Hyderabad Crime : మరికొన్ని గంటల్లో ఆ ఇంట్లో పెళ్లి.. బీరువా తెరిచి చూడగా షాక్.. సీన్ కట్ చేస్తే!
Hyderabad Crime : ఆ ఇంట్లో పెళ్లి సందడి నెలకొంది. మరికొన్ని గంటల్లో పెళ్లి జరగనుంది. మగవారు పెళ్లి పనుల్లో బిజీగా ఉండగా.. ఆడవాళ్లు కొత్త బట్టలు, బంగారు ఆభరణాలను చూస్తు మురిసిపోయారు. అంతలోనే ఊహించని ఘటన జరిగింది. పెళ్లి ఇంట విషాదం నెలకొంది.
రెండు రోజుల్లో ఆ ఇంట్లో పెళ్లి జరగనుంది. అంతలోనే భారీ దొంగతనం జరిగింది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఈ చోరీలో మొత్తం 133 తులాల బంగారు ఆభరణాలు, 80 తులాల వెండి, రూ.2.50 లక్షల డబ్బు మాయమైంది. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. నవంబర్ 20న శంకర్ పల్లి మున్సిపల్ కౌన్సిలర్ పార్శి బాలకృష్ణ కూతురు వివాహం జరగాల్సి ఉంది. దీంతో ఆ కుటుంబం పెళ్లి కోసం బంగారు ఆభరణాలు కొనుగోలు చేశారు. బంగారం అంతా ఇంట్లోని బీరువాలో భద్రంగా పెట్టారు.
ఆదివారం మెహందీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మహిళలు ఆభరణాలను పెట్టుకునేందుకు బీరువా తెరిచారు. ఒక్కసారిగా షాక్ అయ్యారు. బీరువాలో బంగారు, వెండి ఆభరణాలు లేవు, వెంటనే శంకర్ పల్లి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు బాలకృష్ణ ఇంటికి వెళ్లి పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇది తెలిసినవారి పనే అయ్యుంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
వరంగల్‌లో..
ఎస్బీఐ బ్యాంకులో రూ.10 కోట్ల విలువ చేసే బంగారం దోపిడీకి గురైంది. వరంగల్ జిల్లా రాయపర్తి ఎస్బీఐ బ్యాంకు లాకర్లో భద్రపరిచిన బంగారాన్ని దుండగులు ఎత్తుకెళ్లారు. గ్యాస్ కట్టర్‌తో కిటికీని కట్ చేసి.. బ్యాంక్ లోపలికి ప్రవేశించారు. దాదాపు రూ.10 కోట్ల విలువచేసే బంగారం చోరీ చేశారు. బ్యాంకు అధికారులు ఫిర్యాదు చేయడంతో.. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇటీవల సంగారెడ్డి జిల్లాలోనూ వరుస దొంగతనాలు జరిగాయి. తాళం వేసిన ఇళ్లే టార్గెట్‌గా దొంగలు రెచ్చిపోయారు. గుమ్మడిదల గ్రామానికి చెందిన చిమ్ముల రవీందర్ రెడ్డి, భార్య రజిత బంధువుల ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం ఉండడంతో ఇంటికి తాళం వేసి వెళ్లారు. వ్రతం ముగించుకొని ఇంటికి తిరిగి వచ్చేసరికి ఇంటి తాళం పగలగొట్టి ఉంది. ఇంట్లోని వస్తువులు చిందరవందరగా పడి ఉన్నాయి. ఆ దంపతులు ఇంట్లోకి వెళ్లి బీరువా తీసి చూడగా 31 తులాల బంగారం, 10 తులాల వెండి, నాలుగు వేల నగదు లేవు. చోరీకి గురైనట్లు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి కుటుంబంతో సినిమా చూడటానికి వెళ్లి తిరిగి ఇంటికి వచ్చే సరికి దొంగలు ఇల్లు గుళ్ల చేశారు. ఈ ఘటన పటాన్‌చెరు మండలం బీడీఎల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బీడీఎల్- భానూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లైఫ్ స్టైల్ డ్రీమ్ హోమ్స్ కాలనీలో నివాసముంటున్న నందారపు శరత్, సుప్రియ దంపతులు మాదాపూర్‌లోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తున్నారు. శనివారం వీకెండ్ కావడంతో కుటుంబంతో కలిసి సినిమాకు వెళ్లారు.
ఇంటికి తిరిగి వచ్చేసరికి ఇంటి తలుపులు తెరిచి ఉండడంతో షాక్‌కు గురయ్యారు. ఇంట్లోకి వెళ్లి చూసేసరికి ఇల్లంతా చిందరవందరగా ఉంది. బీరువాను తెరిచి చూడగా అందులో 25 తులాల బంగారం, 10 తులాల వెండి, ఐదు వేల నగదు, 3 ఖరీదైన గడియారాలు కనిపించలేదు. ఇంట్లో దొంగలు పడ్డారని గుర్తించి, పోలీసులకు సమాచారం అందించారు. వరుస దొంగతనాలు జరగడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.