Medical Student Suicide : కరీంనగర్ లో పీజీ వైద్య విద్యార్థిని సూసైడ్..! వేధింపులే కారణమా..?
కరీంనగర్ లో పీజీ మెడికల్ విద్యార్థిని సూసైడ్ చేసుకుంది. హాస్టల్ లో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. తోటి వైద్య విద్యార్థి వేధింపులే విద్యార్థిని ఆత్మహత్యకు కారణమని తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన ప్రతిమ మెడికల్ కాలేజీలో సంచలనంగా మారింది.
కరీంనగర్ లోని ప్రతిమ మెడికల్ కళాశాలలో పీజీ వైద్య విద్యార్థిని ఆర్తీ సాహు ఆత్మహత్య కలకలం సృష్టించింది. మరో వైద్య విద్యార్థి వేదింపుల వల్లే తమ కూతురు ఆత్మహత్య చేసుకుందని ఆర్తీ సాహు తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

హైదరాబాద్ నాంపల్లి అబిడ్స్ ప్రాంతానికి చెందిన రాజేంద్ర సాహు కూతురు ఆర్తీ సాహు ప్రతిమ మెడికల్ కళాశాలలో పీజీ సెకండియర్ పల్మనాలోజి చదువుతోంది. జనవరి 30న హాస్టల్ రూమ్ లో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది. తమ కూతురు ఆత్మహత్యకు తోటి వైద్య విద్యార్థి ఆశిష్ కారణమని ఆర్తీ సాహు తండ్రీ రాజేంద్ర సాహు పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు.
చెంపపై కొట్టిన ఆశిష్ ...!
రెండు మాసాల క్రితం ఆశిష్ చెంపమీద కొట్టాడని తమ కూతురు చెప్పిందని ఆర్తీ సాహు తండ్రీ రాజేంద్ర సాహు ఫిర్యాదులో పేర్కొన్నారు. జనవరి 28న తోటి వైద్య విద్యార్థులు అశీష్ ఇంటికి వెళ్లారని ప్రస్తావించారు. అయితే తన కూతురు వెళ్ళకపోవడంతో తమ ఇంటికి ఎందుకు రాలేదని ఆర్తీ సాహుపై ఆశిష్ ఆగ్రహం వ్యక్తం చేశాడని వివరించారు. ఈ క్రమంలోనే జనవరి 29న ఒంటరిగా ఆశిష్ ఇంటికి సాహు వెళ్ళందని పేర్కొన్నారు.
అశిష్ ఇంటికి వెళ్ళి హాస్టల్ కు తిరిగొచ్చిన ఆర్తీ సాహు మరుసటి రోజు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిందని ఫిర్యాదులో తెలిపారు. ఆశిష్ పై అనుమానాలు ఉన్నాయని… విచారణ జరిపి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
కేసు నమోదు చేసిన పోలీసులు
వైద్యవిద్యార్థిని ఆత్మహత్యపై పేరెంట్స్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కళాశాల యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే వైద్య విద్యార్థి ప్రాణాలు కోల్పోయయిందని విద్యార్థి సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. రెండేళ్ల క్రితం వరంగల్ లోని కాకతీయ మెడికల్ కళాశాలలో తోటీ వైద్య విద్యార్థి వేధింపులకు పిజీ వైద్య విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఆ ఘటన మరిచి పోకముందే కరీంనగర్ లో మరో వైద్య విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతుంది.
రిపోర్టింగ్: కె.వి.రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు.
సంబంధిత కథనం