Telangana : తెలంగాణలో కొత్త రకం బ్రాండ్ బీర్లు..! సిట్టింగ్ జడ్జితో విచారణకు BRS డిమాండ్
New Beer Brands in Telangana : తెలంగాణలో కొత్త రకం బీర్లు మార్కెట్ లోకి వచ్చే అవకాశం ఉంది. సోమ్ డిస్టిలరీస్ కంపెనీకి ఇటీవలే అనుమతులు రావటంతో త్వరలోనే ఈ కంపెనీ ఉత్పత్తులు అందుబాటులోకి రానున్నాయి.
New Beers in Telangana : కొద్దిరోజులుగా తెలంగాణలో బీర్ల కొరతపై తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది. పలు రకాల బ్రాండ్లు చాలా షాపుల్లో అందుబాటులో ఉండటం లేదు. బార్లలో కూడా దొరకటం లేదన్న వార్తలు వినిపించాయి. అయితే గత వారం రోజులుగా చూస్తే…. పరిస్థితి కొద్దిగా మారినట్లు కనిపిస్తోంది.
వైన్స్ షాపుల్లో బీర్లు దొరకుతున్నప్పటికీ…. కొన్ని బ్రాండ్లు దొరకటం లేదని మందుబాబులు అంటున్నారు. ఇదిలా ఉంటే… మార్కెట్ లోకి కొత్త రకం బీర్లు అందుబాటులోకి వచ్చేందుకు రంగం సిద్ధమైంది. త్వరలోనే కొత్త రకం బ్రాండ్ బీర్ల కొనుగోళ్లు జరగనున్నాయి.
సోమ్ డిస్టిలరీస్ కు అనుమతులు…!
తెలంగాణలో తమ కంపెనీకి చెందిన బ్రాండ్ బీర్లను అందించేందుకు సోమ్ డిస్టిలరీస్ అనే సంస్థ దరఖాస్తు చేసుకుంది. ఇందుకు ప్రభుత్వం(బెవరేజెస్ కార్పొరేషన్) నుంచి అనుమతి కూడా పొందింది. ఇదే విషయాన్ని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా ధ్రువీకరించారు. నిబంధనల మేరకే సోమ్ డిస్టిలరీస్ కంపెనీ ఉత్పత్తులను తెలంగాణ బేవరేజెస్ కార్పోరేషన్‌కు సరఫరా చేసేందుకు అనుమతి ఇచ్చినట్లు వెల్లడించారు. ఈ విషయంలో బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణలు సరికావన్నారు.
భారతదేశంలో బీర్ వినియోగానికి అతిపెద్ద మార్కెట్‌లలో ఒకటిగా సోమ్ డిస్టిలరీస్ గుర్తింపు పొందింది. తెలంగాణలో సరఫరా చేయటంపై సోమ్ డిస్టిలరీస్ స్పందిస్తూ…. “మా మార్కెట్ పరిధిని విస్తరించడంతో పాటు బీర్ల డిమాండ్ ను తీర్చేందుకు ప్రయత్నం చేసేందుకు ఈ ఆమోదం కీలకమైన దశను సూచిస్తుంది” అని ఓ ప్రకటనలో తెలిపినట్లు ఆంగ్ల వెబ్ సైట్(business-standard.com) వార్తను ప్రచురించింది.
కొత్త మద్యం ఉత్పత్తులపై వివాదం - బీఆర్ఎస్ ప్రశ్నలు….
కొత్త మద్యం ఉత్పత్తుల ఎంట్రీపై బీఆర్ఎస్ పార్టీ పలు ప్రశ్నలను సంధించింది. ఆ పార్టీ అధికారిక ప్రతినిధి మన్నె క్రిశాంక్ బుధవారం మీడియాతో మాట్లాడారు. సోమ్ డిస్టిలరీస్ కంపెనీకి అనుమతుల విషయంపై ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుకు పలు ప్రశ్నలను సంధించారు.
- 21 మే 2024 గాంధీభవన్ లో ప్రెస్ సమావేశం పెట్టి మంత్రి జూపల్లి కృష్ణారావు గారు ఎలాంటి మద్యం కంపెనీలు తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా వ్యాపారం చేయడానికి ప్రతిపాదనలు పెట్టలేదని చెప్పారు. పైగా అలా ప్రచారం చేసే మీడియా సంస్థలపై 100 కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేస్తారని బెదిరించారు.
- 27 మే 2024న బిఆర్ఎస్ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్ నుంచి మంత్రి జూపల్లి కృష్ణారావు గారి అబద్ధాన్ని బహిర్గతం చేస్తూ Som Distilleries అనే సంస్థకు అనుమతులు కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వడం పై మీడియా సమావేశం పెట్టడం జరిగింది. దీనికి జవాబుగా మంత్రి జూపల్లి కృష్ణారావు గారు 28 మే న పత్రిక లేఖ విడుదల చేసి Som Distilleries అనే సంస్థకు అనుమతులు ఇవ్వడం వాస్తవమే అని ఒప్పుకున్నారు.
