Medak Crime News : పార్కింగ్ ప్లేస్ లో రెక్కీ, ఆపై చోరీ - 17 బైకులు స్వాధీనం, నిందితుడు అరెస్ట్
పార్కింగ్ ప్లేస్ లో ఉండే బైకులను చోరీ చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఏకంగా అతని వద్ద నుంచి 17 బైకులను స్వాధీనం చేసుకున్నారు. వీటిని కొనుగోలు చేసిన మరో వ్యక్తిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను మెదక్ ఎస్పీ వెల్లడించారు.
జల్సాలకు అలవాటు పడి ద్విచక్ర వాహనాలే లక్ష్యంగా చోరీలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. అతని వద్ద 17 బైక్ లు, 01 స్కూటీని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఈ వాహనాల విలువ రూ. 5 లక్షల 90 వేలు ఉంటుందని ఎస్పీ వెల్లడించారు. ఈ సంఘటన మెదక్ జిల్లా శివ్వంపేట లో చోటుచేసుకుంది.
మెదక్ ఎస్పీ వెల్లడించిన వివరాల తెలిపిన మెదక్ జిల్లా శివంపేట మండలం రూప్లా తాండాకి చెందిన జర్పుల మోహన్ (26) జల్సాలకు అలవాటుపడి ఏడాదిగా ఇళ్ల ముందు, రోడ్ల పక్కన పార్క్ చేసిన బైక్ లను పక్కాగా రెక్కీ నిర్వహించి చోరీ చేస్తాడు. అలా దొంగిలించిన ద్విచక్ర వాహనాలను మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం రెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఎర్ల నరేష్ (27) కు తక్కువ ధరకు విక్రయించి వచ్చిన డబ్బుతో జల్సాలు చేసేవాడు.
శివంపేట ఎస్‌ఐ మహిపాల్ రెడ్డికి వచ్చిన సమాచారం మేరకు నేరస్థులను తమ ఇళ్ల వద్ద అదుపులోకి తీసుకుని విచారించగా వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. విచారణలో భాగంగా నిందితుడు శివ్వంపేట, నార్సింగి, మనోహరాబాద్, కుల్చారం, కూకట్‌పల్లి KPHB, సనత్‌నగర్ ఏరియాల పరిధిలో మొత్తం 18 చోరీలు చేసినట్టు అంగీకరించారు.
నిందితుల వద్ద నుండి 17 బైక్ లు, 01 స్కూటీ .. మొత్తం 18 వాహనాలను రూ. 20,000 నగదును సీజ్ చేసినట్లు తెలిపారు. శివ్వంపేట మండలం బోజ్యా తండాలో నెలకిందట ఒక వివాహ వేడుకలో ఓ వ్యక్తి వద్ద మోహన్ రూ. 20 వేలు చోరీకి పాల్పడినట్లు వారు తెలిపారు. ఈ వాహనాల విలువ రూ. 5 లక్షల 90 వేలు ఉంటుందని వివరించారు. చోరీ చేసిన వాహనం కొనుగోలు చేసినా నేరమే అని ఎస్పీ స్పష్టం చేశారు. దీంతో మోహన్, నరేష్ ను కూడా అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కేసు చేధించిన తూప్రాన్ డిఎస్పీ వెంకటరెడ్డి మరియు సిబ్బందిని ఎస్పీ అభినందించారు.
సిద్దిపేటలో మరో ఘటన :
జల్సాలకు అలవాటు పడి ద్విచక్ర వాహనాల చోరీకి పాల్పడుతున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పెద్ద చీకోడ్ గ్రామానికి చెందిన ఇనుప స్వామి (47) మేస్త్రి పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.
ఈ క్రమంలో మద్యానికి, జల్సాలకు అలవాటు పడిన స్వామి, పని చేయగా వచ్చిన డబ్బులు సరిపోకపోవడంతో బైక్ ల దొంగతనం మొదలుపెట్టాడు. గత 2 నెలల క్రితం సిద్దిపేటలో 2 మోటర్ సైకిల్ లను దొంగతనం చేసిన కేసులలో జైలుకు వెళ్లిన నిందితుడు 50 రోజులు జైలుకు వెళ్లి 11వ తేదీన తిరిగి వచ్చాడు.
అదే రోజు సాయంత్రం సిద్దిపేటలోని ప్రభుత్వ ఆసుపత్రి వద్ద పార్కింగ్ చేసిన ఒక బైక్ దొంగతనం చేసి పెద్ద చీకోడ్ లోని ఇంటి వద్ద దాచిపెట్టాడు. మరల శుక్రవారం సిద్దిపేట లోని సందీప్ హాస్పిటల్ దగ్గర మరో బైక్ ని దొంగిలించాడు. ఆ బైక్ ని సిద్దిపేటలో ఎక్కడైనా అమ్ముదామని వస్తుండగా వాహనాల తనిఖీ చేస్తున్న పోలీసులు పట్టుకొని విచారించారు.
తాను నేరం చేసినట్లు ఒప్పుకున్నాడని పోలీసులు తెలిపారు. నిందితుడి నుంచి రెండు బైకులను స్వాధీనం చేసుకొని అరెస్టు చేసి జ్యుడిషియల్ రిమాండ్ కు తరలించామని సిద్దిపేట వన్ టౌన్ ఇన్స్పెక్టర్ లక్ష్మీ బాబు తెలిపారు.