారు, వెండి ఆభరణాలను, నగదును బీరువాలో పెట్టకూడదు. తప్పనిసరిగా బ్యాంక్ లాకర్లో భద్రపరచుకోవాలి.

4.రాత్రి సమయంలో ఇంట్లో వెలుతురు ఉండేటట్లు ఏదైనా రూంలో లైట్ వేసి ఉంచాలి.

5.తప్పనిసరి ఊరికి వెళ్తే.. ఇంటి పక్కన వారికి, సంబంధిత పోలీస్ స్టేషన్‌కి సమాచారం అందించాలి. పోలీస్ స్టేషన్లో తెలియజేస్తే.. రాత్రి గస్తీ తిరిగే సిబ్బంది ప్రత్యేకంగా నిఘా ఉంచుతారు.

6. ఫోన్లో నోటిఫికేషన్ వచ్చేటువంటి సీసీటీవీ కెమెరాలను ఇంటికి అమర్చుకోవాలి. ఇంటి బయటకు నాలుగు దిక్కులా రోడ్డు కవర్ అయ్యే విధంగా కమ్యూనిటీ, నేను సైతం కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి.

7.ఎవరైనా కొత్త వ్యక్తులు, అనుమానితులు మీ ఇంటి చుట్టుపక్కల, కాలనీలో తిరిగితే.. వెంటనే డయల్ 100 కి గాని, సంబంధిత పోలీస్ స్టేషన్‌కు గాని సమాచారం ఇవ్వాలి. ప్రతి ఒక్కరూ ఈ సూచనలు పాటిస్తూ.. సహకరించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

Whats_app_banner