Medak Crime News : దారుణం.. బెట్టింగ్ ఆడుతున్నాడని కుమారుడిని రాడుతో కొట్టి చంపిన తండ్రి
Son Killed By Father in Medak : బెట్టింగ్ కు బానిసగా మారిన సొంత కుమారుడిని ఓ తండ్రి హత్య చేశాడు. ఈ దారుణ ఘటన మెదక్ జిల్లాలో వెలుగు చూసింది.
Son Killed By Father in Medak : మెదక్ జిల్లా దారుణ హత్య చోటు చేసుకుంది. సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో ఆన్ లైన్ బెట్టింగ్ లకు అలవాటు పడి ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారు. బెట్టింగ్ మోజులో పడి డబ్బు సంపాదించే వారికంటే అప్పుల పాలయ్యేవారే ఎక్కువగా కనపడుతున్నారు.
ఇలాంటి సంఘటనే మెదక్ లో జరిగింది. బెట్టింగ్ లకు అలవాటు పడి రూ. 2 కోట్లకు పైగా పోగొట్టాడు. బెట్టింగ్ మానుకోవాలని తండ్రి ఎంతచెప్పినా వినలేదు. దీంతో విసుగెత్తిపోయిన తండ్రి.. నిద్రిస్తున్న కుమారుడిని రాడ్డుతో తలపై కొట్టి హత్య చేశాడు. ఈ విషాద సంఘటన మెదక్ జిల్లాలోని చిన్నశంకరంపేట మండలం బగిరత్ పల్లిలో శనివారం రాత్రి చోటుచేసుకుంది.
రూ. 2 కోట్లకు పైగా పోగొట్టుకొని .....
వివరాల్లోకి వెళ్తే…. బగిరత్ పల్లి గ్రామానికి చెందిన సత్యనారాయణ కుమారుడు ముకేశ్ కుమార్ (27) రైల్వే ఉద్యోగిగా విధులు నిర్వర్తిస్తున్నాడు. అతడికి భార్య,ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా ముకేశ్ ఆన్లైన్ లో బెట్టింగ్,జల్సాలకు అలవాటుపడ్డారు.
దీంతో ముకేశ్ డబ్బు మొత్తం బెట్టింగ్ లో పెట్టేవాడు. అది గమనించిన తండ్రి సత్యనారాయణ బెట్టింగ్ మాయలో పడి ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయని,బెట్టింగ్ మానుకోవాలని కొడుకుని పలుమార్లు హెచ్చరించాడు. అయినా అతనిలో మార్పు రాలేదు. కాగా ముకేశ్ బెట్టింగ్ లో ఇప్పటివరకు రూ. 2 కోట్లకు పైగా పోగొట్టాడు.
ఈ క్రమంలో శనివారం తండ్రీకొడుకుల మధ్య ఇదే విషయంలో వాగ్వాదం జరిగింది. దీంతో విసుగెత్తిన తండ్రి శనివారం రాత్రి కుమారుడు నిద్రిస్తున్న క్రమంలో ఇనుపరాడ్డుతో తలపై బలంగా కొట్టడంతో తీవ్ర రక్తస్రావం కాగా ముకేశ్ అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా బెట్టింగ్ కోసం మేడ్చెల్ లో వారికున్న ఇల్లు,ఫ్లాట్ లను పెట్టి అమ్మేశాడని కుటుంబసభ్యులు తెలిపారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
వడదెబ్బ తగిలి మహిళ మృతి.....
ఉపాధి హామీ కూలీ పనులకు వెళ్తున్న మహిళ వడదెబ్బ తగిలి మృతి చెందిన సంఘటన సిద్దిపేట జిల్లాలో శనివారం చోటు చేసుకుంది. సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం ఇప్పలగూడెనికి చెందిన కతేరపాక లక్ష్మి(45) ప్రతిరోజు ఉపాధి హామీ పనులకు వెళ్తుంది.
కాగా శనివారం ఉపాధి పనులకు వెళ్లిన లక్ష్మి ఎండా తాకిడికి అస్వస్థతకు లోనైంది. దీంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఇంటికి వచ్చాక మద్యాహ్నం ఇంట్లో మృతి చెందింది. ఆమెకు ఒక కూతురు,కుమారుడు ఉన్నాడు.