TS Power Sector: తెలంగాణలో కరెంట్‌పై రగడ.. సిఎండీల రాజీనామాల కలకలం-a series of resignations of top officials in the telangana electricity department ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Power Sector: తెలంగాణలో కరెంట్‌పై రగడ.. సిఎండీల రాజీనామాల కలకలం

TS Power Sector: తెలంగాణలో కరెంట్‌పై రగడ.. సిఎండీల రాజీనామాల కలకలం

HT Telugu Desk HT Telugu
Dec 08, 2023 06:39 AM IST

TS Power Sector: తెలంగాణలో విద్యుత్‌ విషయంలో చర్చ జరుగుతున్న తరుణంలో విద్యుత్తు శాఖలో సీఎండీల రాజీనామాలు కలకలం రేపుతున్నాయి.

విద్యుత్ శాఖపై నేడు సమీక్షించనున్న సిఎం రేవంత్ రెడ్డి
విద్యుత్ శాఖపై నేడు సమీక్షించనున్న సిఎం రేవంత్ రెడ్డి

TS Power Sector:రెండు రోజుల కిందట టీఎస్​ జెన్​ కో, ట్రాన్స్​ కో సీఎండీ ప్రభాకర్​ రావు రాజీనామా చేయగా.. తాజాగా గురువారం టీఎస్​ ఎన్​పీడీసీఎల్ సీఎండీ అన్నమనేని గోపాలరావు కూడా తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు తన రాజీనామా పత్రాన్ని ఇంధనశాఖ ప్రిన్సిపల్​ సెక్రటరీ పంపించారు.

ఇప్పటికే రాష్ట్రంలో కరెంట్ విషయంలో కాంగ్రెస్​, బీఆర్​ఎస్​ పార్టీల మధ్య యుద్ధం నడుస్తుండగా.. అదే శాఖకు సంబంధించిన కీలక వ్యక్తులు పదవులు వీడి వెళ్లిపోతుండటంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా సీఎం రేవంత్​ రెడ్డి నిర్వహించిన తొలి కేబినెట్​ మీటింగ్ లో కరెంట్ పై తీవ్ర చర్చ జరగగా.. శుక్రవారం అధికారులతో రివ్యూ జరగనుంది. ఈ మీటింగ్​ కు సీఎండీ ప్రభాకర్​ రావును రప్పించాల్సిందిగా అధికారులకు ఆదేశాలు ఇవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్​ గా మారింది.

విద్యుత్తు సంక్షోభం తెచ్చే కుట్ర జరిగిందనే అనుమానాలు

తెలంగాణలో 24 గంటల కరెంట్ విషయంపై ఎన్నికల ముందు బీఆర్​ఎస్​, కాంగ్రెస్​ పార్టీలు మాటల యుద్ధం చేసుకున్నాయి. కాంగ్రెస్​ వస్తే చీకటి రాజ్యమే వస్తుందని, ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన క్షణం నుంచే కరెంట్​ కోతలు ఉంటాయంటూ బీఆర్​ఎస్​ ప్రచారం చేయగా.. అలాంటిదేమీ ఉండదంటూ కాంగ్రెస్​ కూడా ధీటుగా సమాధానం చెబుతూ వచ్చింది. దీంతో రెండు పార్టీల నడుమ ఇదే ప్రధాన ఎన్నికల అస్త్రంగా మారింది.

ఎన్నికల ప్రక్రియ ముగిసి కాంగ్రెస్​ అధికారం దక్కించుకోగా.. సీఎం రేవంత్​ రెడ్డి నిర్వహించిన మొట్టమొదటి కేబినెట్ మీటింగ్​ లో కీలకంగా విద్యుత్తు అంశం పై చర్చ జరిగింది. ఈ సందర్భంగా విద్యుత్తుశాఖలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులను దాచిపెట్టారంటూ సీఎం రేవంత్ రెడ్డి అధికారులపై సీరియస్​ అయ్యారు.

కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలో విద్యుత్తు సంక్షోభం తెచ్చేలా కుట్ర జరిగిందని సీఎం అభిప్రాయపడ్డారు. విద్యుత్తు శాఖలో ఇప్పటివరకు 85 వేల కోట్ల అప్పులు ఉన్నట్లు అధికారులు సీఎంకు వివరించగా.. దీనిపై పూర్తిస్థాయి వివరణ కోసం 2014 నుంచి ఇప్పటివరకు శాఖకు సంబంధించిన పూర్తి వివరాలతో హాజరు కావాల్సిందిగా ఆఫీసర్లను ఆదేశించారు.

ఈ మేరకు శుక్రవారం పూలే ప్రజా భవన్​ లో నిర్వహించే ప్రజాదర్బార్ అనంతరం విద్యుత్తుశాఖ ఉన్నతాధికారులతో సీఎం ప్రత్యేకంగా రివ్యూ చేయనున్నారు. కాగా ట్రాన్స్​ కో, జెన్ కో సీఎండీ ప్రభాకర్​ రావు ఇప్పటికే రాజీనామా చేయడంతో ఆయన రాజీనామాను ఆమోదించవద్దని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అంతేగాకుండా శుక్రవారం నిర్వహించే రివ్యూకు ప్రభాకర్​ రావును కూడా రప్పించాలని ఆర్డర్​ వేశారు. దీంతో ఆ రివ్యూలో ఏ జరుగుతుందోననే ఉత్కంఠ నెలకొంది.

హాట్ టాపిక్ గా ఇద్దరు సీఎండీల రాజీనామా

ఇప్పటికే ట్రాన్స్​ కో సీఎండీ ప్రభాకర్​ రావు రాజీనామా కలకలం రేపగా.. తెలంగాణ స్టేట్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్(టీఎస్​ఎన్పీడీసీఎల్​)​ సీఎండీ అన్నమనేని గోపాలరావు రాజీమానా చేయడం కూడా హాట్ టాపిక్​ గా మారింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత 2016 అక్టోబర్​ నెలలో గోపాలరావు సీఎండీగా బాధ్యతలు స్వీకరించి.. ఇప్పటివరకు ఆయనే కొనసాగారు.

ప్రభాకర్ రావు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటయ్యాక 2014 జూన్ 5న జెన్కో, ఆ తరువాత అక్టోబర్ లో ట్రాన్స్ కో బాధ్యతలు తీసుకుని ఇన్నేళ్లు అదే పదవిలో కొనసాగారు. బీఆర్​ఎస్ ప్రభుత్వం దిగిపోయిన వెంటనే అటు ప్రభాకర్​ రావు, ఇటు గోపాలరావు ఇద్దరూ రాజీనామాలు చేయడంపై చర్చ జరుగుతోంది. వీరిద్దరికీ విద్యుత్తుశాఖకు సంబంధించిన లోటుపాట్లపై సంపూర్ణ అవగాహన ఉండే అవకాశం ఉండగా.. ఇప్పటికే ప్రభాకర్ రావు రాజీనామాను ఆమోదించవద్దని సీఎం ఆదేశించారు.

ఎన్​పీడీసీఎల్​ సీఎండీ కూడా గురువారమే రాజీనామా లేఖ పంపగా.. విద్యుత్తు శాఖ రివ్యూ మీటింగ్ కు ఆయనను కూడా పిలిచే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఓవైపు కేసీఆర్​ సహా ఇతర బీఆర్​ఎస్​ నేతలంతా కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కరెంట్ కోతలు మొదలవుతాయని ప్రచారం చేయడం, మరోవైపు సీఎం రేవంత్​ రెడ్డి కాంగ్రెస్​ అధికారంలోకి రాగానే విద్యుత్తు సంక్షోభం తెచ్చేలా కుట్ర జరిగిందంటూ కామెంట్ చేయడం చర్చనీయాంశంగా మారాయి. మొత్తానికి కరెంట్ అంశం రాష్ట్ర వ్యాప్తంగా ప్రాధాన్యం సంతరించుకోగా.. చివరకు అది ఎక్కడికి దారి తీస్తుందో చూడాలి.

(హిందుస్తాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)

Whats_app_banner