మూడోసారి ఆత్మహత్యాయత్నం చేసిన రైతు.. తన భూమిని ఇతరుల పేరున పట్టా చేశారని ఆవేదన-a farmer who tried to commit suicide for the third time for his land ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  మూడోసారి ఆత్మహత్యాయత్నం చేసిన రైతు.. తన భూమిని ఇతరుల పేరున పట్టా చేశారని ఆవేదన

మూడోసారి ఆత్మహత్యాయత్నం చేసిన రైతు.. తన భూమిని ఇతరుల పేరున పట్టా చేశారని ఆవేదన

HT Telugu Desk HT Telugu
Jun 25, 2024 06:19 AM IST

తమ భూమిని కొంతమంది అక్రమంగా పట్టా చేసుకున్నారని, రెవెన్యూ అధికారులు అంతా తెలిసీ తమకు అన్యాయం చేశారని ఆవేదనతో ఓ రైతు ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నం చేశాడు.

ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన రైతును కాపాడిన పోలీసులు
ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన రైతును కాపాడిన పోలీసులు

సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా కలెక్టర్‌కు వినతి పత్రం సమర్పించేందుకు వచ్చి, ఎన్నిసార్లు విన్నవించుకున్నా తన భూమిని తనకు అప్పగించేందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తూ రైతు ఏకంగా కలెక్టరేట్ లో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

పురుగుల మందు తాగి కలెక్టరేట్ బిల్డింగ్ పై బ్యానర్ కట్టి ఆత్మహత్యకు ప్రయత్నం చేయగా, అక్కడే ఉన్న పోలీసులు అడ్డుకుని రైతును హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. దీంతో అక్కడున్న ఆఫీసర్లంతా కంగు తిన్నారు. ఈ ఘటన సోమవారం ప్రజావాణి సందర్భంగా జనగామ కలెక్టరేట్ లో చోటు చేసుకుంది.

బాధిత కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన ప్రకారం పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. జనగామ జిల్లా జనగామ మండలం పసరమడ్ల గ్రామానికి చెందిన నిమ్మల నర్సింగారావు(s/o కొమురయ్య), నిమ్మల లక్ష్మయ్య(s/o సంగయ్య) వరుసకు అన్నదమ్ములు. నర్సింగారావు బతుకు దెరువు నిమిత్తం ములుగు జిల్లాకు వెళ్లిపోగా, లక్ష్మయ్య లింగాల ఘనపురానికి ఇల్లరికం వెళ్లాడు. ఇదిలాఉంటే నర్సింగారావు, లక్ష్మయ్య కు వారి స్వగ్రామం పసరమడ్లలో వంశపారంపర్యంగా వస్తున్న కొంత భూమి ఉంది. అందులో నర్సింగరావు పేరున 7 ఎకరాల 29 గుంటలు, లక్ష్మయ్యకు 7 ఎకరాల 20 గుంటల భూమి ఉంది.

పట్టా చేయించుకున్న పాలోళ్లు

నర్సింగరావు ములుగు జిల్లాలో ఉంటుండటం, లక్ష్మయ్య ఇల్లరికం వెళ్లిపోవడంతో వారిద్దరి పేరున ఉన్న భూమిపై వారి బంధువులు కన్నేశారు. ఇద్దరిపై ఉన్న 15 ఎకరాలకు పైగా భూమిని వారి పాలివాళ్లు అయిన యాదగిరి, నర్సయ్య, ఎల్లయ్య, పాండు పట్టా చేయించుకోవాలనుకున్నారు. ఈ మేరకు వారు చనిపోయారని నమ్మించి, అప్పటి రెవెన్యూ అధికారులను మేనేజ్ చేసుకుని 2009లో కొంతభూమిని, ఆ తరువాత 2016–17 మధ్యలో మిగిలిన భూమిని తలాకొంత పట్టా చేయించుకున్నారు. ఆ తరువాత కొద్ది రోజులకు విషయం తెలుసుకున్న నర్సింగరావు ఇదేంటని వారిని ప్రశ్నించారు. దీంతో అప్పట్లో వారిరువురి మధ్య గొడవలు జరిగాయి. ఆ తరువాత నర్సింగారావు విషయాన్ని పలుమార్లు తహసీల్దార్, కలెక్టర్ దృష్టికి కూడా తీసుకెళ్లాడు.

ఇప్పటికే రెండుసార్లు

జిల్లా కలెక్టర్ తో పాటు రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా తన సమస్యను ఎవరూ పట్టించుకోవడం లేదనే ఆవేదనతో నర్సింగరావు ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. అధికారులు చేసిన తప్పిదానికి వారి ముందే తనువు చాలించాలనుకున్నాడు.

ఈ మేరకు 2021 డిసెంబర్ 20న జనగామ పాత కలెక్టరేట్ ఎదుట ఒంటిపై డీజిల్ పోసుకొని ఆత్మహత్యకు ప్రయత్నం చేశాడు. ఆ సమయంలో అక్కడున్న పోలీసులు, జనాలు అడ్డుకుని రక్షించారు. అప్పటికప్పుడు సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన అధికారులు లైట్ తీసుకోవడంతో 2022 సెప్టెంబర్ 19న జనగామ కొత్త కలెక్టరేట్ ఎదుట ఒంటిపై మరోసారి డీజిల్ పోసుకొని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. అప్పుడు కూడా అక్కడున్న వాళ్లంతా అడ్డుకున్నారు.

కలెక్టరేట్ ఎక్కి మరోసారి

గతంలో పలుమార్లు తహసీల్దార్, కలెక్టర్ దృష్టికి తీసుకుని వెళ్లినా తన సమస్యను ఎవరూ పట్టించుకోలేదన్న ఆవేదనతో నర్సింగారావు సోమవారం ఉదయం మళ్లీ జనగామ కలెక్టరేట్ కు వచ్చాడు. అక్కడ గ్రీవెన్స్ సెల్ లో దరఖాస్తు ఇచ్చేందుకు వచ్చినా.. భూ సమస్య నేపథ్యంలో అక్కడి అధికారులు దరఖాస్తు తీసుకోలేదు.

దీంతో కలెక్టరేట్ బిల్డింగ్ కు తన సమస్యను రాసిన బ్యానర్ ను కట్టి, పురుగుల మందు తాగాడు. ఒక్కసారిగా అక్కడ గందరగోళం చెలరేగగా, అక్కడున్న పోలీసులు వెంటనే పైకి ఎక్కి నర్సింగరావును కిందికి దించి జనగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా తన భూమిని తనకు ఇవ్వకుండా తననే చంపే ప్రయత్నం చేస్తున్నారంటూ నర్సింగరావు ఆవేదన వ్యక్తం చేశాడు.

మంత్రి సీతక్క కలగజేసుకుని న్యాయం చేయాలని, తన కుటుంబానికి మేలు జరిగేలా చూడండి అంటూ విజ్ఞప్తి చేశాడు. నర్సింగరావు ఆత్మహత్యాయత్నంతో జనగామ కలెక్టరేట్ లో గందరగోళం నెలకొనగా, సమస్యను పరిష్కరించేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.

(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)

WhatsApp channel