Medical Student Suicide : పుట్టినరోజు నాడే విషాదం - ఫిలిప్పీన్స్ లో తెలంగాణ వైద్య విద్యార్థిని సూసైడ్-a medical student from telangana committed suicide in the philippines ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Medical Student Suicide : పుట్టినరోజు నాడే విషాదం - ఫిలిప్పీన్స్ లో తెలంగాణ వైద్య విద్యార్థిని సూసైడ్

Medical Student Suicide : పుట్టినరోజు నాడే విషాదం - ఫిలిప్పీన్స్ లో తెలంగాణ వైద్య విద్యార్థిని సూసైడ్

HT Telugu Desk HT Telugu
Nov 16, 2024 12:28 PM IST

పుట్టిన రోజు నాడే ఎంబీబీఎస్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. సంగారెడ్డి జిల్లాకు చెందిన స్నిగ్ధ ఫిలిప్పీన్స్ లో ఎంబీబీఎస్ చదువుతోంది. బర్త్ డే విషెస్ చెప్పడానికి రూమ్ కి వెళ్లి చూడగా.. స్నిగ్థ ఫ్యాన్ కు ఉరి వేసుకొని కనిపించింది.కుమార్తె మరణవార్త విన్న కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు.

చింతా స్నిగ్ధ (20)
చింతా స్నిగ్ధ (20)

 ఉన్నత చదువుల కోసం ఫిలిప్పీన్స్ దేశానికి వెళ్లిన సంగారెడ్డి జిల్లా ఎంబీబీఎస్ విద్యార్థిని తన పుట్టినరోజు నాడే గదిలో ఫ్యాన్ కు ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. కూతురి మరణ వార్త విన్న తల్లితండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ ఘటనతో పటాన్చెరు మండలం ఇంద్రేశం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది.

ఎంబీబీఎస్ చదవడానికి వెళ్లి….

వివరాల్లోకి వెళ్తే సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం ఇంద్రేశం గ్రామానికి చెందిన చింత అమృత్ రావు మెదక్ పట్టణంలో విద్యుత్ శాఖలో డి.ఈ గా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన కుమార్తె చింతా స్నిగ్ధ (20) ఎంబీబీఎస్ చదవడానికి 22 సెప్టెంబర్ 2021 లో ఫిలిప్పీన్స్ దేశానికి వెళ్ళింది. అక్కడ స్నిగ్ధ ఫిలిప్పీన్స్ పెర్ఫెక్చువల్ హెల్ప్ యూనివర్సిటీ మనీలా లో MBBS ద్వితీయ సంవత్సరం చదువుతుంది. అక్కడే స్నేహితులతో కలిసి ఉంటుంది.

ఈ క్రమంలో శుక్రవారం స్నిగ్ధ పుట్టినరోజు కావడం వలన తన స్నేహితులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపేందుకు ఆమె గదికి వెళ్లారు. డోర్ లాక్ చేసుకున్న స్నిగ్ధ స్నేహితులు ఎంత పిలిచినా డోర్ తీయలేదు. ఫోన్ చేసిన లిఫ్ట్ చేయకపోవడంతో ఆమె స్నేహితులు ఇండియా లోని తల్లితండ్రులకు సమాచారం అందించారు. అనంతరం వారు బలవంతంగా తలుపులు తెరవాలని చెప్పడంతో గట్టిగా తోసారు. ఒక్కసారిగా తలుపులు తెరుచుకునేసరికి లోపల స్నిగ్ధ ఫ్యాన్ కు ఉరి వేసుకొని కనిపించింది. 

వెంటనే ఆమెని కిందికి దించి ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందింది. స్నిగ్ధ మృతదేహాన్ని స్నేహితులు కుటుంబసభ్యులకు వీడియో కాల్ ద్వారా చూపించారు. కూతురిని విగతజీవిగా చూసిన తల్లితండ్రులు భోరున విలపించారు.

తమ కూతురు గురువారం సాయంత్రం తమతో మాట్లాడిందని… పుట్టినరోజు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు సంతోషంగా తెలిపిందని తల్లితండ్రులు చెప్తున్నారు. తాను చాలా ధైర్యవంతురాలని, చనిపోయేంత పిరికి తనలో ఉండదని అంటున్నారు. ఈ పరిస్థితిలో చూడాల్సి వస్తుందని అనుకోలేదని వారు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

పుట్టినరోజు నాడే స్నిగ్ధ మృతి చెందడంతో స్నేహితులు, కుటుంబీకులు విషాదంలో మునిగిపోయారు. ఉన్నత చదువులు చదువుకొని తిరిగి వస్తుందనుకున్న కూతురు అకాల మరణం చెందడంతో ఆ తల్లితండ్రుల విషాదంలో మునిగిపోయారు. మృతదేహాన్ని వెంటనే స్వదేశానికి రప్పించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించాలని తల్లితండ్రులు విజ్ఞప్తి చేశారు.

రిపోర్టింగ్: మెదక్ జిల్లా ప్రతినిధి, HT తెలుగు.

Whats_app_banner