Sangareddy District : విధుల్లో చేరి ఏడు నెలలే...! కరెంట్ షాక్ తో జూనియర్ లైన్​మెన్​ మృతి-a junior lineman died of electric shock within seven months of joining duty in sangareddy district ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Sangareddy District : విధుల్లో చేరి ఏడు నెలలే...! కరెంట్ షాక్ తో జూనియర్ లైన్​మెన్​ మృతి

Sangareddy District : విధుల్లో చేరి ఏడు నెలలే...! కరెంట్ షాక్ తో జూనియర్ లైన్​మెన్​ మృతి

HT Telugu Desk HT Telugu
May 25, 2024 06:36 AM IST

Junior Lineman Dead in Sangareddy District : సంగారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కరెంట్ షాక్ తో జూనియర్ లైన్ మెన్ ప్రాణాలు కోల్పోయాడు.

జూనియర్ లైన్ మెన్ మృతి
జూనియర్ లైన్ మెన్ మృతి

Sangareddy District News : సంగారెడ్డి జిల్లాలో విషాద సంఘటన చోటుచేసుకుంది. జూనియర్ లైన్ మెన్ గా విధుల్లో చేరిన ఏడు నెలల్లోనే విద్యుత్ రూపంలో మృతువు కబళించింది. 

విద్యుత్ స్తంభంపై వైర్లు సరిచేస్తుండగా కరెంట్ షాక్ కు గురై స్తంభంపైనే జూనియర్ లైన్ మెన్ మృతి చెందాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండల పరిధిలోని మల్లికార్జునపల్లి గ్రామంలో జరిగింది. 

వివరాల్లోకి వెళ్తే…. సంగారెడ్డి పట్టణానికి చెందిన బాల్ రాజు (25) గత అక్టోబర్ లో మునిపల్లి మండలం మల్లికార్జునపల్లి జూనియర్ లైన్ మెన్ గా నియమితుడయ్యాడు. అప్పట్నుంచి విధులు నిర్వర్తిస్తున్నాడు.  

శుక్రవారం ఉదయం మల్లికార్జునపల్లి గ్రామంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. ఈ క్రమంలో బాల్ రాజు విద్యుత్ తీగలు సరిచేసేందుకు స్థంభంపైకి ఎక్కాడు. స్తంభంపై విద్యుత్ తీగలు సరిచేస్తుండగా ఆకస్మికంగా విద్యుత్ సరఫరా కావడంతో షాక్ కు గురయ్యాడు. దీంతో విద్యుత్ తీగలకు చిక్కుకొని స్థంభం పైనే ప్రాణాలు వదిలాడు. 

అతని మరణంతో కుటుంబసభ్యులు విషాదంలో మునిగిపోయారు. బాల్ రాజు కు తల్లితండ్రులతో పాటు ఒక చెల్లి ఉంది. కాగా తండ్రి సంగారెడ్డి మున్సిపాలిటీలో శానిటేషన్ వర్కర్ గా పని చేస్తున్నాడు. విషయం తెలుసుకున్న విద్యుత్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.

చెరువులో మునిగి యువకుడు మృతి ......

స్నేహితులతో కలిసి చెరువులో స్నానానికి వెళ్లిన యువకుడు ఈత రాకపోవడంతో మునిగి మృతి చెందాడు. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం వావిలాల గ్రామంలో చోటుచేసుకుంది. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. బాలాగర్ లో నివసిస్తున్న శివకుమార్ (21) డిగ్రీ చదువుతున్నాడు. కాగా ఈ నెల 20 న ఏడుపాయలలో స్నేహితుడి అన్న కూతురు వివాహం ఉండడంతో స్నేహితులతో కలిసి శివకుమార్ ఏడుపాయలకు వచ్చాడు. వివాహం ముగిసిన అనంతరం మరుసటి రోజు వావిలాలలోని చెరువులో స్నానం చేయడానికి శివకుమార్ తో కలిసి ఐదుగురు స్నేహితులు వెళ్లారు. 

ఈ క్రమంలో అందరూ కలిసి చెరువులో స్నానం చేస్తుండగా శివకుమార్ లోతుగా ఉన్న ప్రాంతానికి వెళ్లి గుంతలో పడిపోయాడు. అతనిని కాపాడేందుకు స్నేహితులు ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే నీటి లోపలికి మునిగిపోయాడు. వెంటనే అతని తల్లితండ్రులకు,పోలీసులకు సమాచారం అందించారు. 

మరుసటి రోజు శివకుమార్ మృతదేహం నీటిపై తేలుతూ కనిపించింది. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి తండ్రి పిర్యాదుతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

రిపోర్టింగ్ - ఉమ్మడి మెదక్ జిల్లా ప్రతినిధి,HT తెలుగు.

టీ20 వరల్డ్ కప్ 2024