- జూపల్లి కృష్ణారావు గారు తెలంగాణ రాష్ట్ర మంత్రిగా రాజ్యాంగబద్ధంగా ప్రమాణ స్వీకారం చేశారని మరిచినట్టున్నారు. నకిలీ మద్యానికి పేరుగాంచిన Som Distilleries వ్యాపార సంస్థ తెలంగాణ రాష్ట్రంలో తన వ్యాపారం మొదలు పెడుతుంటే కనీసం సమాచారం లేదని మంత్రి అనడం బాధ్యతరహితం. Som Distilleries సంస్థకు కార్పొరేషన్ వారే అనుమతులు ఇచ్చారు మంత్రికి సమాచారం లేదని తన లేఖలో పేర్కొనడం హాస్యాస్పదం.
- ప్రభుత్వ ఆదాయానికి మరీ ముఖ్యంగా ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన ఈ నకిలీ మద్యం అంశం మంత్రికి తెలియకుండానే ప్రెస్ మీట్ పెట్టి 100 కోట్ల పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించి ఇప్పుడు తెలియదని చెప్పడం రాష్ట్ర ప్రజలకు అనుమానాలు వస్తున్నాయి. రేపటి దినం ఈ నకిలీ మద్యంతో రాష్ట్ర ప్రజలకు ఆరోగ్యానికి ఇబ్బందులు కలిగితే ఎవరు బాధ్యత తీసుకుంటారు మంత్రి ఇలాగే తనకు సమాచారం లేదని అధికారుల మీదకి నెట్టేస్తారా? మంత్రి బాధ్యత వహించరా?
- ఈ సంవత్సరం 26 ఫిబ్రవరి 2024న మధ్యప్రదేశ్ ప్రభుత్వంలో అబ్కారి విభాగం Som Distilleries సంస్థకు నకిలీ మద్యం అమ్ముతున్నందుకు నోటీసులు ఇచ్చింది వాస్తవమే కదా..? సెక్షన్లు 420, 467, 468, 471, 120 B ఆరోపణలతో సంస్థ చైర్మన్ జగదీష్ అరోరా పై కేసు వేసి జైలుకు పంపింది వాస్తవం కదా. దీనిపై మంత్రి జూపల్లి తన లేఖలో ఎందుకు సమాధానం చెప్పలేదు?
- మధ్యప్రదేశ్ ప్రభుత్వ SIT విచారణలో మూరేనా అనే ప్రాంతంలో నకిలీ మద్యం సేవించి 24 మంది చనిపోయినప్పుడు, విచారణలో భాగంగా తేలిన విషయం ఆ మరణాలకు కారణం నకిలీ మద్యమని Som Distilleries కు సంబంధించిన 20 స్పిరిట్ మరియు రిసీవర్ ట్యాంకులను ప్రభుత్వం సీల్ చేసిన విషయం మన తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం తెలియకుండానే అనుమతులు ఇచ్చారా? ఈ విషయంపై బీఆర్ఎస్ ప్రశ్నించడాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావు తన లేఖలో ఎందుకు సమాధానం చెప్పలేదు.
- Som Distilleries నకిలీ మద్యం సంస్థ వద్ద కాంగ్రెస్ పార్టీ విరాళాలు తీసుకోవడాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావు ఎందుకు స్పందించలేదు? మూడుసార్లు 25 లక్షల రూపాయలు కాంగ్రెస్ పార్టీ Som Distilleries వద్ద తీసుకున్నది. ఒకసారి ఏకంగా ఒక కోటి 31 లక్షల రూపాయలు కాంగ్రెస్ పార్టీకి Som Distilleries నుంచి అందాయి. ఒక నకిలీ మద్యం సంస్థ అయిన Som Distilleries కు వకాల్త పుచ్చుకొని స్వయాన మంత్రి తన లేఖలో ఆ సంస్థ గొప్పతనాన్ని చెప్పడం విడ్డూరం.
- వారం ముందు ఇలాంటి వ్యాపారాలు తెలంగాణ రాష్ట్రంలో వస్తలేదని చెప్పి వారం తర్వాత బీఆర్ఎస్ బయటపెట్టిన అనంతరం ఆ కంపెనీ గురించి గొప్పలు చెప్పి ఆ Som Distilleries నకిలీ మద్యం కంపెనీకి వ్యాపారం కట్టబెట్టినరంటే కాంగ్రెస్ కు కమీషన్ ముట్టినాయని తెలుస్తుంది.
- దీనిపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలని అప్పటివరకు Som Distilleries అనే నకిలీ మద్యం సంస్థకు తెలంగాణ రాష్ట్రంలో వారి మద్యాన్ని అమ్మే అనుమతులను నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నాం.
- జూపల్లి కృష్ణారావుగారు మంత్రిగా కొనసాగితే ఈ విచారణపై రాజకీయ ఒత్తిడి పెట్టే అవకాశం ఉంది, కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనను క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని కోరుతున్నాం. లేదంటే సంస్థకు కాంగ్రెస్ పార్టీకి ఈ డీల్ కుదరడంలో సీఎం రేవంత్ పాత్ర ఉందని భావించాల్సి ఉంటుంది" అని మన్నె క్రిశాంక్ అన్నారు.
కొత్త మద్యం ఉత్పత్తుల ఎంట్రీపై రాష్ట్ర ఎక్సైజ్ శాఖ నుంచి అధికారికంగా ప్రకటన వెలువడితే మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ విషయంలో ఎక్సైజ్ శాఖ మంత్రి చేసిన ప్రకటన చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే.