Jagtial District : మెకానిక్ షెడ్​లో మంటలు - 20 బైకులు దగ్ధం..!-a fire broke out in the mechanic shed and 20 bikes got burnt in jagtial district ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Jagtial District : మెకానిక్ షెడ్​లో మంటలు - 20 బైకులు దగ్ధం..!

Jagtial District : మెకానిక్ షెడ్​లో మంటలు - 20 బైకులు దగ్ధం..!

HT Telugu Desk HT Telugu
Jun 01, 2024 01:19 PM IST

Jagtial District News: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. అయితే ఎండ వేడిమి దాటికి జగిత్యాలలోని ఓ బైక్ షెడ్డులో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 20 బైకులు కాలిపోయాయి.

20 బైక్ లు దగ్ధం
20 బైక్ లు దగ్ధం

Jagtial District News: వేసమి ఎండలు మండిపోతున్నాయి. బానుడి ప్రతాపానికి జనం విలవిలలాడుతున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నిప్పుల కొలిమిలా మారింది. రోహిణి కార్తిలో ఎండవేడికి రోళ్ళు పలుగుతాయని అంటారు. రోళ్ళు పలుగుడు దేవుడెరుగు, మంటల చెలరేగుతున్నాయి. 

మండే ఎండలతో జగిత్యాలలో మెకానిక్ షెడ్ లో అగ్నిప్రమాదం సంభవించింది. బైపాస్ రోడ్ లోని అన్వేష్ మెకానిక్ షెడ్ లో మంటలు చెలరేగడంతో 20 బైక్ లు దగ్దమయ్యాయి. మంటలు ఇంట్లోకి వ్యాపించడంతో ఇంట్లో సామాగ్రి సైతం దగ్దమయ్యింది. మంటలను పైర్ సిబ్బంది అదుపులోకి తెచ్చినప్పటికి అప్పటికే సుమారు పదిలక్షల ఆస్తి నష్టం సంభవించింది. ఎండ వేడికే మంటలు చెలరేగినట్లు స్థానికులు చెబుతున్నారు. అయితే షాట్ సర్క్యూట్ జరిగి ప్రమాదం జరిగిందా అనేది తేలాల్సి ఉంది…!

రికార్డు స్థాయిలో 47.1 డిగ్రీల ఉష్ణోగ్రత

మండే ఎండలతో రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. రికార్డు స్థాయిలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పలు ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. రాష్ట్రంలోనే అత్యధికంగా పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ 47.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. జగిత్యాల, కరీంనగర్, సిరిసిల్లలో 43 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. పలు ప్రాంతాల్లో సాధారణం కన్నా ఐదారు డిగ్రీలు ఎక్కువగా ఉండటంతో వడగాలులు వీచాయి. తీవ్రమైన వేడి, ఉక్కపోతలతో ప్రజలు ఇబ్బందులుపడ్డారు.

వడదెబ్బతో నలుగురి మృతి

ఎండలు మండిపోతుండటంతో జనం విలవిల్లాడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో వడదెబ్బకు నలుగురు మృత్యువాతపడ్డారు. . రామగుండం మండలం మేడిపల్లికి చెందిన ఈదునూరి కిషోర్ (36) వడదెబ్బతో మృతి చెందాడు. హనుమాన్ మాల దరించిన కిషోర్ కాలినడకన కొండగట్టుకు బయలుదేరాడు. ధర్మారం మండలం రాజారాంపల్లి వద్దకు చేరుకునే సరికి వడదెబ్బతో సొమ్మసిల్లి పడిపోగా వెంటనే స్నేహితులు గోదావరిఖని ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గమద్యలోనే ప్రాణాలు కోల్పోయారు. 

ధర్మారం మండలం బొట్లవనపర్తికి చెందిన ధనిశెట్టి అమృతవ్వ(65) ఎండ తీవ్రతకు అస్వస్థతకు గురై మృతి చెందారు. చొప్పదండిలో లారీ డ్రైవర్ జాకీర్ హుస్సేన్(60) సిమెంట్ లారీ నిలిపి హోటల్లో నీళ్లు తాగేందుకు వెళ్లి కుప్పకూలి ప్రాణాలు కోల్పోయారు. 

మద్యప్రదేశ్ కు చెందిన హస్సెన్ బసంత్ నగర్ సిమెంట్ ప్యాక్టరీలో డ్రైవర్ గా పనిచేస్తునారు. వీణవంక మండల కేంద్రానికి చెందిన కల్యాణం రామక్క (72) వడదెబ్బతో అస్వస్థతకు గురై మృతి చెందారు. ఎండ తీవ్రతతో చాలా మంది అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలయ్యారు. మండే ఎండలతో జనం భయాందోళన చెందుతున్నారు. వర్షం పడితే కానీ ఉపశమనం లేదని ఆవేధన వ్యక్తం చేస్తున్నారు.

రిపోర్టింగ్ - HT తెలుగు ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ కె.వి.రెడ్డి.

టీ20 వరల్డ్ కప్ 2024