Bhupalpally District : వాగులో మునిగి ప్రభుత్వ పాఠశాల విద్యార్థి మృతి - హాస్టల్ ఎదుట పేరెంట్స్ ఆందోళన-a school student died after drowning in the river in jayashankar bhupalpally district ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Bhupalpally District : వాగులో మునిగి ప్రభుత్వ పాఠశాల విద్యార్థి మృతి - హాస్టల్ ఎదుట పేరెంట్స్ ఆందోళన

Bhupalpally District : వాగులో మునిగి ప్రభుత్వ పాఠశాల విద్యార్థి మృతి - హాస్టల్ ఎదుట పేరెంట్స్ ఆందోళన

HT Telugu Desk HT Telugu
Feb 05, 2025 05:22 PM IST

భూపాలపల్లి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. చలివాగులో మునిగి పాఠశాల విద్యార్థి మృతి చెందాడు. బాలుడి మృతికి హాస్టల్ వార్డెన్ నిర్లక్ష్యమే కారణమని బాధిత కుటుంబ సభ్యులు హాస్టల్ ఎదుట ఆందోళనకు దిగారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.

చలివాగులో మునిగి స్కూల్ స్టూడెంట్ మృతి
చలివాగులో మునిగి స్కూల్ స్టూడెంట్ మృతి

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దారుణం జరిగింది. మొగుళ్లపల్లి మండల కేంద్రానికి సమీపంలోని చలివాగులో స్నానానికి వెళ్లిన ఓ స్కూల్ విద్యార్థి వాగులో పడి ప్రాణాలు కోల్పోయాడు. దీంతో విద్యార్థి తల్లిదండ్రులు శోక సంద్రంలో మునిగారు. కాగా బాలుడి మృతికి హాస్టల్ వార్డెన్ నిర్లక్ష్యమే కారణమని బాధిత కుటుంబ సభ్యులు హాస్టల్ ఎదుట ఆందోళనకు దిగారు.

yearly horoscope entry point

వివరాల్లోకి వెళ్తే… జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం పంగిడిపల్లి గ్రామానికి చెందిన పురాణం సంతోష్ కుమార్ (14) మొగుళ్లపల్లి మండలంలోని ఎస్సీ బాలుర హాస్టల్ ఉంటూ స్థానిక ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. రోజువారీగా స్కూల్ కు వెళ్లాల్సిన సంతోష్ కుమార్ బుధవారం ఉదయం సమయంలో తన తోటి స్నేహితుడితో కలిసి హాస్టల్ నుంచి సమీపంలోని చలి వాగులో ఈత కొట్టేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో నీళ్ల తాకిడి కారణంగా సంతోష్ కుమార్ చలి వాగులో మునిగిపోగా.. తనతో వచ్చిన మరో స్నేహితుడు కేకలు వేసినా చుట్టుపక్కలా ఎవరూ లేకపోవడంతో లాభం లేకపోయింది. దీంతో సంతోష్ కుమార్ చలి వాగులో గల్లంతయ్యాడు.

హాస్టల్ ఎదుట పేరెంట్స్ ఆందోళన

సంతోష్ కుమార్ గల్లంతయిన విషయాన్ని మరో స్నేహితుడు హాస్టల్ సిబ్బందికి సమాచారం ఇచ్చాడు. ఆ తరువాత స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న చిట్యాల పోలీసులు హుటాహుటినా ఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం స్థానికుల సహాయంతో మృతదేహాన్ని వెలికి తీశారు. అక్కడి నుంచి అంబులెన్స్ లో డెడ్ బాడీని చిట్యాల సివిల్ ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. కాగా అప్పటికే ఘటనా స్థలం వద్దకు చేరుకున్న మృతుడు సంతోష్ కుమార్ కుటుంబ సభ్యులు పోలీసులు, అంబులెన్స్ ను అడ్డుకున్నారు.

అంబులెన్స్ కు అడ్డం తిరిగి మృతదేహం తరలింపును అడ్డుకున్నారు. పోలీసులు సర్ది చెప్పే ప్రయత్నం చేసినా వినకుండా వారితో గొడవ పడి మృత దేహాన్ని ప్రైవేటు కారులో ఎస్సీ బాయ్స్ హాస్టల్కు తీసుకుని వచ్చారు. హాస్టల్ వార్డెన్ నిర్లక్ష్యంగా వల్లే తమ కుమారుడు ప్రాణాలు కోల్పోయాడని ఆరోపిస్తూ మృత దేహాన్ని ఎస్సీ హాస్టల్ ఎదుట పెట్టి నిరసన చేపట్టారు. బాధిత కుటుంబ సభ్యులతో పాటు బంధువులు పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో హాస్టల్ ప్రాగణమంతా గందరగోళంగా మారింది.

హాస్టల్ అధికారుల నిర్లక్ష్యం వల్లే తమ కొడుకు ప్రాణాలు కోల్పోయాడంటూ బాధిత తల్లిదండ్రులు రోధిస్తుండగా.. పోలీసులు నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య మాటామాట పెరిగి ఉద్రిక్తతకు దారి తీసింది. మృతుడి కుటుంబ సభ్యులు, బంధువుల రోధనలతో అక్కడంతా విషాద వాతావరణం నెలకొంది. కాగా చివరకు పోలీసులు సర్ది చెప్పగా, ఆందోళన విరమించారు.

మృతుడు సంతోష్ కుమార్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు వివరించారు. కాగా హాస్టల్ వార్డెన్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటం వల్ల తరచూ విద్యార్థులు బయటకు వెళ్లిపోతున్నారని, అక్కడున్న సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుని హాస్టల్ ను చక్కదిద్దాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి).

Whats_app_banner

సంబంధిత కథనం