TG Family Survey: సర్కారుకు సవాలుగా మారిన సమగ్ర సర్వే, ఎన్యూమరేటర్లకు తప్పని ఇక్కట్లు
TG Family Survey: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణన ఇంటింటా కుటుంబ సమగ్ర సర్వే సర్కార్ కు సవాల్ గా మారింది. అభ్యంతరకరమైన ప్రశ్నలతో సమాచారం ఇచ్చేందుకు కొందరు ముందుకు రావడం లేదు. సమాచార సేకరించేందుకు వెళ్లిన వారికి జనం ప్రశ్నల వర్షం కురిపించడంతో ఎన్యూమరేటర్ లు ఇక్కట్ల పాలవుతున్నారు.
TG Family Survey: తెలంగాాణ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేలో వివరాలు వెల్లడించడానికి ప్రజలు నిరాకరిస్తుండటంతో ఎన్యూమరేటర్లు ఇక్కట్ల పాలవుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణన ఇంటింటా కుటుంబ సమగ్ర సర్వే సర్కార్ కు సవాల్ గా మారింది. అభ్యంతరకరమైన ప్రశ్నలతో సమాచారం ఇచ్చేందుకు కొందరు ముందుకు రావడం లేదు.
సమాచారం సేకరించేందుకు వెళ్లిన వారికి జనం ప్రశ్నల వర్షం కురిపించడంతో ఎన్యూమరేటర్ లు ఇక్కట్ల పాలవుతున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఏకంగా ఓ గ్రామస్థులు సమగ్ర సర్వేను బహిష్కరించారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సమగ్ర కుటుంబ సర్వే కు ఆటంకాలు ఎదురు అవుతున్నాయి. ఈనెల 6 నుంచి ప్రారంభమైన సర్వేలో మొదటి మూడు రోజులు ఇంటింటా సమగ్ర సర్వేకు సంబంధించి ఎన్ని కుటుంబాలు ఉన్నాయో అన్ని స్టిక్కర్లు అంటించే ప్రక్రియ కొనసాగింది. శనివారం నుంచి కుటుంబాల వివరాలు సేకరించే సమగ్ర సర్వే నిర్వహిస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చాలా చోట్ల ఆదివారం నుంచి సమగ్ర సర్వే మొదలయింది. సరిపడా స్టిక్కర్లు, ఫామ్స్ రాక నత్తనడకన సర్వే సాగుతుంది.
రాజకీయం ఎందుకు...?
సర్వేలో 75 ప్రశ్నావళిలో కొన్ని అంశాలకు సమాధానం చెప్పేందుకు జనం కొందరు ముందుకు రావడం లేదు. తమ ఆస్తులు, అప్పులు మీకెందుకని ప్రశ్నిస్తున్నారు. తమ రాజకీయ నేపథ్యం ప్రభుత్వానికి ఎందుకు? అంటున్నారు. ఎదురు ప్రశ్నలు వేయడం... అడిగిన సమాచారం ఇవ్వకపోవడంతో ఒక్కో కుటుంబం వివరాలు సేకరించేందుకు ఎన్యూమరేటర్లకు 40 నుంచి 60 నిముషాల టైమ్ పడుతుంది.
దీంతో రోజుకు ఒక్కో ఎన్యూమరేటర్ పది కుటుంబాల వివరాల కంటే ఎక్కువ సేకరించలేకపోతున్నారు. సర్వే తమకు సమస్యగా మారి ఇబ్బందులు ఎదుర్కొక తప్పడం లేదంటున్నారు ఎన్యూమరేటర్లు. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 1958 ఎన్యూమరేట్ బ్లాక్ లు ఒక్కొక్క బ్లాక్ లో 175 కుటుంబాలు ఉండగా 1964 మంది ఎన్యూమరేటర్ లు సర్వే విధుల్లో ఉన్నారు.
గడిచిన రెండు రోజుల్లో 20 వేల కుటుంబాల వివరాలు కూడా సేకరించలేకపోయారు. ఇలా అయితే సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల వివరాల సేకరణకు ఎన్ని రోజులు పడుతుందో అర్థం కావడం లేదంటున్నారు ఎన్యూమరేటర్లు.
సరిహద్దు వివాదం... సర్వేకు ఆటంకం
గ్రామ సరిహద్దుల వివాదం సమగ్ర సర్వేకు అడ్డంకిగా మారింది. సరిహద్దు విషయంలో స్పష్టత ఇవ్వాలంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం వెంకట్రావుపల్లె గ్రామస్తులు ఇంటింటి కుటుంబ సర్వేను బహిష్కరించారు. స్టిక్కర్లు వేయనీయలేదు.. సర్వేకు వచ్చిన ఎన్యూమరేటర్ లకు అధికారులకు వివరాలు చెప్పడం లేదు. సర్వేను సాగనివ్వలేదు.
ఇటీవల గ్రామ సరిహద్దులు మార్చుతూ గెజిట్ వచ్చింది. గ్రామస్తులు దానిని వ్యతిరేకిస్తూ నెల క్రితం ఎంపీడీవో, తహసీల్దార్లకు వినతిపత్రాలు ఇచ్చారు. అయినా స్పందన రాకపోవడంతో ఇంటింటా కుటుంబ సమగ్ర సర్వేకు దూరంగా ఉన్నారు. సిరిసిల్ల ఆర్డీవో వెంకటఉపేందర్ రెడ్డి గ్రామస్తులతో మాట్లాడారు. గ్రామ సరిహద్దు ప్రాంతాన్ని పరిశీలించి, మళ్లీ సర్వే చేయిద్దామని.. కుటుంబ సర్వేకు సహకరించాలని కోరారు. కానీ సరిహద్దును రీసర్వే చేశాకే సర్వేకు సహకరిస్తామని గ్రామస్తులు స్పష్టం చేశారు.
(రిపోర్టింగ్ కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)