TG Rythu Bharosa : జనవరి 3న క్యాబినెట్‌ భేటీ.. రైతు భరోసాపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం!-a final decision on rythu bharosa is likely to be taken in the cabinet meeting held on january 3rd ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tg Rythu Bharosa : జనవరి 3న క్యాబినెట్‌ భేటీ.. రైతు భరోసాపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం!

TG Rythu Bharosa : జనవరి 3న క్యాబినెట్‌ భేటీ.. రైతు భరోసాపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం!

Basani Shiva Kumar HT Telugu
Dec 31, 2024 09:59 AM IST

TG Rythu Bharosa : రైతు భరోసా కోసం అన్నదాతలు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో కీలక అప్‌డేట్ వచ్చింది. జనవరి 3న రైతు భరోసా అమలుపై ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఇంకా వ్యవసాయ కూలీలకు ఆర్థిక సాయంపై కూడా క్యాబినెట్‌లో చర్చించి, తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

రైతు భరోసా
రైతు భరోసా

రైతు భరోసా అమలుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే ఈ పథకం అమలు, విధివిధానాల రూపకల్పన కోసం ప్రభుత్వం సబ్ కమిటీని నియమించింది. ఆ కమిటీ పలుమార్లు భేటీ అయ్యి చర్చించింది. సలహాలు, సూచనలు స్వీకరించింది. కానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. దీనిపై జనవరి 3న జరగబోయే క్యాబినెట్‌ భేటీలో చర్చించే అవకాశం ఉంది. వీలైతే అదేరోజు పథకం అమలుపై ప్రకటన చేసే ఛాన్స్ ఉంది.

yearly horoscope entry point

రేవంత్ ఆదేశం..

ఇదే కాకుండా.. వ్యవసాయ కూలీలకు నగదు చెల్లింపు, కొన్ని పురపాలక సంఘాల్లో గ్రామాల విలీనం, వివిధ శాఖల్లో ఉన్న పెండింగ్‌ అంశాలను మంత్రివర్గం ముందుకు తేవాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అధికారులకు సూచించినట్లు సమాచారం. రైతు భరోసా పథకం మార్గదర్శకాలపై ఇప్పటికే క్యాబినెట్ సబ్ కమిటీ చర్చించింది. సంక్రాంతి తర్వాత రైతు భరోసా ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది.

సాగు చేసేవారికే..

గతంలో మాదిరిగా కాకుండా.. పంట సాగు చేసిన రైతులందరికీ రైతు భరోసా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. పంట సాగయ్యాక అధికారులు ధ్రువీకరించి చెల్లించే అవకాశముంది. ఏడాదిలో 8 నెలల నుంచి ఏడాది కాలంపాటు ఒకే పంట సాగు చేసే వారికి రెండుసార్లు భరోసా ఇవ్వాల్సిన అవసరం లేదనే అభిప్రాయానికి క్యాబినెట్ సబ్ కమిటీ వచ్చినా.. దీనిపై మంత్రివర్గ భేటీలో తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది.

వారికి ఇవ్వాలా.. వద్దా..

ఇన్‌కమ్ ట్యాక్స్ చెల్లిస్తున్న వారి భూముల్లో పంటలు సాగు చేస్తున్న వారికి రైతు భరోసా ఇవ్వాలా.. వద్దా అనే చర్చ కూడా జరిగింది. ఆదాయపన్ను చెల్లించే వారిని మినహాయిస్తే రూ.350 కోట్ల వరకు భారం తగ్గుతుందని సబ్ కమిటీ అంచనా వేసింది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఎకరాకు ఒక సీజన్‌లో రూ.5 వేల చొప్పున రైతుబంధు ఇచ్చారు. అయితే.. తాము రూ.7,500 చొప్పున ఇస్తామని కాంగ్రెస్‌ హామీ ఇచ్చింది.

ఎకరాకు రూ.6 వేలు..

ఇప్పుడే రూ.7500 కాకుండా ఎకరాకు రూ.6 వేలు ఇచ్చి.. దీన్ని క్రమంగా రూ.7500కు పెంచాలనే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. అయితే.. రాష్ట్రంలో మొత్తంగా దాదాపు 80 లక్షల ఎకరాలకు రైతుభరోసా చెల్లించాల్సి వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. రూ.6 చొప్పున చెల్లించినా.. రూ.4,800 కోట్ల వరకు అవసరం అవుతుందని అధికారులు చెబుతున్నారు. క్యాబినెట్ భేటీ తర్వాతనే దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Whats_app_banner