Narayanpet District : దాయాదుల 'భూతగాదా' - అంతా చూస్తుండగానే తమ్ముడిని అంతమొందించిన వైనం, వీడియో వైరల్‌-a man was beaten to death by a group over a land dispute in narayanpet district ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Narayanpet District : దాయాదుల 'భూతగాదా' - అంతా చూస్తుండగానే తమ్ముడిని అంతమొందించిన వైనం, వీడియో వైరల్‌

Narayanpet District : దాయాదుల 'భూతగాదా' - అంతా చూస్తుండగానే తమ్ముడిని అంతమొందించిన వైనం, వీడియో వైరల్‌

Maheshwaram Mahendra Chary HT Telugu
Jun 15, 2024 10:43 AM IST

Land Dispute Murder in Narayanpet district: నారాయణపేట జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. భూతగాదాలో ఓ యువకుడిపై కర్రలతో విచక్షణరహితంగా దాడి చేసి ప్రాణాలు తీశారు. ఈ ఘటన ఊట్కూరు మండలం చిన్నపొర్లలో జరిగింది. ఈ ఘటనపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి.. డీజీపీకి ఆదేశాలిచ్చారు.

భూతగాదా..! అంతా చూస్తుండగానే కర్రలతో దాడి, యువకుడు మృతి
భూతగాదా..! అంతా చూస్తుండగానే కర్రలతో దాడి, యువకుడు మృతి

Narayanpet District : భూతగదాలో పట్టపగలే ఓ యువకుడిపై కర్రలతో దాడికి దిగారు. కుటుంబం సభ్యులు ఓవైపు బ్రతిమిలాడుతున్న వారు మాత్రం వెనక్కి తగ్గలేదు. ప్రాణాలు తీయటమే లక్ష్యంగా… విచక్షణరహితంగా దాడికి దిగారు. దీంతో సదరు యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.

ఈ దారుణ ఘటన నారాయణపేట జిల్లా ఊట్కూరు మండలం చిన్నపొర్లలో జరిగింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందిస్తూ… డీజీపీకీ ఆదేశాలిచ్చారు. సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఏం జరిగిందంటే…?

నారాయణపేట జిల్లా ఊట్కూరు మండలం చిన్నపొర్లలో ఈ గొడవ జరిగింది. ఇందుకు ప్రధాన కారణం భూతగదా..! ప్రాథమిక వివరాల ప్రకారం…. చిన్నపొర్ల గ్రామానికి చెందిన చెందిన ఎర్రగండ్ల లక్ష్మప్పకు ఇద్దరు భార్యలు. మొదటి భార్యకు ఎర్రగండ్ల సంజప్ప అనే కుమారుడు ఉన్నాడు. ఇక రెండో భార్య తిమ్మమ్మకు పెద్ద సౌరప్ప, చిన్న సౌరప్ప అనే కుమారులు ఉన్నారు.

వీరికి మొత్తం తొమ్మిది ఎకరాల భూమి ఉండగా… ముగ్గురు కుమారులకు సమానంగా పంచారు. వాటాల పంపకంలో తమకు అన్యాయం జరిగిందని… పెద్ద భార్య కుమారుడు సంజప్ప న్యాయపోరాటం చేస్తున్నాడు. న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించాడు.

భూ వివాదం కోర్టుకు చేరినప్పటికీ సాగు చేసేందుకు ప్రయత్నాలు చేస్తుండటంతో గత కొంత కాలంగా వీరి మధ్య విభేదాలు నడుస్తున్నాయి. కాగా పెద్ద సవారప్ప, ఆయన కుమారుడు సంజీవ్(28) తో పాటు చిన్న సవారప్ప, ఆయన భార్య కవిత గురువారం పొలం దున్నేందుకు వెళ్లారు.

ఈ విషయం తెలుసుకున్న మొదటి భార్య కుమారుడు సంజప్ప కొడుకులు గుట్టప్ప, ఆటో సంజీవ్ లం వద్దకు వెళ్లారు. వాళ్ల వెంట ఆశప్ప, చిన్న వెంకటప్ప, శీను, కిష్టప్ప, నట్టలప్పను తీసుకెళ్లారు. ఇరు వర్గాల మధ్య మాటా మాట పెరిగింది. ఈ క్రమంలోనే పెద్ద సవారప్ప కుమారుడు సంజీవ్(28)పై దాయాదులు కర్రలు, రాళ్లతో దాడికి దిగారు. ఓ వైపు కుటుంబ సభ్యులు అడ్డుకున్నప్పటికీ వెనక్క తగ్గలేదు.

తీవ్రంగా గాయపడిన సంజీవ్ ను మొదట నారాయణపేటకు తరలించారు. ఆ తర్వాత మహబూబ్‌నగర్‌ ఆసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందారు. ఈ మర్డర్ నేపథ్యంలో పోలీసులు గ్రామంలో పికెట్‌ ఏర్పాటు చేశారు. దాడి చేసిన వారిలో పలువురిని గుర్తించిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

గొడవకు సంబంధించి పోలీసులకు సమాచారం అందించినప్పటికీ సకాలంలో రాలేదని బాధితుడి కుటుంబ సభ్యుల ఆరోపిస్తున్నారు. సకాలంలో చేరుకుంటే… ప్రాణం పోయేది కాదని అంటున్నారు.

ఎస్సైపై సస్పెన్షన్‌ వేటు…

ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ ఘటనకు సంబంధించి స్థానిక పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తేలితే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సీఎం ఆదేశాలతో స్పందించిన జిల్లా పోలీసు అధికారులు చర్యలు చేపట్టారు. ఊట్కూరు ఎస్సై శ్రీనివాస్‌ను సస్పెండ్ చేశారు. ఈ ఘటనపై అన్ని కోణాల్లో విచారణ జరిపిస్తున్నారు. మరోవైపు దాడి దృశ్యాలు వైరల్ కావటంతో రాష్ట్రవ్యాప్తంగా ఈ కేసు సంచలనంగా మారింది.

.

Whats_app_banner